Traffic Police New Rules: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణలో కీలక మార్పులు తీసుకురావాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. రోడ్లపై విధుల్లో ఉండే ట్రాఫిక్ సిబ్బంది, అధికారులు ఇకపై డ్యూటీ సమయంలో వ్యక్తిగత మొబైల్ ఫోన్లను వెంట తీసుకెళ్లకుండా కొత్త నిబంధన తీసుకురావాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లు చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలను ఉన్నతాధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. డ్యూటీలో ఉండగా మొబైల్‌పై దృష్టి పెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించే అవకాశం తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విధి నిర్వహణ సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి, అధికారిక సమాచార మార్పిడి కోసం కేవలం వీహెచ్ (VHF) సెట్ల ద్వారానే కమ్యూనికేషన్ నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వీహెచ్ సెట్ల సిగ్నల్ సామర్థ్యాన్ని టెక్నాలజీ బృందాలు పరీక్షిస్తున్నాయి. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రోడ్లపై విధులు నిర్వహించే ప్రతి ట్రాఫిక్ సిబ్బందికి వీహెచ్ సెట్ తప్పనిసరిగా అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నిర్ణయానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. తుది ఆమోదం లభించిన తర్వాత కొత్త నిబంధనలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ చర్యలతో ట్రాఫిక్ సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది. కాగా, విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు మొబైల్ ఫోన్లు వాడుతున్న ఘటనలు చాలా ఉన్నాయంటూ పోలీసు అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయట.. మరోవైపు.. కొందరు పోలీసులు.. తమ మొబైల్ కెమెరాల్లోనే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారి ఫొటోలను తీస్తున్న ఘటనలు కూడా లేకపోలేదు.. అయితే, ఈ రూల్స్‌పై ట్రాఫిక్ పోలీసులు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది..

