NTV Telugu Site icon

Bombay High Court: కానిస్టేబుల్ పోస్టులకు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకోవచ్చు..

Maharashtra

Maharashtra

Bombay High Court: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం లింగమార్పిడి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫిబ్రవరి 2023 నాటికి వారి ఫిజికల్ టెస్ట్‌ల ప్రమాణాలను రూపొందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బాంబే హైకోర్టుకు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపాంకర్ దత్తా, న్యాయమూర్తి జస్టిస్ అభయ్ అహుజాతో కూడిన డివిజన్ బెంచ్.. రాష్ట్ర ప్రభుత్వం గాఢ నిద్రలో ఉందని.. లింగమార్పిడిని రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనడానికి అనుమతించే నిబంధనలను రూపొందించడంలో వెనుకబడిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది.

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో ‘సెక్స్’ కేటగిరీలో ట్రాన్స్‌జెండర్ల కోసం మూడవ డ్రాప్-డౌన్‌ను చేర్చడానికి ప్రభుత్వం తన ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను సవరించనున్నట్లు అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోని శుక్రవారం ధర్మాసనానికి తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల కోసం పోలీస్ కానిస్టేబుల్ రెండు పోస్టులను ఖాళీగా ఉంచుతామని కోర్టుకు తెలిపారు. దరఖాస్తులకు చివరి తేదీని డిసెంబర్‌ 15 వరకు పొడిగించారు. డిసెంబర్ 13నాటికి మూడో డ్రాప్-డౌన్‌ జోడించబడుతుందని వెల్లడించారు. విధానం ప్రకారం, నిబంధనలను రూపొందించిన తర్వాత శారీరక పరీక్షలు నిర్వహించబడతాయి. ఆ తర్వాత అభ్యర్థులందరికీ రాత పరీక్ష నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు.

Boy in Borewell: విషాదం.. 4 రోజుల క్రితం బోరుబావిలో పడిన బాలుడు మృతి

ఫిబ్రవరి 28, 2023 నాటికి ప్రభుత్వం నిబంధనలను రూపొందించి, ఆపై శారీరక, రాత పరీక్షలను నిర్వహించాలని బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలను రూపొందించి శారీరక పరీక్షలు నిర్వహించే వరకు, రాష్ట్రం రాత పరీక్షలను నిర్వహించకూడదని ఆదేశించింది. హోం శాఖ పరిధిలోని పోస్టుల కోసం దరఖాస్తు ఫారమ్‌లో ట్రాన్స్‌జెండర్ల కోసం నిబంధనను రూపొందించాలని ఆదేశించిన ట్రిబ్యునల్ ఆదేశాలపై మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు దాఖలు చేసిన దరఖాస్తులను విచారిస్తూ, హోం శాఖ పరిధిలోని అన్ని రిక్రూట్‌మెంట్ల కోసం దరఖాస్తు ఫారమ్‌లో ‘పురుషుడు’, ‘ఆడ’ మినహా ట్రాన్స్‌జెండర్ల కోసం మూడవ ఎంపికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నవంబర్ 14న ఆదేశించింది.