Site icon NTV Telugu

Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..

Court Aunty

Court Aunty

సాధారణంగా మన దగ్గర పెద్దవారిని గౌరవంగా ‘ఆంటీ’ అని పిలవడం అలవాటు. కానీ, లండన్‌లో ఒక భారత సంతతి మహిళను అలా పిలవడం సదరు వ్యక్తికి భారీ జరిమానాను, సదరు సంస్థకు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది. బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS)లో హెల్త్‌కేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇల్డా ఎస్టెవ్స్ (61) అనే భారత సంతతి మహిళ.. తన సహోద్యోగిపై వేధింపుల కేసు వేసి విజయం సాధించారు.

అసలు ఏం జరిగింది..?
పశ్చిమ లండన్ ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఇల్డాను, ఘనా దేశానికి చెందిన చార్లెస్ ఒప్పాంగ్ అనే స్టాఫ్ నర్స్ తరచూ “ఆంటీ” అని పిలిచేవాడు. తనను అలా పిలవవద్దని, పేరుతో పిలవాలని ఇల్డా పలుమార్లు కోరినప్పటికీ అతను వినలేదు. ఆఫీసు కారిడార్లలో.. అందరి ముందు ఆమెను అలా పిలుస్తూ ఎగతాళి చేసేవాడు. అంతేకాకుండా.. మరో వృద్ధ సహోద్యోగితో ఆమెకు జంట కుదురుతుందని కూడా వ్యాఖ్యానించాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇల్డా, ఇది తన వయస్సును, లింగాన్ని కించపరచడమేనని వాట్‌ఫోర్డ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన జడ్జి జార్జ్ అల్లియట్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఘనా సంస్కృతిలో ‘ఆంటీ’ అనేది గౌరవసూచక పదం కావొచ్చు.. కానీ అవతలి వ్యక్తికి ఇష్టం లేనప్పుడు అలా పిలవడం వేధింపుల కిందకే వస్తుంది. చార్లెస్ ఒప్పాంగ్ కావాలనే హాస్యం పేరుతో ఆమెను ఇబ్బంది పెట్టాడని కోర్టు నిర్ధారించింది. ఇల్డా మనోభావాలను దెబ్బతీసినందుకు గాను 1,425.15 పౌండ్లు (సుమారు రూ. 1.8 లక్షలు) నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్ట్‌ను ఆదేశించింది.

పాశ్చాత్య దేశాలలో.. ముఖ్యంగా పని ప్రదేశాలలో (Workplaces), వృత్తిపరమైన మర్యాదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ఎవరినైనా వారి అనుమతి లేకుండా వయస్సును సూచించే పదాలతో పిలవడం ‘ఏజ్ డిస్క్రిమినేషన్’ కిందకు వస్తుంది. ఈ తీర్పుతో పని చేసే చోట ఎదుటివారి ఇష్టాయిష్టాలను గౌరవించడం ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది. భారత సంతతి మహిళ పట్టుదలతో పోరాడి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మరికొందరు మాత్రం ఆంటీ అని పిలవడంలో తప్పేముంది అంటూ సోషల్ మీడియాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version