NTV Telugu Site icon

Yogi Adityanath: వారికి దీపావళి కానుక.. ఒక గ్యాస్‌ సిలిండర్‌ ఫ్రీ..

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: ఉజ్వల పథకం లబ్ధిదారులకు దీపావళి కానుకగా ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ప్రకటించారు. బులంద్‌షహర్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.632 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్టులలో ప్రారంభోత్సవం చేసిన రూ.208 కోట్ల విలువైన 104 ప్రాజెక్టులు, శంకుస్థాపన చేసిన రూ.424 కోట్ల విలువైన 152 ప్రాజెక్టులు ఉన్నాయి.

“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల యోజన ద్వారా ప్రతి కుటుంబానికి బహుమతిని అందించారు. సిలిండర్ ధరలను రూ.300 తగ్గించారు. ఇప్పుడు మేము ప్రతి ఉజ్వల యోజన కనెక్షన్ లబ్ధిదారునికి దీపావళి కానుకగా ఒక వంట గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా అందించాలని నిర్ణయించాము.” అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2014లో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు పొందడం చాలా కష్టమైన పని అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే సుమారు 1.75 కోట్ల కుటుంబాలు ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందాయని ఆయన చెప్పారు. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అనేది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్ కోసం ఆర్థిక సహాయాన్ని అందించే కేంద్ర ప్రభుత్వ చొరవ.

Also Read: President Gallantry Medals: నాలుగు శౌర్య పతకాలు ఒక పతకంగా విలీనం.. ఇప్పుడు ఈ పేరుతోనే పిలుస్తారు..

ఇతర బీజేపీ పథకాలను హైలైట్ చేస్తూ.. పీఎం ఆవాస్ యోజన కింద ఉత్తరప్రదేశ్‌లో 55 లక్షల మంది మహిళలు ఇంటి యజమానులుగా మారారని, ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం కింద రాష్ట్రంలో 2.75 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని ముఖ్యమంత్రి చెప్పారు.”గత తొమ్మిదేళ్లలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మనమందరం కొత్త భారతదేశాన్ని చూశాము. ఈ కొత్త భారతదేశం సంపన్నమైనది, శక్తివంతమైనది, స్వావలంబనతో కూడుకున్నది” అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2014 తర్వాత దేశంలోని యువత, మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజలు, పౌరులకు కొత్త భారతదేశం ప్రయోజనం చేకూర్చిందని ఆయన అన్నారు.

ఆసియా క్రీడల్లో పారుల్ చౌదరి (మహిళల 5000మీ), అన్నూ రాణి (జావెలిన్) బంగారు పతకాలు సాధించే స్థాయికి చేరుకున్నారని, ఇద్దరూ దేశానికి ప్రశంసలు తెచ్చిపెట్టారని పేర్కొన్నారు. వారిద్దరినీ డిప్యూటీ ఎస్పీలుగా నియమిస్తామన్నారు. బంగారు పతక విజేతలకు (ఈ ఏడాది ఆసియా క్రీడల్లో) రూ.3 కోట్లు, రజత విజేతలకు రూ.1.5 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.75 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

‘బేటీ బచావో, బేటీ పడావో’, ‘ఖేలో ఇండియా’, ‘ఫిట్ ఇండియా’ వంటి ప్రచారాలను ప్రారంభించినందుకు ప్రధానిని యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు, దీని ఫలితంగా మహిళలు అంతర్జాతీయ ఈవెంట్‌లలో దేశానికి ప్రశంసలు తెచ్చారని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్‌తో పాటు యూపీ ప్రభుత్వ బులంద్‌షహర్ ఇన్‌ఛార్జ్ మంత్రి అరుణ్ సక్సేనా, బీజేపీ పశ్చిమ యూపీ ప్రాంతీయ అధ్యక్షుడు సతేంద్ర సిసోడియా, లోక్‌సభ ఎంపీ భోలా సింగ్, రాజ్యసభ ఎంపీ సురేంద్ర నగర్ తదితరులు పాల్గొన్నారు.