Tripura: త్రిపుర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్నాలీ గోస్వామిపై భారతీయ జనతా పార్టీ (బీజేపి) కార్యకర్తలు మంగళవారం ధామ్‌నగర్‌లో దాడి చేశారు. దాడి చేసిన వారిలో కొందరు బీజేపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు. పొరుగువారిని కలవడానికి వెళ్లిన తనపై దాదాపు 200 మంది మహిళలు, పురుషులు దాడి చేశారని స్వయంగా బీజేపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్నాలీ గోస్వామి తెలిపారు. ఈ దాడిలో తాను గాయపడ్డానని, దాడి చేసినవారు చీర, ఇతర దుస్తులను చింపేశారని.. అనేక ఫోన్ కాల్స్ చేసినప్పటికీ పోలీసులు కూడా సహాయం చేయలేదని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి మహిళా సంఘం చీఫ్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతోపాటు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాకు కూడా సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడిలో ఆమె సహచరులలో ఒకరు, అంగరక్షకుడు కూడా గాయపడ్డారు.
NIA RAids: 3 రాష్ట్రాల్లో 60 బృందాలతో ఎన్‌ఐఏ దాడులు.. ఐసిస్ సానుభూతిపరులే లక్ష్యంగా..
బర్నాలీ గోస్వామికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ టిక్కెట్ నిరాకరించిన తరువాత, ఆమె ధమ్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన బిస్వా బంధు సేన్‌కు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించిందని బీజేపీ అంతర్గత సమాచారం. ప్రచారానికి సహకరించలేదనే అక్కసుతోనే బీజేపీ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ దాడికి గురైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా కమిషన్ ఛైర్మన్ అయిన తనపై ఇంత దాడికి ఒడిగట్టారంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
60 సీట్ల త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 2న జరుగుతుంది. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేయగా, దాని మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT) పోటీ చేస్తోంది.
