Union Budget 2023: పార్లమెంట్‌లో ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోందని.. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ప్రపంచ సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొని నిలబడిందన్నారు. జీ20 అధ్యక్ష బాధ్యతలతో భారత్ కీలక ప్రస్థానాన్ని ప్రారంభించిందన్నారు. వృద్ధి రేటు 7శాతం ఉంటుందని అంచనా వేస్తున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు.
”భారత్ ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. దేశంలో గత తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది. అంతర్జాతీయంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది. భారత్‌లో డిజిటల్ యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయి.ఈపీఎఫ్‌లవోలో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఆత్మనిర్భర్ భారత్‌లో చేనేత వర్గాలకు లబ్ధి చేకూరింది. మహిళా సాధికారతకు కృషి చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్. కొవిడ్ సమయంలోనూ ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశాం. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోంది. వంద కోట్లమందికి 220 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించాం. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోంది.” అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యతనిచ్చామన్న కేంద్ర మంత్రి.. రైతులు, మహిళలు,యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనిచ్చామన్నారు. గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు తీసుకొస్తామన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం మరిన్ని నిధుల కేటాయిస్తామన్నారు. మత్స్య శాఖకు రూ.6వేల కోట్ల కేటాయించామన్నారు. మహిళల అభివృద్ధి కోసం మరిన్ని పథకాలు తీసుకొస్తామన్నారు.
వ్యవసాయాభివృద్ధి కోసం..
రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు రూ.2వేల కోట్ల కేటాయించామన్నారు. చిరుధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు అందిస్తామన్నారు. సహకారంతో సమృద్ధి విధానంలో రైతులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. వ్యవసాయ స్టార్టప్‌ల ప్రోత్సాహకానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. వ్యవసాయ అభివృద్ధి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ పరపతి సంఘాలను డిజటలైజ్ చేస్తామని ప్రకటించారు. ఉద్యాన, చిరుధాన్యాల పంటలకు చేయూత అందిస్తామన్నారు. కరువు ప్రాంత రైతులకు 5వేల 300 కోట్లు కేటాయించారు.
2047 లక్ష్యంగా పథకాలు
అమృత కాల విజన్‌పై ఆర్థిక మంత్రి వివరించారు. 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్నారు. ప్రపంచంలో అత్యధికంగా 7 శాతం వృద్ధిరేటు ఉన్న ఆర్థిక వ్యవస్థ భారత్‌దేనన్నారు. సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించామన్నారు. సామాన్యుల సాధికారితకు ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు. హరిత అభివృద్ధి దిశగా అనేక విధానాలు రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత పెంచుతామన్నారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం తీసుకోస్తామన్నారు.
పేదల సంక్షేమం కోసం..
దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. 3.9 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏకలవ్య పాఠశాలలకు 38,800 ఉపాధ్యాయుల నియామకం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్ల కేటాయించారు. యువత కోసం నేషనల్ డిజటల్ లైబ్రరీల ఏర్పాటు చేస్తామన్నారు. 81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
రైల్వే, ఫార్మా రంగాల కోసం..
రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ప్ర్రైవేట్, ప్రభుత్వ పరిశోధనల కోసం ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక తోడ్పాటు అందిస్తామన్నారు. చిట్టచివరి వ్యక్తి వరకు లబ్ధి చేకూరాలన్నదే రెండో లక్ష్యమని మంత్రి ప్రకటించారు.
రాష్ట్రాల కోసం..
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు పథకం కోసం 13.7లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్ఖిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గిరిజన మిషన్ కోసం 10 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 50 ఎయిర్‌పోర్టులు, పోర్టుల పునరుద్ధరణ జరుగుతుందన్నారు. 2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రెట్లు నిధులు పెరిగాయన్నారు. కర్ణాటక సాగు రంగానికి రూ.5,300 కోట్లు సాయం అందిస్తామన్నారు. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా రూ.10 వేల కోట్లు కేటాయించారు. చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నారు. కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు కేటాయించారు. మూలధన వ్యయాలు మొత్తం రూ.10 లక్షల కోట్లుగా మంత్రి వివరించారు. ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి గోవర్దన్ స్కీమ్‌ను తీసుకొస్తామన్నారు. నేషనల్ హైడ్రోజన్ మిషన్‌కు రూ.19,700 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
ఎంఎస్‌ఎంఈలకు ఊరట
63 వేల సొసైటీల కంప్యూటరీకరణకు రూ.2,516 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. 5జీ ప్రోత్సాహకానికి యాప్‌ల అభివృద్ధి కోసం వంద ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. లద్దాఖ్‌లో 13 గిగావాట్ల విద్యుదుత్పత్తికి రూ.20,700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఎంఎస్‌ఎంఈలకు ఊరట లభించింది. కొవిడ్ కాలంలో పూర్తిచేయలేని పనులకు డిపాజిట్ చేసిన మొత్తం తిరిగి చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్ల నిధులు కేటాయిస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారసంస్థలకు డిజిలాకర్ సేవల విస్తరిస్తామన్నారు. కృత్రిమ వజ్రాల తయారీ, అభివృద్ధికి ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి కోసం మిషన్ కర్మయోగిని ఏర్పాటు చేస్తామన్నారు. రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు కేటాయించారు. కృత్రిమ మేథ అభివృద్ధికి 3 సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లు ఏర్పాటు చేయనున్నామన్నారు. సాగు, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల కోసం కృత్రిమ మేథ అభివృద్ధి జరగాలన్నారు. ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు అవుతుందన్నారు. డిజిటల్ ఇండియాకు అనుగుణంగా వన్‌స్టాప్ ఐడెంటిటీ కేవైసీ విధానం రానుంది.