NTV Telugu Site icon

Chennai: ఒకే కాన్పులో పుట్టారు.. ఒకటే కాలేజీలో చదివారు.. ఈ ‘ట్రిపుల్‌ ఇంజినీర్లు’

Sana College

Sana College

Chennai: ప్రతేడాది ఇంజనీర్ల దినోత్సవాన్ని సెప్టెంబర్ 15న జరుపుకుంటాం. ఈ ప్రత్యేకమైన రోజున చాలా స్పెషల్ అయిన ముగ్గురు కవల ఇంజనీర్ల గురించి తెలుసుకుందాం. ధనుష్, ధనుశ్రీ, ధనూజ.. ముగ్గురూ ఒకే కాన్పులో పుట్టారు. ఒకటిగానే పెరిగారు. ఒకటిగానే చదువుతున్నారు. ఒకటిగానే ఎదుగుతున్నారు. విశేషం ఏంటంటే.. ఇంజినీర్ల దినోత్సవమైన సెప్టెంబరు 15న రోజే వీరు జన్మించారు. ఇంజినీరింగ్‌ విద్యపై ఆసక్తిని చిన్ననాటి నుంచే పెంచుకున్నారు. తమిళనాడులో ఒకే కాలేజీలో, ఒకే కోర్సులో, ఒకే తరగతిలో చదువుతున్న ఈ అక్కా తమ్ముడూ చెల్లిల ఆసక్తికర నేపథ్యం.. చూద్దాం.

Read Also:MathuVadalara2 : మత్తువదలరా -2 మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరానికి చెందిన బి.మురుగన్‌ వెండి గొలుసుల వ్యాపారి. అతని భార్య కమల ప్రభుత్వ ఉద్యోగి. వీరికి సెప్టెంబర్‌ 15న ఇంజినీర్స్‌ డే రోజు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. అలా ‘ట్రిప్‌లెట్‌ పేరెంట్స్‌’గా స్థానికంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వారు తమ పిల్లల పెంపకంపై ఎంతో శ్రద్ధ చూపారు. చదువు మీదే దృష్టిపెట్టేలా వారిని ప్రోత్సహించారు. ప్లస్‌ 2 పరీక్షలో చక్కటి ప్రతిభ కనబరిన ఈ ముగ్గురు పిల్లలు.. ఇంజనీర్లు కావాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అయితే, ఓ దశలో తమకు అంత ఆర్థిక స్తోమత లేదని తల్లిదండ్రులు మదనపడ్డారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, సేలంలోని సోనా ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యం ఫీజులో రాయితీ ఇచ్చి సీట్లను కేటాయించింది. ముగ్గురూ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ)లో చేరి, ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ముగ్గురిలో చిన్నమ్మాయి ధనూజ క్లాస్‌ టాపర్‌. పిల్లల చదువుల దృష్ట్యా మురుగన్‌ తన కాపురాన్ని చిదంబరం నుంచి సేలానికి మార్చి, అక్కడే వెండి గొలుసుల వ్యాపారాన్ని మళ్లీ మొదలుపెట్టారు.

Read Also:Cabinet Meeting: ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం.. హైడ్రాపై చర్చ..

అక్కాచెల్లెళ్లు ధనుశ్రీ, ధనూజ విదేశాల్లో సాంకేతిక కంపెనీలతో కలిసి పనిచేయాలని ఆసక్తిగా ఉన్నారు. అందుకు జపనీస్‌ భాషపై ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తామంటున్నారు. ధనుశ్రీ మాట్లాడుతూ ‘మేం ముగ్గురం సమాజం కోసం పాటుపడాలని అనుకుంటున్నాం. మా ద్వారా అమ్మానాన్నలకు, కాలేజీకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. ఇంజినీరింగ్‌ అంటే కేవలం కెరీర్‌ మాత్రమే కాదు. సమాజంలోని చాలా సమస్యలను పరిష్కరించే ఓ మార్గం’ అంటూ పేర్కొన్నారు. ఆమె సోదరుడు ధనుష్‌ ఏం చెబుతారంటే ‘ఇన్ని ఏళ్లుగా ముగ్గురం ఒకేచోట చదవడం సంతోషకరం. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కావాలన్నది నా లక్ష్యం. వినూత్నంగా ఆలోచించడం, కొత్తవి కనిపెట్టడం కోసం ఇంజినీరింగ్‌ విద్యను అవకాశంగా భావిస్తున్నా’నని వివరించారు. ‘క్యాడ్‌ అండ్‌ ఆటోమేషన్‌ నిపుణురాలు కావాలన్నది నా లక్ష్యం. మేం ముగ్గురం ప్రయోజకులమైతే ముందుగా సంతోషించేది మా అమ్మానాన్నలే కదా. వారి కోసం వినూత్నంగా ఇల్లు కట్టించాలనుకుంటున్నా’ అని ధనూజ చెల్లెలు అంటోంది.