SCO సమ్మిట్ కోసం పాకిస్తాన్ చేరిన జైశంకర్..
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) 23వ సమావేశం కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయిన జైశంకర్‌కి అక్కడి అధికారులు ఆహ్వానం పలికారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాశ్మీర్, సీమాంతర ఉగ్రవాదం వంటి సమస్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఓ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ వెళ్లడం ఇదే తొలిసారి.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంత గొప్పగా లేకున్నా.. ఎస్‌సీఓ సమావేశం కావడంతో భారత్ నుంచి జైశంకర్ పాకిస్తాన్ వెళ్లారు. తన పర్యటన గురించి ఇటీవల జైశంకర్ మాట్లాడుతూ.. నేను అనేక దేశాలకు చెందిన ఎస్‌సీఓ కార్యక్రమానికి వెళ్తున్నానని, భారత్-పాక్ సంబంధాల గురించి చర్చించడానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అయితే, పాక్ మీడియా మాత్రం జైశంకర్ రావడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.
ఏపీలో మందుబాబులకు సర్కారు షాక్.. !
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. మద్యంపై రెండు శాతం సెస్ విధించింది. మద్యం ల్యాండెడ్ రేట్లపై సెస్ విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది. సెస్ ద్వారా సుమారు రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. సెస్ ద్వారా వచ్చిన నిధులను డ్రగ్స్ నియంత్రణ, రిహాబిలిటేషన్ సెంటర్లకు ప్రభుత్వం వినియోగించనుంది. సోమవారం మద్యం షాపులను లాటరీ విధానం ద్వారా కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక రేపటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. తాజా నిర్ణయం ప్రకారం.. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి 10 రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. అంటే ఒకవేళ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 కనుక ఉంటే.. దానిని రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు ఉంటుంది. విదేశీ మద్యం బాటిళ్లపై అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా.. తదుపరి పది రూపాయలకు పెంచారు.
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మిస్తాం…
అన్ని వృత్తుల్లో గొప్ప వృత్తి వైద్య వృత్తి అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఈ శాఖ బాధ్యత చేపట్టి 10 నెలలు… ఎంతో అధ్యయనం చేశాను… ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. జూనియర్ డాక్టర్లు సమ్మెకు వెళ్తాము అని చెప్పారని, మాకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయని చెప్పారన్నారు. అయితే.. నేను సీఎంతో మాట్లాడి వెంటనే 200 కోట్లు నిధులు విడుదల చేయించామన్నారు. హాస్టల్స్, ఇతర సమస్యలు పరిష్కారం చేశామని ఆయన తెలిపారు. IVF సెంటర్ లలో లక్షల్లో ఖర్చు చేస్తారని.. కానీ.. ఇవ్వాళ గాంధీ లో ప్రారంభించామన్నారు. అంతేకాకుండా.. మరో పదిహేను రోజులో పెట్ల బురుజు లో ప్రారంభిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు.
ఏనుగుల వల్ల రైతు దుర్మరణం చెందటం బాధాకరం
అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలోని బందార్లపల్లెలో ఏనుగుల సంచారం వల్ల రాజారెడ్డి అనే రైతు దుర్మరణం పాలైన ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. ఏనుగుల వల్ల రైతు దుర్మరణం చెందటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాన్ని అటవీ శాఖ అధికారులు పరామర్శించి భరోసా ఇవ్వాలని ఆదేశించారు. మృతుని కుటుంబానికి అందాల్సిన నష్ట పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ అందించే కుంకీ ఏనుగులు వీలైనంత త్వరగా మన రాష్ట్రానికి వచ్చేలా చూడాలన్నారు.
