దీపావళి పండగ వేళ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గుడ్ న్యూస్ అందించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అందించే వడ్డీని దీపావళికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనుంది. దీంతో దాదాపు 6.5 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని చందాదారులకు పండగకు ముందే అందించనున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ విషయమై త్వరలోనే కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
Read Also: దేశంలో రైతుల ఆత్మహత్యలు… ఏపీ@3, తెలంగాణ@4
2019-20 ఆర్థిక సంవత్సరంలో కేవైసీ ఆటంకాల కారణంగా చాలా మంది సబ్‌స్క్రైబర్‌లు వడ్డీని పొందడానికి 8 నుంచి 10 నెలల వరకు వేచి చూడాల్సి వచ్చింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాలనుకున్న వడ్డీ రేటు 8.5 శాతం గత ఏడేళ్లలో ఇదే కనిష్ఠం. 2015-16లో 8.8 శాతం, అంతకుముందు 2013-14, 2014-15లలో 8.75 శాతం, తిరిగి 2016-17, 2018-19ల్లో 8.65 శాతం వడ్డీ రేటు జమ చేసింది. అయితే కోవిడ్-19 వేళ ఖాతాదారులు విత్‌డ్రాయల్స్ పెంచారు. వారి నుంచి డిపాజిట్లు తగ్గడంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌పై వడ్డీని 8.5 శాతానికి ఈపీఎఫ్‌వో తగ్గించింది.
