Site icon NTV Telugu

TSRTC Milestone: మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. విజయవంతంగా 19 నెలలు!

Tsrtc Milestone

Tsrtc Milestone

TSRTC Milestone: తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటింది. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. మంగళవారం నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 199.71 కోట్ల జీరో టికెట్లను టీజీఎస్ ​ఆర్టీసీ జారీ చేయగా.. నేడు 200 కోట్ల మార్క్ తాకింది. 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్‌ స్టేషన్లలో సంబరాలు చేయనున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మహిళల కోసం తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకానికి భారీ ఆదరణ వస్తోంది. 19 నెలలుగా ఉచిత బస్సు పథకం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలకు టీజీఎస్ ఆర్టీసీ జీరో టికెట్లను జారీ చేస్తోంది. బస్​ టికెట్ల ఛార్జీల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌ చేస్తోంది. మహిళలు ఉచిత ప్రయాణం కోసం రూ.6700 కోట్లు అయినట్లు ఆర్టీసీ పేర్కొంది.

Also Read: Gold Rate Today: గోల్డ్‌ ప్రియులకు భారీ షాక్.. నేడు తులం బంగారం రేటు ఎంతో తెలుసా?

2023 డిసెంబరు 9న ఆర్డినరీ, మెట్రో ఎక్స్​ప్రెస్, పల్లె వెలుగు, ఎక్స్​ప్రెస్​లలో ఉచిత పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించింది. ఈ పథకానికి శ్రీకారం చుట్టిన ఆరంభంలో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 35 లక్షలకు చేరింది. హైదరాబాద్‌లోనే 8 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ తీరు మారింది. గతంలో బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి 67 శాతం ఉంటే.. ఇప్పుడు అది 95 శాతానికి పెరిగింది.

Exit mobile version