NTV Telugu Site icon

Elephants : రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి… ప్రతి ఏడాది ఇలా ఎన్ని చనిపోతున్నాయంటే ?

New Project 2025 02 20t195035.822

New Project 2025 02 20t195035.822

Elephants : శ్రీలంకలోని హబరానా ప్రాంతంలో గురువారం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒక ప్యాసింజర్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరు ఏనుగులు చనిపోయాయి. గాయపడిన రెండు ఏనుగుల చికిత్స కొనసాగుతోంది. శ్రీలంకలో ఇప్పటివరకు జరిగిన అత్యంత దారుణమైన రైలు-ఏనుగు ఢీకొన్న సంఘటనలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీలంకలో రైళ్లు, ఏనుగుల మధ్య ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. వన్యప్రాణుల సంరక్షణ సంస్థల ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 20 ఏనుగులు రైలు ప్రమాదాల్లో చనిపోతున్నాయి. ఇది కాకుండా, గతేడాది మానవ-ఏనుగుల సంఘర్షణలో 170 మందికి పైగా, సుమారు 500 ఏనుగులు మరణించాయి.

మానవ నివాసాల్లోకి ఏనుగుల ప్రవేశం
అటవీ నిర్మూలన, సహజ వనరుల కొరత కారణంగా ఏనుగులు ఇప్పుడు మానవ ప్రాంతాలలోకి ప్రవేశించాల్సి వస్తోందని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా అవి రైల్వే ట్రాక్‌లు, పొలాలు, గ్రామాలపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. రైలు ప్రమాదాలతో పాటు, అనేక ఏనుగులు విద్యుదాఘాతం, విషపూరిత ఆహారం తినడం, వేటాడటం వంటి వాటికి కూడా గురవుతున్నాయి.

Read Also:Andhra Pradesh: లోకాయుక్త ఆదేశాలు.. 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..

రైలు పైలట్లకు కూడా సూచనలు
వన్యప్రాణి నిపుణులు, స్థానిక పరిపాలన అధికారులు అడవులు, ఏనుగుల కారిడార్ల గుండా వెళుతున్నప్పుడు రైలు వేగాన్ని తగ్గించాలని.. హారన్ మోగించి తద్వారా ఏనుగులను హెచ్చరించాలని రైలు ఫైలట్లకు నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

గతంలోనూ పెద్ద ప్రమాదాలు
హబరానాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. 2018లో అదే ప్రాంతంలో ఒక గర్భిణీ ఏనుగు, దాని రెండు పిల్లలు రైలు ఢీకొని చనిపోయాయి. అదేవిధంగా, గత ఏడాది అక్టోబర్‌లో మిన్నేరియా ప్రాంతంలో ఒక రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. దీనిలో రెండు ఏనుగులు చనిపోగా ఒకటి గాయపడింది.

Read Also:TG EAPCET 2025: అలర్ట్.. టీజీ ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

శ్రీలంకలో ఏనుగులకు చట్టపరమైన రక్షణ
శ్రీలంకలో ఏనుగులకు ప్రత్యేక చట్టపరమైన రక్షణ ఉంది. దేశంలో దాదాపు 7,000 అడవి ఏనుగులు ఉన్నాయి. వీటిని అక్కడి బౌద్ధ సమాజం పవిత్రంగా భావిస్తుంది. శ్రీలంకలో ఏనుగును చంపడం చట్టపరమైన నేరం, దీనికి జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే నిబంధన ఉంది. అయినప్పటికీ, మానవ-ఏనుగుల సంఘర్షణ కేసులు పెరగడం ప్రభుత్వానికి.. వన్యప్రాణి నిపుణులకు పెద్ద సవాలుగా మిగిలిపోయింది.