Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించినట్లు సమాచారం. యూనిఫాం సివిల్ కోడ్‌పై అభిప్రాయాలు తెలుసుకునేందుకు న్యాయ కమిషన్, న్యాయ మంత్రిత్వశాఖతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జులై 3న సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. వర్షాకాల సమావేశాలు జూలై మూడవ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది, సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమవుతాయి. మధ్యలోనే కొత్త భవనానికి మారుతాయి.
Also Read: MahaRastra: ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరు మార్పు.. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారమే స్పష్టం చేశారు. సున్నితమైన అంశాలపై ముస్లింలను రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా దీనిపై సానుకూలంగా ఉందని, కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడేవారే దానిని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఒకే దేశంలో రెండు విధానాలు ఏంటని ప్రశ్నించారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు మణిపూర్‌లోని పరిస్థితుల వంటి వాస్తవ సమస్యల నుండి మళ్లించే వ్యూహంగా యూసీసీ సమస్యను ప్రధాని మోడీ ఉపయోగించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. యూనిఫాం సివిల్ కోడ్ అనేది మతాలు, ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా వ్యక్తిగత చట్టాల స్థానంలో మతం, కులాలు, మతం, లైంగిక ధోరణి, లింగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఒక సాధారణ చట్టంతో ఉద్దేశించిన ప్రతిపాదన.