Monkeypox: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంకీపాక్స్‌పై ఆదివారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన మరునాడే ఈ సమావేశం జరగడం గమనార్హం. ఈ సమావేశంలో మంకీపాక్స్ నివారణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో మరో మహమ్మారి వెలుగుచూస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది.
ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా.. తాజాగా నాలుగో కేసు నమోదు అయింది. శనివారం వరకు నమోదు అయిన మంకీపాక్స్ కేసులు కేరళ రాష్ట్రంలో వెలుగు చూడగా.. నాలుగో కేసు దేశ రాజధాని ఢిల్లీలో బయటపడింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. కేరళలో నమోదు అయిన మూడు కేసుల్లో బాధితులు ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చారు. అయితే ఢిల్లీలో నమోదైన నాలుగో కేసులో బాధితుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఎలాంటి ప్రయాణాలు చేయకుండానే సదురు బాధితుడికి మంకీపాక్స్ వైరస్ సోకింది. ప్రస్తుతం 31 ఏళ్ల బాధితుడు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చేరినట్లు మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. బాధితుడు జ్వరం, చర్మంపై దద్దుర్లతో ఆస్పత్రిలో చేరాడు.
ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో 16 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఎక్కువగా యూరోపియన్ దేశాల్లోనే నమోదు అయ్యాయి. అక్కడే 86 శాతం కేసులు ఉన్నాయి. మరో 11 శాతం కేసులు యూఎస్ఏలో నమోదు అయ్యాయి. తాజాగా శనివారం ప్రపంచ ఆరోగ్యసంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లర్ చేసింది.
Monkeypox Cases: ఒకే వ్యక్తిలో మంకీపాక్స్, కరోనా.. అధికారుల హైఅలర్ట్
కేరళలో జూలై 14న తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఆ తరువాత దుబాయ్ నుంచి కన్నూర్‌కు వచ్చిన 31 ఏళ్ల వ్యక్తికి జులై 18న కేరళ రెండోసారి మంకీపాక్స్ ను గుర్తించారు. జూలై 22న కేరళలో మూడో కేసు బయటపడగా.. జూలై 24న ఢిల్లీలో నాలుగో కేసు వెలుగులోకి వచ్చింది.