US Iran Talks: పాకిస్థాన్‌కు ట్రంప్ బిగ్ షాక్.. ఇరాన్ చర్చల నుంచి పొమ్మనకుండా పొగబెట్టారా?

Us Pak

Us Pak

Trump’s Iran Talks: అమెరికా, ఇరాన్ మధ్య మరలా చర్చల ప్రక్రియ పునఃప్రారంభమవుతున్న వేళ, పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌తో చర్చలకు శ్రీకారం చుట్టడానికి ఆ దేశమే కారణమని, ఈ ప్రక్రియలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్ దేశాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఈసారి ట్రంప్ తన ప్రసంగంలో పాకిస్థాన్ పేరును అసలు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇరాన్‌పై పెద్ద ఎత్తున సైనిక దాడికి దిగకుండా, చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దేశాలు అమెరికాను ప్రోత్సహించాయని ట్రంప్ తెలిపారు. హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం కనుగొనడం ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికాతో నేరుగా చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వాదనను ఇరాన్ ఖండించింది. ప్రస్తుతం తమ చర్చలు హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై కేవలం ఒమన్ దేశంతో మాత్రమే జరుగుతున్నాయని ఇరాన్ స్పష్టం చేసింది.

జూన్ 2026 లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన ఒప్పందం సమయంలో పాకిస్థాన్, ఖతార్‌లను అధికారిక మధ్యవర్తులుగా ప్రకటించారు. జూన్ 22న స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా, ఇరాన్‌లతో పాటు ఖతార్, పాకిస్థాన్‌లు కూడా మధ్యవర్తులుగా పాల్గొన్నాయి. ఆ సమయంలో అణు అంశాలు, ఆర్థిక ఆంక్షల ఎత్తివేతపై చర్చలు జరిగాయి. కానీ ట్రంప్ తాజా వ్యాఖ్యలు గల్ఫ్ దేశాల ప్రాధాన్యత పెరిగినట్లు సూచిస్తున్నప్పటికీ, పాకిస్థాన్ పూర్తిగా బయటకు వెళ్లిపోయిందని చెప్పలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.

పాకిస్థాన్ పాత్రపై ఎందుకు అనుమానాలు?

పాకిస్థాన్‌కు ఒకవైపు ఇరాన్‌తో సరిహద్దు, మతపరమైన సంబంధాలు ఉండగా, మరోవైపు అమెరికా, సౌదీ అరేబియాలతో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు వర్గాల మధ్య సమతుల్యత పాటించడం పాకిస్థాన్‌కు సవాలుగా మారింది. జూన్ నెలలో పాకిస్థాన్, ఖతార్ల పాత్రను మెచ్చుకున్న ట్రంప్, ఇప్పుడు పాక్‌ను పక్కన పెట్టడం ఆ దేశానికి దౌత్యపరమైన ఎదురుదెబ్బగానే భావించవచ్చు. మరోవైపు, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దేశాలు ఈ సంక్షోభం వల్ల నేరుగా ప్రభావితమవుతాయి. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగితే అది గల్ఫ్ ఆర్థిక వ్యవస్థపై, చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే అమెరికా, ఇరాన్‌ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం రాకుండా ఈ దేశాలు నివారిస్తున్నాయి. ప్రస్తుతం దోహా, మస్కట్ నగరం చర్చలకు ప్రధాన కేంద్రాలుగా మారుతుండగా, పాకిస్థాన్ పాత్ర కేవలం తెరవెనుక పరిమితమవుతుందా లేక తదుపరి రౌండ్ చర్చల్లో మళ్లీ వెలుగులోకి వస్తుందా అనేది వేచి చూడాలి. అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు చెప్పుకునే పాకిస్థాన్ నాయకులకు ఇది నిజంగా పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు.