Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..

Murder

Murder

నోయిడాకు చెందిన 33 ఏళ్ల ట్విషా శర్మ అనే ఎంబీఏ గ్రాడ్యుయేట్, భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకుంది. అయితే, మే 12న భోపాల్‌లోని ఆమె అత్తగారి ఇంట్లో ట్విషా శవమై కనిపించింది. శవపరీక్ష నివేదిక ప్రకారం.. ఆమెకు ఉరిపడటంతో ఊపిరాడక మరణించిందని, అయితే మరణానికి ముందే ఆమె శరీరంపై అనేక గాయాలు, వాతలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం భర్త సమర్థ్ సింగ్‌పై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదైంది. అతను పరారీలో ఉన్నాడు.

ట్విషా చివరి వాట్సాప్ చాట్స్..
మరణానికి కొన్ని రోజుల ముందు ట్విషా తన తల్లికి పంపిన సందేశాలు ఆమె పడిన నరకయాతనను బయటపెట్టాయి. ఆ చాట్స్‌లోని ముఖ్యమైన విషయాలు: పెళ్లయిన కొద్దిరోజులకే భర్త తనతో మాట్లాడటం లేదని, తన జీవితం నరకంగా మారిందని ట్విషా ఆవేదన వ్యక్తం చేసింది. కడుపులోని బిడ్డ తనది కాదంటూ భర్త నిందించి, బలవంతంగా అబార్షన్ చేయించాడని, తనను డ్రగ్స్ తీసుకునేదానిగా చిత్రీకరిస్తున్నారని తల్లికి తెలిపింది. మే 7న ఆమె, “అమ్మా, నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లిపో, నేను పిచ్చిదాన్ని అయిపోతాను” అని ప్రాధేయపడింది. అత్తగారు, భర్త ఇద్దరూ క్రూరులని, తానూ ఘోరంగా ట్రాప్ అయ్యానని పేర్కొంది.

చివరి ఫోన్ కాల్..
మే 12 రాత్రి 10:05 గంటలకు ట్విషా తన తల్లికి ఫోన్ చేసి ఏడుస్తూ బాధను పంచుకుంది. కానీ భర్త గదిలోకి రావడంతో ఫోన్ కట్ అయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఎవరూ ఫోన్ ఎత్తలేదు. రాత్రి 10:20 గంటలకు ట్విషా శ్వాస తీసుకోవడం లేదని అత్తగారు సమాచారం ఇచ్చారు. కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్న ఆసుపత్రికి రాత్రి 11:30 గంటలకు తీసుకెళ్లడం వల్ల చికిత్స ఆలస్యమై ఆమె చనిపోయిందని ట్విషా సోదరుడు ఆరోపించారు.