Site icon NTV Telugu

Vijay’s TVK Candidates List: టీవీకే అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో విడుదల.. రెండు స్థానాల్లో విజయ్ పోటీ!

Vijay's TVK Candidates List

Vijay's TVK Candidates List

TVK Vijay contesting Perambur Trichy East: నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయనున్న 234 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన టీవీకే అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేశారు. తాను పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ‘సి జోసెఫ్ విజయ్’ పేరుతో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలోని నుంగంబాకం ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో టీవీకే అభ్యర్థుల జాబితాను విజయ్ ప్రకటించారు.

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులను టీవీకే బరిలోకి దింపింది. ఎన్ ఆనంద్, అధవ్ అర్జున, ఆర్ అరుణ్‌రాజ్, సిటిఆర్ నిర్మల్ కుమార్, కేఏ సెంగోట్టయ్యన్ వంటి సీనియర్ నాయకులను టి నగర్, విల్లివాక్కం, గోబిచెట్టిపాలయం, తిరుప్పరన్‌కుండ్రం వంటి కీలక స్థానాల నుంచి బరిలోకి దింపారు. డీఎంకే నిరంకుశ పాలనకు ముగింపు పలకడానికి మనం ఈ ఎన్నికల్లో గెలవాలని అభ్యర్థులతో విజయ్ అన్నారు. ‘నేను ప్రతి చోట ఉండలేను, అందుకే ప్రజలతో నిలబడే నాయకులను ఎంపిక చేశాను’ టీవీకే అధినేత అన్నారు.

విజయ్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఎన్నికల అజెండాలో యువతపై ప్రత్యేక దృష్టి పెట్టిన విజయ్.. పలు హామీలు ఇచ్చారు. తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం, 12వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు రూ.20 లక్షల వరకు కాలేటరల్ ఫ్రీ విద్యా రుణాలు, పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, వ్యాపారారంభానికి సహాయం వంటి అంశాలను మేనిఫెస్టోలో ప్రకటించారు.

Also Read: IAS Officer Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే దశలో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ గడువు మే 10తో ముగియనుంది. తమిళనాడులో ప్రధాన పోటీ డీఎంకే ఆధ్వర్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్‌పీఏ), ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి మధ్య ఉండగా.. విజయ్ టీవీకే పార్టీ రంగప్రవేశంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్.. తన తొలి ఎన్నికల పోరులోనే బలమైన ప్రభావం చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Exit mobile version