నూతనంగా నియమితులైన AEEలకు అభినందనలు
ఎర్రమంజిల్ లోని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న AEE లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి సీతక్క ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నూతనంగా నియమితులైన AEEలకు అభినందనలు తెలిపారు. అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని, మీ పని తనమే మీకు గుర్తింపు తెచ్చిపెడుతుందన్నారు. నాణ్యత పై ఎక్కడ రాజీ పడొద్దని, శాశ్వతంగా నిలిచిపోయేలా మీ పనులు ఉండాలన్నారు. మీ కుటుంబానికి ప్రభుత్వానికి మంచి తెచ్చి పెట్టేలా పనులు చేయాలని, ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకొని ఉద్యోగాలు సాధించారన్నారు. చదువు వేరు… ప్రాక్టికల్స్ వేరు అని, మీకు ఎంతో విద్యా అనుభవం ఉన్నా ఇక్కడ మీకు ప్రాక్టికల్స్ నేర్పిస్తామన్నారు. నేను లాయర్ గా కొంతకాలం ప్రాక్టీస్ చేశానని, రైటర్ కు ఉన్నంత ఎక్స్పీరియన్సు జూనియర్ అడ్వకేట్లకు ఉండదన్నారు. మన విద్యా క్వాలిఫికేషన్ ఉన్న…సీనియర్లకువర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది…పబ్లిక్ తో ఎట్లా ఉండాలో తెలుస్తదన్నారు మంత్రి సీతక్క. పనులు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటదని, అందుకే తప్పకుండా సీనియర్ల అనుభవం నుంచి నేర్చుకోవాలన్నారు మంత్రి సీతక్క.
తుఫాను ప్రభావిత జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే అవకాశమున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యిందని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించినందున వైద్య ఆరోగ్య శాఖ తగు ముందస్తు చర్యల్ని తీసుకుందని ఆమె పేర్కొన్నాను. సంబంధిత జిల్లాల్లో ఉన్న ఎపిడెమిక్ సెల్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంచడంతో పాటు నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించామని తెలిపారు. పునరావాస శిబిరాల వద్ద ఇప్పటికే వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశారని, ప్రసవానికి వారం రోజుల ముందే గర్భిణీలను ముందుగా నిర్ణయించిన, అన్ని సదుపాయాలున్న ప్రభుత్వాసుపత్రులకు తరలించేందుకు చర్యలు చేపట్టారని ఆమె వివరించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో అక్కడి ఎపిడెమిక్ సెల్ నంబరును ప్రజలకు తెలియజేయాలని, రాష్ట్ర ఎపిడెమిక్ సెల్ నంబరు(9032384168)తో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలు సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆదేశించామని డాక్టర్ పద్మావతి తెలిపారు.
2000 మందితో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్..
తెలంగాణ రాష్ట్రంలో దుర్గమూల్యాలకు సమర్థంగా స్పందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ (టీజీడీఆర్ఎఫ్) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఫోర్స్‌లో సుమారు 2000 మంది సభ్యులుంటారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, , డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రతిపాదనలపై చర్చించారు. సమాచారంలో ఇటీవల రాష్ట్రంలో జరిగిన వరదలు , లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుంటే, అగ్నిమాపక శాఖ నుంచి 10 బృందాలు , తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లోని 10 కంపెనీలను ఉపయోగించి ఈ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
2000 మందితో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్..
తెలంగాణ రాష్ట్రంలో దుర్గమూల్యాలకు సమర్థంగా స్పందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ (టీజీడీఆర్ఎఫ్) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఫోర్స్‌లో సుమారు 2000 మంది సభ్యులుంటారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, , డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రతిపాదనలపై చర్చించారు. సమాచారంలో ఇటీవల రాష్ట్రంలో జరిగిన వరదలు , లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుంటే, అగ్నిమాపక శాఖ నుంచి 10 బృందాలు , తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లోని 10 కంపెనీలను ఉపయోగించి ఈ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించిందని, ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించిందని సిసోడియా వివరించారు.
కొండా సురేఖ, రఘునందన్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఇద్దరు అరెస్ట్
మంత్రి కొండా సురేఖ , బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న , జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి మహేశ్‌లను మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్ రావు చేసిన ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రఘునందన్ రావు తనపై, మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వేసిన వారిపై దుబ్బాక పోలీస్ స్టేషన్ , సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్, హరీష్ రావు , అనేక యూట్యూబ్ ఛానళ్లపై కూడా ఫిర్యాదు చేయడం ద్వారా, రఘునందన్ రావు ఈ అసభ్యకర పోస్టులపై కేసు నమోదు చేయాలనే ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. మహిళలను అవమానించడం సరైనది కాదని ఆయన అన్నారు , మంత్రిపై తప్పుడు పోస్టులు వేసిన వారు ఎంత పెద్ద వ్యక్తులైనా శిక్షితులుగా ఉండాలని డిమాండ్ చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఈడీ దూకుడు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. 23 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. .ఢిల్లీ, ముంబై ,పుణెలలోని సిమెన్స్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. డీటీసీఎల్ ఎండీ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ ముకుల చండ్ ఆస్తులను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది.