Battery Theft: హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. అక్కడ ఇక్కడ కాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ కు అమర్చిన బ్యాటరీలనే ఎత్తుకెళ్తున్నారు. ఇప్పటివరకు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 74 బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. ఈ మధ్య కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ అకస్మాత్తుగా పనిచేయడం మానేశాయి. దీంతో అనుమానం వచ్చిన ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్‌లను పరిశీలించి.. బ్యాటరీలు చోరీకి గురయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 12న అబిడ్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బ్యాటరీలు చోరీకి గురైనట్లు గమనించారు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.
Read Also: MLA MahipalReddy : అర్థంపర్థంలేని ఆరోపణలు కాదు.. ప్రూఫ్లున్నాయా
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంబజార్, బేగంపేట్, కాచిగూడ, లంగర్‌హౌస్, హబీబ్‌నగర్, గోపాలపురం, మలక్‌పేట్, షాహినాయిత్ గంజ్, సైఫాబాద్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడళ్ల వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్లు వరుసగా పని చేయకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు పరిశీలించారు.. బ్యాటరీలు కనిపించ లేదు. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ నెల 12న ఆబిడ్స్ సర్కిల్‌లోని ప్రధాన కూడలి వద్ద సిగ్నల్స్ పని చేయడం ఆగిపోయాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి ఆబిడ్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు రాజేంద్రనగర్‌లోని శాస్త్రీపురంకు చెందిన జంగాల మద్దిలేటి బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. జంగాల మద్దిలేటితో పాటు అతని స్నేహితుడుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన మద్దిలేటి కొన్ని నెలలుగా ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. విచారణలో 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో 74 బ్యాటరీలను దొంగిలించినట్లు తేలింది. వీరి వద్ద రూ. 5 లక్షల విలువైన 26 పెద్ద బ్యాటరీలను, 48 చిన్న బ్యాటరీలను రికవరీ చేశారు.