NTV Telugu Site icon

Unstoppable 2: ‘ఆహా’… నటరత్నను స్మరించుకున్న ఆ ఐదుగురు!

Unstoppable 2

Unstoppable 2

Unstoppable 2: తన ఊపిరిలో సదా నిలచిపోయే తన ప్రాణం ‘తెలుగు సినిమా’ అంటూ నందమూరి బాలకృష్ణ తన ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్ ఐదో ఎపిసోడ్ ను ఆరంభించారు. తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే తన ఛాతీ విప్పారుతుందని, తెలుగు సినిమా అనగానే మరపురాని మరువలేని ‘మూడక్షరాల పేరు’ యన్.టి.ఆర్. గుర్తుకు వస్తారని ఆయన చెప్పగానే అక్కడ సందడి మొదలయింది. యన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో భాగంగా ఈ ఎపిసోడ్ ను రూపొందించారు. యన్టీఆర్ ను తన కన్నతండ్రిగానే కాదు, తన గురువు, దైవంగానూ బాలయ్య అభివర్ణించారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి నటనాధీరుడు కనిపించరని బాలయ్య అన్నారు. ఇది ప్రతినటుడూ అంగీకరించి తీరవలసిందే అని ఆయన చెప్పారు. ఈ ఎపిసోడ్ యన్టీఆర్ ఏవీతో ఆరంభం కావడం మరింత విశేషం! అలాగే యన్టీఆర్ పాటలతో ఓ డాన్స్ బాలే కూడా నిర్వహించడం కనువిందు చేస్తుంది.

ఈ ఎపిసోడ్ లో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబును తనలాగే చిత్రసీమలో చిన్నప్పటి నుంచీ ఉన్నవారని చెబుతూ, వారిద్దరూ తన మిత్రులనీ అంటూ ఆహ్వానించారు బాలకృష్ణ. మీరెందుకని నటనలో రాణించలేదని అరవింద్ ను ప్రశ్నించగా “ఎంప్లాయిగా కాదు, ఎంప్లాయర్ గా ఉండాలని నిర్మాతనయ్యాను” అని చెప్పారు. తనతో సినిమా బ్యాలెన్స్ ఉందని బాలయ్య, అరవింద్ ను ప్రశ్నించగానే, “మీరు, చిరంజీవి కాంబినేషన్ లో తీద్దామని ఆగాను” అని చెప్పగానే, “అందులో ఫైట్స్ నాకు, పాటలు చిరంజీవికి పెట్టండి” అని బాలయ్య అనడమూ అలరించింది. ‘ఆ నలుగురులో ఇద్దరు మీరే కదా…” అన్న ప్రశ్నకు సురేశ్ బాబు ఎంతో వివరంగా సమాధానమిచ్చారు. అది ఆకట్టుకుంటుంది. ఈ సమాధానం భావితరాలకు ముఖ్యంగా చిత్ర నిర్మాణంలో అడుగు పెట్టాలనుకున్నవారికి ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పవచ్చు. ఇదే ప్రశ్నకు తాము ఎందుకు థియేటర్లు లీజ్ కు తీసుకున్నామో అరవింద్ సమాధానమిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక థియేటర్లను తాము లీజుకు తీసుకోవడం వల్ల, అవి బాగు పడ్డాయని అందువల్లే మీ లాంటి హీరోలకు పెద్ద మొత్తాలు వస్తున్నాయని అరవింద్ వివరించారు. ఈ నలుగురితో పాటు ఇంకా పద్నాలుగు మంది ఉన్నారని, అందరూ కలసి తెలుగు సినిమాను బతికించే పనిచేస్తున్నామని అరవింద్ చెప్పారు.

Adi Saikumar: సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్న ‘టాప్ గేర్’ టీజర్!

ఓ ప్రశ్నకు సమాధానంగా సురేశ్ బాబు, “వెంకటేశ్ తో సినిమా తీస్తే, అతనికి కొంచెం ఇచ్చి, మిగతాది సురేశ్ ప్రొడక్షన్స్ లెక్కల్లోనే రాయించుకుంటామని” వివరించారు. తానయితే చిరంజీవి, బన్నీ, శిరీష్ తో సహా ఎవరితో తీసినా, రిలీజ్ కు ముందే సెటిల్ చేసేస్తానని అరవింద్ చెప్పారు. బాలకృష్ణ ప్రశ్నలకు సురేశ్, అరవింద్ ఇద్దరూ తమదైన పంథాలో సమాధానాలు ఇవ్వడం ఆకట్టుకుంటుంది. ‘నెపోటిజమ్’పై అడిగిన ప్రశ్నకు అరవింద్ “కొందరు డెఫినిట్ గా నన్ను ట్రోల్ చేస్తారు” అని ఆయనే ట్రోల్ చేసేవారికి ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు సంధించారు. అందులో ఇలా ట్రోల్ చేసేవారు గుండెల మీద చేయి వేసుకొని, తాము కూడా నెపోటిజమ్ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటే ఇలాగే ట్రోల్ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చుకుంటే మంచిదని ఆయన అన్నారు. అలాగే ఇందుకు సంబంధించిన పలు అంశాలనూ అరవింద్ ఉదాహరణలతో వివరించడం ఆకట్టుకుంటుంది. అనేక రకాల వృత్తుల్లో వారసత్వం కొనసాగుతోందని, దీనికి ట్రోల్ చేసేవారు సమాధానమివ్వాలని ఆయన కోరారు. నెపోటిజమ్ కేవలం ఛాన్స్ ఇస్తుందని, టాలెంట్ లేకుంటే ఎవరూ రాణించలేరని సురేశ్ బాబు సమాధానమిచ్చారు. సంక్రాంతికి తనకు ఎన్ని థియేటర్లు ఇస్తారని బాలయ్య సూటిగా అడగ్గా, ‘ఇవ్వగలిగినన్ని ఇస్తాం’ అని అరవింద్ అనగా, ‘డిస్ట్రిబ్యూటర్స్ రిలేషన్ బట్టి ఇస్తామని’ సురేశ్ బాబు చెప్పారు. కోవిడ్ సమయంలో టిక్కెట్ రేట్ల విషయంలో బ్యాచ్ లు బ్యాచ్ లు గా బెజవాడ వెళ్ళొచ్చారు. ఆ బ్యాచ్ లో మీరెందుకు లేరని అడిగారు బాలయ్య. అందుకు దానిపై తనకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయముందని అందువల్ల వెళ్ళలేదని సురేశ్ బాబు చెప్పారు. ఒకే ఇంటి నుండి చిరంజీవి వెళ్తూండగా, తానెందుకని వెళ్ళలేదని అరవంద్ సమాధానమిచ్చారు. ఓటీటీలు వచ్చినా సినిమా మనుగడ ఉంటుందని, ఎంటర్ టైన్ మెంట్ ఫరెవర్ అని అందరూ అంగీకరించారు.

Singam Series: నార్త్ సౌత్ ‘సింహాలు’ కలుస్తాయా?

‘ప్రకాశ్ రాజ్ లాగా లేట్ గా వచ్చే ఆర్టిస్ట్ ఎవరు?’ అన్న ప్రశ్నకు అరవింద్ తన తండ్రి ‘అల్లు రామలింగయ్య’ పేరు రాయగా, ‘ఒకప్పుడు రాజేశ్ ఖన్నా, వాణిశ్రీ లేట్ గా వచ్చేవారని’ సురేశ్ చెప్పారు. ఈ జనరేషనలో ‘మహానటి’ అనిపించుకొనేదెవరు అన్న ప్రశ్నకు అరవింద్, సురేశ్ బాబు ఇద్దరూ ‘సమంత’ పేరును రాయడం వశేషం! ఆ తరువాత కె.రాఘవేంద్రరావును ఆహ్వానించారు. రాఘవేంద్రరావును, “వీళ్ళ తమ్ముణ్ణి, వాళ్ళబ్బాయిని డైరెక్ట్ చేశారు. అప్పుడు వీళ్ళు మిమ్మల్ని ఎలా టార్చర్ పెట్టారు” అని అడగ్గా, దానికి రాఘవేంద్రరావు ఇచ్చిన సమాధానం భలేగా వినోదం పంచింది. “నిన్నూ…చిరంజీవిని పెట్టి సినిమా తీద్దామని అనుకున్నారు కదా… దానికి నేను డైరెక్షన్ చేస్తాను…” అని రాఘవేంద్రరావు అనడం నవ్వులు పూయించింది. స్క్రీన్ పై పోస్టర్స్ వేసి వాటికి తగ్గ సమాధానాలను ఆ ముగ్గురి నుండీ రాబట్టడం కూడా సరదాగా ఉంది. తరువాత దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డిని కూడా ఆహ్వానించారు. ఆయన వచ్చిన తరువాత కూడా వినోదం రెట్టింపయింది. తెరపై తమకు చప్పట్లు కొట్టించేవారెందరో తెరవెనుక ఉన్నారని, అలాంటి వారిలో కాస్ట్యూమర్ ఉద్దండు ఒకరని బాలయ్య చెప్పారు. తరువాత కాస్ట్యూమర్ ఉద్దండు ఏవీ వేశారు. ఆయన పరిస్థితి చూసిన తరువాత కె.రాఘవేంద్రరావు తన వంతుగా రూ.50 వేలు ప్రకటించారు. 24 క్రాఫ్ట్స్ ను చూసుకోవడం తమ బాధ్యత అని అరవింద్, సురేశ్ బాబు అన్నారు. ఉద్దండును రియల్ హీరోగా బాలయ్య అభివర్ణించారు. అలాంటి రియల్ హీరోస్ కోసం అంటూ కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చి ఆనందింపచేశారు.

యన్టీఆర్ శతజయంతి సందర్భంగా జ్యోతిప్రజ్వలన చేయడం విశేషం! ఈ సందర్భంగా యన్టీఆర్ గురించి ఆ నలుగురూ తమ అనుభవాలు చెప్పడం ఆకట్టుకుంది. అలా రెండో సీజన్ లోని ఐదో ఎపిసోడ్ యన్టీఆర్ ను స్మరించుకోవడంతో ఆరంభమై, ఆయనను గురించి స్మరించుకుంటూనే ముగియడం ఆకట్టుకుంటుంది.