Tulasi Ramachandra Prabhu: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచుతుంది.. మొన్నటి మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి.. బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. ఇక మరిన్ని చేరికలు ఉంటాయని.. మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు, పారిశ్రామికవేత్తలు పార్టీలోకి వస్తారంటూ ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నమాట.. ఈ నేపథ్యంలో.. ఈ రోజు బీజేపీలో చేరనున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది.. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే కోర్ కమిటీ సమావేశంలో జాతీయ సంఘటన కార్యదర్శి శివ ప్రకాష్ , కేంద్ర విదేశాంగ మంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ వి. మురళీధరన్, జాతీయ కార్యదర్శి సునీల్ డియోధర్, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి , జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ తదితరులు పాల్గొననున్నారు.
Read Also: Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య..
అయితే, మురళీధరన్, సోమువీర్రాజుల సమక్షంలో నేడు బీజేపీలో చేరనున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు. ఇప్పటికే గుంటూరు నుండి రాజమహేంద్రవరం బయల్దేరి వెళ్లారు తులసీ రామచంద్ర ప్రభు. కాగా, గుంటూరుకు చెందిన తులసీ సీడ్స్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు.. 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన విషయం విదితమే.. అయితే, గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కలసి పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతూ వస్తున్నారు.. మొత్తంగా ఈ రోజు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు.. పారిశ్రామికంగా సేవారంగల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన తులసి రామచంద్ర ప్రభు.. రానున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. మరి, బీజేపీ ఆయన్ని ఏ స్థానం నుంచి బరిలోకి దించుతుందో చూడాలి. గతంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. మరోసారి అదేస్థానం నుంచి బరిలోకి దిగుతారా? అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది.