Traffic Diversion: ఇటు తెలంగాణతో పాటు.. అటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నరాయి.. వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. ఇక, కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి.. దీంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి.. చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలకే కాదు.. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో నేషనల్ హైవేపై నుంచి మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు పోలీసులు.
విజయవాడ – హైదరాబాద్ హైవేపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.. కీసర దగ్గర హైవేపై నుంచి మున్నేరు వరదనీరు పారుతుండడంతో.. విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య రాకపోలకు సాగించే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు పోలీసులు.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా వెళ్లేవారు, హైదరాబాద్, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ, దాడేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంటుంది.. ఇక, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వయా విజయవాడ వెళ్లే వాహనాలు.. విశాఖపట్నం – రాజమండ్రి – ఏలూరు – విజయవాడ – గుంటూరు – సత్తెనపల్లి – పిడుగురాళ్ళ-దాచేపల్లి – మిర్యాలగూడ – నార్కెట్ పల్లి రూట్‌లో హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
అయితే, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ – హైదరాబాద్ హైవేపై మున్నేరు వరద మరింత పెరిగింది.. 2008 తర్వాత ఈ ఏడాదే ఈ స్థాయిలో వరద నీరు వచ్చినట్టు చెబుతున్నారు అధికారులు.. ఇక, నిన్నటితో పోల్చితే ఇవాళ 10 మీటర్లు మేర హైవే పై నీటి ప్రవాహం పెరిగినట్టు చెబుతున్నారు.. రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు.. గతంలో మూడు రోజుల పాటు ఇలానే వరద నీరు హైవే పై ప్రవహించినట్టు స్థానికులు చెబుతున్నమాట.. అయితే, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు..