NTV Telugu Site icon

BCCI Trolls: కోట్లలో సంపద.. మైదానాలు మాత్రం అధ్వానం! బీసీసీఐపై విమర్శల వర్షం

Bcci

Bcci

ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన క్రికెట్ బోర్డు ఏదంటే.. అందరూ టక్కున బీసీసీఐ అనే చెప్తారు. ఐపీఎల్, దేశవాళీ, అంతర్జాతీయ టోర్నీలతో ఏటా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా కోట్లు గడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న బీసీసీఐ.. మైదానాల విషయంలో మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం అహ్మదాబాద్‌, నోయిడా, కాన్పూర్ మైదానాల్లో జరిగిన ఘటనలే. వర్షం ఆగిన గంటల వ్యవధుల్లోనే స్టేడియాలు సిద్ధమయ్యేలా మౌలిక వసతులు లేకపోవడంతో.. అత్యంత సంపన్నమైన బోర్డు బీసీసీఐపై విమర్శల వర్షం కురుస్తోంది.

ఐపీఎల్‌ 2023 ఫైనల్‌లో వర్షం కారణంగా అంతరాయం కలిగింది. వరుణుడు కరుణించినా.. మైదానం సిద్ధం చేసేందుకు చాలా సమయం పట్టింది. పిచ్‌పై ఉన్న నీటిని సిబ్బంది స్పాంజ్‌లతో తొలగిస్తున్నట్లు, హెయిర్‌ డ్రయర్లను వినియోగిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇటీవల నోయిడా వేదికగా అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దైంది. తర్వాత వర్షం లేకపోయినా మైదానం మాత్రం ఆట నిర్వహణకు సాధ్యం కాలేదు. దాంతో ఏకంగా మ్యాచునే రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Also Read: iphone Prices Drop: భారీగా తగ్గిన ‘యాపిల్’ ధరలు.. ఈ సేల్‌ను అస్సలు మిస్ కావొద్దు!

ప్రస్తుతం కాన్పూర్‌ వేదికగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో తొలిరోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. రెండు, మూడు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. మూడో రోజు వర్షం లేకపోయినా.. మైదానం చిత్తడిగా ఉండటంతో ఒక్క బంతి కూడా పడలేదు. స్టేడియాన్ని మ్యాచ్‌ నిర్వహణకు అనుగుణంగా సిద్ధం చేసే సరైన యంత్రాంగం అక్కడ లేకపోవడమే ఇందుకు కారణం. మ్యాచ్ రెండు రోజులు రద్దవడంతో అభిమానులను తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదేం నిర్వహణ అంటూ బీసీసీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘కోట్లలో సంపద.. మైదానాలు మాత్రం అధ్వానం’, ‘బీసీసీఐకి కాస్త సిగ్గుండాలి’ అంటూ నెట్టింట ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.