NTV Telugu Site icon

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌..

Ttd

Ttd

TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త.. 2024 జనవరి నెల‌ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ప్రత్యేక దర్శనం, వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్న తేదీలను ప్రకటించింది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ.. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు దానికి సంబంధించిన రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also: Budget Smartphones 2023: ‘బిగ్ బిలియన్ డేస్’ టాప్ డీల్స్.. అతి తక్కువ ధరకే ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్!

ఇక, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.. వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను అక్టోబర్ 21వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీ‌వాణి ట్రస్టు బ్రేక్ ద‌ర్శనం, గ‌దుల కోటాను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఇక, వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.. ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం రూ.300 టికెట్ల కోటాను అక్టోబర్ 24వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ.. తిరుమ‌ల‌, తిరుప‌తిలో వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ అక్టోబర్ 25వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేస్తారు. మరోవైపు.. డిసెంబరు నెలకు సంబంధించి అక్టోబరు 27న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, ఉదయం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేయనున్నారు.. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ.

Show comments