Site icon NTV Telugu

TV Rama Rao: నేను ఏ తప్పు చేయలేదు.. టీవీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు!

Janasena Tv Rama Rao

Janasena Tv Rama Rao

జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ కాప్లిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం పట్ల టీవీ రామారావు విచారం వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. కార్యకర్తల మనోభవాలు దెబ్బతిన్న కారణంగా ఆగ్రహంతో రోడ్డెక్కారని స్పష్టం చేశారు. అధిస్థానం తీసుకున్న నిర్ణయానికి తాను శిరస్సు వహిస్తున్నా అని టీవీ రామారావు చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు మీడియాతో మాట్లాడారు. ‘నేను ఏ తప్పు చేయలేదు. కొవ్వూరు నియోజకవర్గంలో 14 సొసైటీలు ఉంటే.. వాటిలో మూడు జనసేన పార్టీకి కేటాయించాలని కోరాం. మాతో సంప్రదించకుండా టీడీపీ ఎమ్మెల్యే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. మనోభవాలు దెబ్బతిన్న కారణంగా కార్యకర్తలు ఆగ్రహంతో రోడ్డెక్కారు. సొసైటీ పదవులను ఆశించిన కార్యకర్తలను తాను సముదాయించినా.. వినే పరిస్థితిలో లేకపోవడంతో ఇలా జరిగింది. సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాదిరిగా ఇక్కడ కూడా నాయకులు పనిచేస్తే.. ఎటువంటి విభేదాలు ఉండవు. దీని ప్రభావం రేపు స్థానిక సంస్థల ఎన్నికలపై చూపే ప్రమాదం ఉంది. ఏదేమైనా అధిస్థానం తీసుకున్న నిర్ణయానికి నేను శిరస్సు వహిస్తున్నా’ అని టీవీ రామారావు తెలిపారు.

Also Read: Perni Nani: మీరు పట్టించుకోరు.. వైఎస్ జగన్ వెళ్తే ఏడుస్తారు!

కొవ్వూరు నియోజకవర్గంలోని 14 సొసైటీలు ఉన్నాయి. దీనిలో మూడు పదవులు తమకు కేటాయించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. అయితే జనసేన పార్టీ నేతలను సంప్రదించకుండా.. కేవలం ఒక సొసైటీ పదవే కేటాయించారు. దాంతో జనసేన నేతలతో పాటు కొవ్వూరు ఇంచార్జి టీవీ రామారావు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని జనసేన అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టారని టీవీ రామారావుపై వేటు వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. 2009లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీవీ రామారావు టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీలో చేరిన ఆయన.. 2023లో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.

Exit mobile version