NTV Telugu Site icon

Union Budget 2025: మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్‌.. మరిన్ని ప్రోత్సాహకాలు, వడ్డీ రహిత రుణాలు

Budjet

Budjet

Union Budget 2025: 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో అనేక కీలక ప్రకటనలు చేసారు. ఇందులో ముఖ్యంగా.. మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్‌ ను అందిచారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించారు నిర్మలా సీతారామన్‌. అలాగే సీనియర్‌ సిటిజన్స్‌కు TDS మినహాయింపు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అలాగే అప్‌డేటెడ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగించారు. వీటితోపాటు పలు అంశాలను ప్రకటించారు.

రైతులకు పథకాలు:
KCC (కిషాన్ క్రెడిట్ కార్డ్) ద్వారా రైతులకు ఇవ్వబడే లోన్ల పరిమాణం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచినట్లు ప్రకటించారు. దీంతో రైతుల‌కు మరింత ఆర్థిక సాయం అందే అవకాశం ఉంది.

గిగ్ వర్కర్ల కోసం ఆరోగ్య బీమా:
గిగ్ వర్కర్లకు (ఫ్రీలాన్స్ వర్కర్లు) ప్రత్యేకంగా ఆరోగ్య బీమా సదుపాయం, గుర్తింపు కార్డులు, ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు అవకాశం కల్పించేందుకు ఈ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద 1 కోట్ల గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా అందించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది.

విద్య రంగంలో మార్పులు:
బడ్జెట్‌లో విద్యా రంగానికి సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా ప్రకటించబడ్డాయి. ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం తీసుకోగా, ఐదేళ్లలో 75వేల కొత్త మెడికల్ సీట్లు మరియు 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. 22 పర్యాటక ప్రాంతాలలో అభివృద్ధి చర్యలు చేపడతారు.

ఉడాన్ పథకం, రవాణా:
ఉడాన్ పథకాన్ని మరింత విస్తరించి, 120 కొత్త రూట్లలో అమలు చేయనున్నారు. అలాగే, ఈవీ బ్యాటరీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు, క్లీన్‌టెక్ మిషన్ కూడా ప్రకటించారు.

మరింత ప్రోత్సాహకాలు, వడ్డీ రహిత రుణాలు:
రాష్ట్రాలకు రూ. 1.5 లక్షల కోట్ల రుణాలు, మూలధన వ్యయాల కోసం 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు, అలాగే వివిధ రంగాల ప్రగతికి ప్రోత్సాహకాలు అందించేందుకు పథకాలు ప్రకటించబడ్డాయి.

పేదరిక నిర్మూలన లక్ష్యం:
2025 బడ్జెట్‌లో ‘‘వికాస్ భారత్’’ లక్ష్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించబడింది.

డిజిటల్ శిక్షణ:
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.