Election Results: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మరి కొన్ని గంటల్లో ఈ మూడు రాష్ట్రాల్లో పరిస్థితి తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మేఘాలయలో హంగ్ అసెంబ్లీ ఏర్పడనుంది. అందుకే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా.. లేక ప్రజాభిప్రాయం మరేదైనా ఉంటుందా అనే దానిపై అందరి దృష్టి పడింది.
త్రిపుర తీర్పు ఎటు?
త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు 81.1 శాతం ఓటింగ్ జరిగింది. మొత్తం 3337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. వీటిలో 1,100 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవి కాగా, 28 పోలింగ్ కేంద్రాలు అత్యంత సున్నితమైనవి. ఈ ఎన్నికల్లో మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే గత ఐదేళ్లుగా డబుల్ ఇంజన్( కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండడం) ప్రభుత్వం చేసిన కృషి వల్ల దేశ సరిహద్దు రాష్ట్రమైన త్రిపుర లో అభివృద్ధి పుంజుకుంటోందని బిజేపీ నాయకులు భారీగా ప్రచారం చేశారు. ఇండైజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర( ఐ.పి.ఎఫ్.టి) భాగస్వామ్యంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రద్యూత్ దేవ్ వర్మ నేతృత్వంలోని తిప్రా మోతా పార్టీ ‘గ్రేటర్ తిప్రాలాండ్’ను డిమాండ్ చేస్తూ 42 శాసన సభా స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం 60 త్రిపుర అసెంబ్లీ స్థానాలకు గాను, త్రిణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేయగా, వామపక్ష కూటమి 47 అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో, బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేసింది. త్రిపురలో మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంచి.
Read Also: Revanth Reddy : ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే గడ్డ కరీంనగర్
తేలనున్న 183మంది భవితవ్యం..
నాగాలాండ్‌లో 183 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. రాష్ట్రంలోని 59 స్థానాలకు 183 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మొత్తం 13 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 82.42% ఓటింగ్ నమోదైంది. బీజేపీ, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ( ఎన్.డి.పి.పి) లు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే, ఈసారి పొత్తుకుదరకపోవడంతో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఎన్.డి.పి.పి 40 స్థానాలు, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేయగా.. ఒక స్థానంలో బీజేపీ పోటీ లేకుండానే గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 23 స్థానాల్లో పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులపై ఆలోచిస్తామని నాగా పీపుల్స్ ఫ్రంట్( ఎన్.పి.పి) ప్రకటించింది. రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ 16 స్థానాల్లో పోటీ చేసింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నాగాలాండ్ లో అధికార కూటమి నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, బిజేపి 38 నుంచి 48 స్థానాల్లో గెలుపొందుతుందని అంచనాలున్నాయి.
Read Also: Off The Record: లాబీయింగ్ వర్కవుట్ అయ్యేనా?
మేఘాలయలో మెజార్టీ ఎవరిది?
మేఘాలయలో మొత్తం 60 స్థానాలకు గాను 59 స్థానాలకు పోలింగ్ జరిగింది. 21.6 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 369 మంది ఓటర్ల భవితవ్యం నేడు తేలనుంది. పోటీలో మొత్తం 36 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఫిబ్రవరి 27న 74.32% ఓటింగ్ జరిగింది. మొత్తం 3,419 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. వీటిలో 640 పోలింగ్ కేంద్రాలు అసురక్షితమైనవి కాగా, 323 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవి. మాజీ హోం మంత్రి, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ ( యు.డి.పి) అభ్యర్థి హెచ్.డి.ఆర్. లింగ్డో హఠాన్మరణంతో షోహియాంగ్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. బీజేపీతో కలిసి, గతంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్.పి.పి) ఎన్నికల్లో ఈ సారి విడివిడిగా పోటీ చేసింది. ఎన్.పి.పి 56 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తృతపరచాలని భావిస్తున్న త్రిణమూల్ కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తో కలిసి మేఘాలయలో 57 స్థానాల్లో పోటీ చేసింది. మేఘాలయలో ఏ పార్టీకి తగిన మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలున్నాయి.