తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్విషా అత్తగారైన గిరిబాలా సింగ్‌ను భోపాల్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి నుంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార శాఖ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో గిరిబాలా సింగ్ పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెపై భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపులు, వరకట్న మరణం కేసులు నమోదయ్యాయి. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారిక విచారణకు ఆదేశించింది. మే 20, 2026న ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల పరిరక్షణ శాఖ జారీ చేసిన లేఖలో.. రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ రిజిస్ట్రార్‌కు విచారణ చేపట్టి అత్యవసరంగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 2020 నిబంధనలలోని రూల్ 9(2) ప్రకారం ఈ దర్యాప్తు కొనసాగనుంది. గిరిబాలా సింగ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వరకట్న వేధింపులు, నేరపూరిత ఉద్దేశంతో కలసికట్టుగా వ్యవహరించడం వంటి సెక్షన్లు నమోదు చేశారు. అలాగే వరకట్న నిషేధ చట్టం కింద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పదవి నుంచి తొలగించారు. ఇక ఈ కేసులో బెయిల్ కూడా లభించింది.
ఇదిలా ఉంటే నోయిడాకు చెందిన నటి ట్విషా శర్మ మే 15న భోపాల్‌లోని అత్తగారింట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. పెళ్లైన ఐదు నెలలకే ఆమె మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ట్విషా.. భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌ను 2024లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకుని.. 2025 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత నుంచి వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు, పోస్ట్‌మార్టం ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఎయిమ్స్‌లో రెండో పోస్ట్‌మార్టం చేయాలన్న కుటుంబ సభ్యుల అభ్యర్థనను భోపాల్ కోర్టు బుధవారం తిరస్కరించింది.
ఇక ఈ కేసుపై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.. సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు. మరోవైపు భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ మాత్రం ఇప్పటివరకు దర్యాప్తులో హత్యకు ఆధారాలు లేవని.. ఆత్మహత్య కోణంలోనే కేసు ముందుకు సాగుతోందని వెల్లడించారు.
