TS MLC: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరితోనూ ప్రమాణం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Read Also: Rajyasabha: నితీష్-అజిత్ పవార్ రాకతో ఎన్డీయేకు పెరగనున్న సీట్లు
ఇటీవల కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడాన్ని బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. ఎమ్మెల్సీలుగా తమ పేర్లను తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడాన్ని బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు సవాల్ చేశారు. మంత్రి మండలి తీర్మానం చేసి పంపిన పేర్లను గవర్నర్ తిరస్కరించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.