NTV Telugu Site icon

Top Hedlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

తనదైన మార్క్ పాలనను మొదలెట్టిన ట్రంప్.. పౌరసత్వంపై కొత్త ఉత్తర్వులు!

అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి చిన్నారికి పౌరసత్వం లభించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం, అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి సహజంగా పౌరసత్వ హక్కు లభించేది. ఇది 14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది. కానీ, తాజాగా ట్రంప్ ఈ చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (Executive Order) ద్వారా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘ వలసదారుల పిల్లలకు పౌరసత్వాన్ని మా ప్రభుత్వం గుర్తించదు’’ అని ట్రంప్ తెలిపారు. వలస విధానంపై తమ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు ఇది ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ తన ప్రసంగంలో అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తున్నట్లు తప్పుగా పేర్కొన్నారు. వాస్తవానికి ప్రపంచంలో 30కి పైగా దేశాలు ఈ విధానాన్ని అమలు చేస్తూ పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి.

అన్నప్రసాద మెనూలో మసాలా వడ.. మొదటిరోజు 5 వేల మందికి వడ్డింపు!

శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మసాలా వడను చేర్చారు. అయితే ప్రస్తుతం ఇది ట్రయల్ రన్‌లో ఉంది. ట్రయల్ రన్‌లో భాగంగా సోమవారం 5 వేల మసాలా వడలను టీటీడీ సిబ్బంది భక్తులకు వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తరువాత పూర్తి స్థాయిలో అమలు చేస్తారని తెలుస్తోంది. శ్రీవారి భక్తులకు కొన్నేళ్లుగా అన్నంతో పాటు కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ, కొబ్బరి చట్నీ, చక్కెర పొంగలి వడ్డిస్తున్నారు. అన్నదానం మెనూలో మరో పదార్థం చేర్చాలని 2024 నవంబరు 18న టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం ప్రయోగాత్మకంగా ఉల్లి, వెల్లుల్లి లేకుండా 5 వేల వడలను భక్తులకు వడ్డించారు. టీటీడీ ఛైర్మన్ చేతుల మీదుగా మెనూలో మసాలా వడలు చేర్చే కార్యక్రమం ప్రారంభించారు. అన్నప్రసాదాల నాణ్యత, వడ అందించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలకు.. మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారు. భీకర కాల్పుల తర్వాత భద్రతా బలగాలు గాలించగా 14 మంది మావోల మృతదేహాలు దొరికాయి. అయితే, గరియాబాద్ డీఆర్ జీ, ఒడిశా ఎస్ ఓజీ దళాలు కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. మరణించిన మావోయిస్టులను గుర్తించే పనిలో భద్రతా సిబ్బంది నిమగ్నమైంది. అయితే, చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఎదురు కాల్పుల ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడగా.. అతడ్ని చికిత్స కోసం హెలికాపర్ట్ లో రాయపూర్ కు తరలించి ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇంకా మావోల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కాగా, ఈ ఏడాదిలో గరియాబంద్ జిల్లాలో ఇది రెండో ఎన్‌కౌంటర్‌. ఇప్పటి వరకు మావోయిస్టుల మరణాల సంఖ్య 28కి చేరుకుంది. గతేడాది వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోలు చనిపోయారు.

ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు.. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా…?

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు నుండి గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండడంతో అక్కడికి వెళ్లి అధికారుల వద్దకు రేషన్ కార్డులు రానివారు కానీ, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక విషయంలో గ్రామ సభల్లోనే ఎంపిక చేయనున్నారని ఆయన తెలిపారు. ఎవరికైనా అర్హత ఉండి రానివారు ఉంటే గ్రామ సభలో అప్లికేషన్ లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం. ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు .. వారు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా…? అని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న 10 వేల రూపాయలను 12 వేలకు పెంచడం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. దేశంలోనే మొదటి సారిగా భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు.

తండ్రి కాబోతున్న యంగ్ హీరో.. ఫోటో రిలీజ్

టాలీవుడ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం గతేడాది ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. తాను నటించిన మొదటి సినిమా రాజావారు.. రాణివారు కథానాయకి రహస్య గోరఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కిరణ్. తాజాగా కిరణ్ అబ్బవరం మరో గుడ్ న్యూస్ చెప్పారు. కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఈ మంగళవారం ఉదయం తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ పెట్టారు కిరణ్ అబ్బవరం.

రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఒకవైపు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. దీనికి తోడు పొగమంచు కమ్మేస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటల వరకు సైతం భానుడి జాడ కనిపించకపోవడంతో రోడ్లపై వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్లినా ఎదుటివారు కనిపించే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా సత్తుపల్లి,వేంసూరు,పెనుబల్లి,కల్లూరు,తల్లాడ మండలాల్లో చలి తీవ్రతతో గజగజలాడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెల్లవారి 8 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్తితి నెలకొంది. ఓ వైపు పొగమంచు. మరోవైపు విపరీతమైన చలితో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.చలిగాలులు భారీ వీస్తుండటంతో ఇళ్ళకే పరిమితం అవుతున్నారు.

ట్రంప్ ప్రమాణస్వీకారంలో ఎలాన్ మస్క్ అత్యుత్సాహం.. వివాదానికి దారితీసిన ‘నాజీ సెల్యూట్’

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ ​ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కడికి వచ్చిన ప్రముఖులు, పార్టీ నేతల్లో అతడు జోష్‌ నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ వన్ అరేనాలో వేదికపైన మస్క్ మాట్లాడుతూ.. బ్యాక్ టు బ్యాక్ నాజీ సెల్యూట్‌ చేయడంతో వివాదానికి దారి తీసింది. ఇక, డొనాల్డ్ ట్రంప్ విజయం సాధారణమైనది కాదు.. ఇది మానవ నాగరికతకు ఒక చీలిక లాంటిదన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. అమెరికా భవిష్యత్తుకు భరోసా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని ట్రంప్ కు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కృతజ్ఞతలు తెలిపాడు.

ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్న AI ని అడగండి

దావోస్‌లో పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలుగు కమ్యూనిటీ వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ఆయన వివరిస్తూ అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నేడు అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్సీ (Artificial Intelligence) సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో “ఫిజికల్ వర్చువల్ రియాలిటీ” (Physical Virtual Reality) కార్యక్రమాన్ని చేపట్టేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ను ” ఒక వర్క్ ఫ్రం హోం హబ్” గా తయారు చేయాలని కోరిక ఉందంటూ తెలియజేశారు. ముఖ్యంగా చాలామంది మహిళలు చదువుకున్నవారు ఇంటి దగ్గర ఉన్నారని.. వారందరికీ ప్రతిరోజు కనీసం ఐదు లేదా ఆరు గంటలు సమయం ఉంటుందని.. ఆ సమయంలో వారు వారి తెలివితేటలు ఉపయోగించి 40-50 వేలు సంపాదించవచ్చని తెలియజేశారు. అలాగే కో వర్కింగ్ స్పేస్, జిసిసిని లాంటివాటిని నాలెడ్జ్ అకాడమీలోకి తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

పెట్రో కెమికల్‌ హబ్‌ ఏర్పాటు కోసం.. ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌తో మంత్రి లోకేష్ భేటీ!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేష్ ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని, ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్‌ను మంత్రి లోకేష్ కోరారు. లక్ష్మీ మిట్టల్‌, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్నాం అని సీఎం చంద్రబాబు తెలిపారు.

పెట్రో కెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతం అని మంత్రి లోకేష్ లక్ష్మీ మిట్టల్‌కు తెలిపారు. ప్రణాళికాబద్ధమైన 83.3 ఎంటీపీఏ సామర్థ్యం గల పోర్టు, వైజాగ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ కొలువై ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వం మద్దతు పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని మంత్రి వివరించారు. భావనపాడు-మూలపేట ప్రాంతం తయారీ, ఆర్ అండ్ డీ, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి.. పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని వివరించారు.

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం..

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న కొండాయి గ్రామంలో, నేడు అబ్బాయిగూడెంలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. వరుస ఘటనలతో అధికార పార్టీ లో అయోమయం నెలకొంది. 10 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి పనులు మొదలు కాలేదని, ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగుపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నూతన బ్రిడ్జి కోసం ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం చేయగా.. మంగపేట మండలం అబ్బయిగుడెం గ్రామంలో వేసిన రహదారి నిర్మాణం కోసం వేసిన శిలాఫలకం ధ్వంసం కావడం మరొక్క సారి చర్చగా మారింది. సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు వరుసగా ధ్వంసం కావడం తో చర్చనీయాంశంగా మారిందన్నారు.