రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 19 వరకు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సీనియారిటీ జాబితాపై ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ల పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లా కేటాయించారని పిటిషనర్లు వాదించారు. రంగారెడ్డి జిల్లా క్యాడర్ కన్నా ఎక్కువ టీచర్లను కేటాయించారని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Also: Amit Shah: లాలూ, నితీష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు.. దర్భంగా ఎయిమ్స్ పనులపై ఫైర్
ప్రాథమిక సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వకుండా పదోన్నతులకు సిద్ధమయ్యారు అని పిటిషనర్లు ఆరోపించారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది సీనియారిటీ జాబితా రూపొందిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. తుది సీనియారిటీ జాబితా ఇవ్వకుండా పదోన్నతులు ఇవ్వబోమని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ఈనెల 19 వరకు సమయం ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తిని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి, డీఎస్ఈ, రంగారెడ్డి డీఈవోకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. ప్రాథమిక సీనియార్టీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Srisailam: శ్రీశైలంలో 18 నుంచి 27 వరకు వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు