NTV Telugu Site icon

TTD Tigers: ఆపరేషన్‌ ‘చిరుత’ సక్సెస్‌.. ఇక కాలినడక భక్తులు ప్రశాతంగా వెళ్లొచ్చు!

Ttd Tigers

Ttd Tigers

TTD Operation Cheetah successfully completed: తిరుమల శేషాచలం కొండల్లో ‘ఆపరేషన్‌ చిరుత’ విజయవంతంగా ముగిసింది. గత వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత.. ఎట్టకేలకు ఆదివారం (ఆగష్టు 27) రాత్రి బోనులో చిక్కింది. దాంతో అలిపిరి కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించినట్లు అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫీసర్‌ (సీసీఎఫ్‌వో) తెలిపారు. చిరుత రక్త నమూనాలు సేకరించి.. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

గత కొన్నిరోజులుగా అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. చిన్నారి కౌశిక్‌పై దాడి, లక్షిత మృతితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు చేపట్టింది. టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మూడింటిని పట్టుకోగా.. నాలుగో చిరుత బోను దాకా వచ్చి తప్పించుకుపోతోంది. వారం రోజుల అనంతరం ఆదివారం రాత్రి 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది.

Also Read: Asia Cup 2023: ‘ఖుషీ’గా క్రికెట్ మెమోరీస్ పంచుకోవడానికి వస్తున్న ‘రౌడీ’ హీరో.. మిస్ కాకుండా చూడండి!

ఈ చిరుత పట్టివేతతో ఆపరేషన్‌ చిరుత ముగిసినట్లేనని టీటీడీ అధికారులు అంటున్నారు. చిరుతల పట్టివేత పూర్తి కావడంతో ఇకపై భక్తులు ప్రశాంతంగా నడకమార్గంలో వెళ్లే అవకాశం ఉందన్నారు. బాలిక లక్షితపై దాడి చేసింది ఏ చిరుతో తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహించాం అని సీసీఎఫ్‌వో నాగేశ్వరరావు తెలిపారు. వన్య ప్రాణుల జాడల కోసం 300 కెమెరాలతో ఎప్పటికపుడు అన్వేషణను కొనసాగిస్తున్నామన్నారు. కాలి నడక మార్గంలో 500 కెమెరాలను ఏర్పాటు చేసి వన్య ప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని ఆయన చెప్పారు.