సిటీలలో ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లాలంటే బస్సులు, షేర్ ఆటోల తర్వాత ఉబర్, తదితర క్యాబ్ సేవలను వినియోగిస్తున్నారు ప్రజలు. ఉబర్ క్యాబ్ సేవలు అందరికీ సుపరిచితమే. ఈ ప్రముఖ సంస్థ ఇటీవల మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో బస్సు సేవలను కూడా ప్రారంభించనుంది. దేశ రాజధాని నగరం దిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. దిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద ఇకపై బస్సులను నడిపేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు దిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్ సైతం అందుకుంది. ఈ తరహా లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖ దిల్లీనే. దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్ నిలిచింది. ఈ సేవలను విస్త్రృతం చేసేందుకు యత్నిస్తోంది.
READ MORE: Anand Deverakonda: ఫ్యామిలీ స్టార్ నెగిటివిటీ ఆ గ్రూప్ పనే.. ఆనంద్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా ఉబర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. ఏడాదిగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు, కోల్‌కతాలోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు నడుపుతున్నామని ఆయన వెల్లడించారు. దిల్లీలో బస్సులకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు గమనించామని తెలిపారు. ఇప్పుడు అధికారికంగా తమ సేవలను దిల్లీలో ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. బస్సు సర్వీసులకు వారం ముందు నుంచే ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. బస్సు రాబోయే సమయం, బస్సు లైవ్ లొకేషన్, బస్సు రూట్లను ఎప్పటికప్పుడు ఉబర్ యాప్‌లో తెలుసుకోవచ్చని చెప్పారు. ఒక్కో సర్వీసులో 19-50మంది ప్రయాణించడడానికి వీలుంటుందన్నారు. ఉబర్ టెక్నాలజీ సాయంతో స్థానిక ఆపరేటర్లు వీటిని నడుపుతారని అమిత్ పాండే వెల్లడించారు. కాగా.. ఢిల్లీ, కోల్ కతాలలో ప్రయోగాత్మకంగా నడిపి.. మంచి గుర్తింపు లభిస్తే దేశంలోని పెద్ద నగరాల్లో సేవలను విస్త్రృతం చేసేందుకు ఉబర్ పూనుకుంది.