NTV Telugu Site icon

Rishi Sunak: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. అందరి చూపు రిషి సునాక్‌ వైపే?

Rishi Sunak

Rishi Sunak

Rishi Sunak: బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం నాటికి తదుపరి ప్రధానిని ఎన్నికుంటారని ఆమె ప్రకటించడంతో తదుపరి ప్రధాని ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆమె ఈ విషయాన్ని ప్రకటించడంతో అందరి చూపు తాజాగా ఎన్నికల్లో ఓటమి పాలైన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌పై పడింది. బ్రిటన్‌లో ఆర్థిక మాంద్యం తలెత్తతుందన్న ఆందోళనల నేపథ్యంలో తాను పదవిని నిర్వర్తించే పరిస్థితి లేక రాజీనామా చేస్తున్నట్లు లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. తన రాజీనామా విషయాన్ని బ్రిటన్‌ రాజుకు తెలియపరిచానని.. తదుపరి ప్రధానిని ఎన్నుకొనేవరకు పదవిలో కొనసాగనున్నట్టు తెలిపారు. మినీ బడ్జెట్‌తో తీవ్ర విమర్శలపాలైన ట్రస్‌.. తన వాగ్దానం నిలబెట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ప్రభుత్వ పనితీరు పట్ల సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం, ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పడంతో లిజ్ ట్రస్ పదవి నుంచి తప్పుకున్నారు. తద్వారా బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తిగా లిజ్ ట్రస్ రికార్డుల్లోకెక్కారు. మినీ బడ్జెట్‌తో పాటు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రధాని కూడా తప్పుకోవడం కలకలం రేపింది.

యూకే ప్రధాని పదవికి బోరిస్‌ జాన్సన్ రాజీనామా తర్వాత కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల్లో రిషి సునాక్‌పై విజయం సాధించిన లిజ్‌ట్రస్‌ సెప్టెంబర్‌ 5న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లిజ్‌ ట్రస్‌. ప్రధానమంత్రి హోదాలో ఎంపీల ప్రశ్నలకు జవాబివ్వడానికి ట్రస్‌ బుధవారం పార్లమెంటుకు వచ్చిన సందర్భంలో కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఇటీవల లిజ్‌ట్రస్‌ ప్రకటించిన మినీ బడ్జెట్‌ ఆ దేశంలో మాంద్యాన్ని చక్కదిద్దకపోగా బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ మరింత గందరగోళానికి గురైంది. ఈ క్రమంలోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, లిజ్‌పై ఒత్తిడికి కారణమైంది. మార్కెట్లు కుప్పకూలడం, పౌండ్‌ విలువ పతనం గందరగోళానికి దారితీసింది. అయితే, ఈరోజు ఆమె రాజీనామా ప్రకటించడంతో చోటుచేసుకున్న పరిణామాల వేళ పౌండ్‌ విలువ 0.36శాతం పెరిగినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

Liz Truss Resign: యూకే ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామా.. అక్కడ మళ్లీ రాజకీయ సంక్షోభం

కన్జర్వేటివ్‌ పార్టీ నేత జెర్మీ హంట్‌ తాను ప్రధాని రేసులో లేనని ప్రకటించడంతో తదుపరి ప్రధానిగా ఎవరికి అవకాశం వస్తుందన్న చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ప్రధానంగా రిషి సునాక్‌ పేరు వినిపిస్తోంది. లిజ్‌ ట్రస్‌ రాజీనామా తర్వాత ప్రధానంగా ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో రిషి సునాక్‌ పేరు ముందు వరుసలో ఉండగా.. ఆ తర్వాత పెన్నీ మోర్డాంట్‌, బెన్‌ వాల్స్‌, టామ్ తుగెందాట్‌లతో పాటు బోరిస్‌ జాన్సన్ పేరు కూడా వినిపిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ప్రధాని పదవికి బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయడంతోనే లిజ్‌ట్రస్‌ తదుపరి ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అలాగే, బ్రిటన్‌ హోంసెక్రటరీ పదవికి నిన్న రాజీనామా చేసిన సుయెల్లా బ్రేవర్మన్‌ పేరు కూడా ప్రచారంలో ఉన్నట్టు సమాచారం.

Show comments