అమెరికా ప్రస్తుతం మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. ‘‘ఐక్యరాజ్యసమితిలో ఉండటం గౌరవంగా ఉంది. మనం గొప్ప పురోగతి సాధిస్తున్నాము. మన దేశం చాలా బాగా రాణిస్తోంది.’’ అని అన్నారు. ‘‘ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఏకపక్షతను సహించబోము.’’ అని తెలిపారు.
ప్రపంచానికి అమెరికాకు స్వాగతం పలకడం తనకు గొప్ప గౌరవంగా ఉందన్నారు. అమెరికా తిరిగి వచ్చిందని చెప్పారు. అంటే గతంలో కంటే ఇప్పుడు అమెరికా బలంగా ఉందన్నారు. ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో ట్రంప్ విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల్లో ఇరాన్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. గత 51 ఏళ్లుగా ఇరాన్ ఛాందసవాద ప్రభుత్వం రక్తపాతం, హత్యల ద్వారా పరిపాలిస్తోందని పేర్కొన్నారు. ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా.. దాని వెలుపల కూడా మరణం, విధ్వంసం, గందరగోళాన్ని సృష్టించిందన్నారు. ఒకప్పుడు ఇరాన్ మధ్యప్రాచ్యాన్ని బెదిరించేదని.. కానీ ఇప్పుడు అలా చేయడం దానికి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఇరాన్ ఇకపై పెత్తందారు కాదని.. టెహ్రాన్‌కు అణ్వాయుధం సమకూర్చడానికి ఎప్పటికీ అనుమతించబోమని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.
ప్రపంచం అమెరికా ఆర్థిక వ్యవస్థను చూసి అసూయ పడుతోందన్నారు. అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదన్నారు. ‘‘మా సాంకేతికతకు సాటి లేదు. మేము దాదాపు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉన్నాము. మా ఇంధనం ప్రపంచం మొత్తానికి శక్తినిస్తుంది.’’ అని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తాను శాంతిని నెలకొల్పానని అన్నారు. ఇతరులు ప్రమాదాలను విస్మరించారని.. తన ప్రకారం తాను ఆ ప్రమాదాలను ఎదుర్కొన్నానని చెప్పారు. ఇతరులు ధైర్యం గురించి కేవలం మాట్లాడగా తాను ధైర్యాన్ని ప్రదర్శించినట్లు చెప్పుకొచ్చారు.

