భూపాలపల్లిలో తగ్గని రాజకీయ వేడి
భూపాలపల్లిలో రాజకీయ వేడి తగ్గడం లేదు. ఇరు పక్షాలు బహిరంగ చర్చపై తగ్గేదేలే అంటున్నాయి. ఈ నేపథ్యంలో.. క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా.. హన్మకొండలోని స్వగృహంలో సత్యనారాయణ హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. చర్చకు సిద్ధమే అంటూ ఇద్దరు నేతల ప్రకటనలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి మాట్లాడుతూ.. ఆరోపణలపై చర్చకు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరాను.. 11 గంటలకు అంబేడ్కర్ సెంటర్ కు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. రాజకీయ నేతల మాటలకు ఓ హద్దు ఉండాలని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అభిమానులు స్పందిస్తారన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. సత్యనారాయణ మాట్లాడుతూ.. బహిరంగ చర్చకు వెళ్లకుండా పోలీసులతో హౌజ్ అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమాలపై అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. చర్చకు రేవంత్ రెడ్డి అవసరం లేదు నేను సిద్ధంగా ఉన్నానని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మరోవైపు డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. నేతల సవాళ్లు ప్రతిసారి వాళ్ళతో లాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇరువర్గాలను బయటకు రాకుండా కట్టడి చేశాం డీఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు.
భారత జాగృతి అధ్వర్యంలో మార్చి 10న ఢిల్లీలో ధర్నా
బీజేపీ 2014,19 మేనిఫెస్టో లో మహిళ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇంకో రెండు సెషన్స్ ఉన్నాయి కాబట్టి వీటి ప్రస్తావన తీసుకురావాలన్నారు ఎమ్మెల్సీ కవిత. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళల రిజర్వేషన్ పైన భారత జాగృతి అధ్వర్యంలో మార్చి 10న ఢిల్లీ లో ధర్నా చేయబోతున్నామని ఆమె వెల్లడించారు. ఇచ్చిన హామీ కేంద్రం నెరవేర్చలేదని, బీజేపీ వచ్చినప్పటి నుండి జనాభా గణన చేపట్టలేదన్నారు. OBC గణన చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మార్చి 10న జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు నిరాహారదీక్ష చేపడుతున్నట్లు కవిత పేర్కొన్నారు. పార్లమెంట్ సెకండ్ సెషన్ ప్రారంభం అవుతుంది కాబట్టి పోలీసులు తక్కువ సమయం ఇచ్చారని, రాబోయే పార్లమెంట్ సెషన్స్ లో మహిళ రిజర్వేషన్ బిల్లు పెట్టాలనీ మేము డిమాండ్ చేస్తున్నామన్నారు కవిత. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ మహిళ నాయకులు హాజరవుతారని, మాతో కలిసొచ్చే వారందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. అన్ని పార్టీలకు ఆహ్వానం పంపినట్లు ఆమె తెలిపారు. మహిళ పక్షపాత పార్టీలు రావాలని ఆమె కోరారు.
పోలీసులు దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు
హత్ సే హాత్ జోడో పేరిట తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. మంగళవారం రాత్రి భూపాలపల్లిలో నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి పాదయాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లతో, టమాటాలతో దాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లు దువ్వారు. దీనితో యాత్రలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక రేవంత్ రెడ్డిపై దాడిని కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే మాట్లాడుతూ.. ఇలాంటి దాడులు దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ నేతలు దాడులను నమ్ముకొని ఉన్నారన్నారు. కాంగ్రెస్ యువ నాయకున్ని చంపాలని చూసారని ఆయన మండిపడ్డారు. చనిపోయాడని అనుకొని వెళ్ళిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అసలు దోషులెవరో అందరికీ తెలుసు అని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వం ఎవరు ప్రశ్నించొద్దని అనుకుంటోందని, తమ తప్పులను, అక్రమాలను ప్రశ్నించొద్దని దాడులకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దాడులను తీవ్రంగా ఖండిస్తోందన్నారు థాక్రే. పేదప్రజలకు న్యాయం అందాలని, రాష్ట్రం అభివృద్ది చెందాలని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని, కానీ ఇంతటి దుర్మార్గ పాలన నడుస్తుందని అనుకోలేదన్నారు. బీఆర్ఎస్ చర్యలను ప్రజలు గమనించాలన్నారు. అన్యాయాలు, అత్యాచారాలు తెలంగాణలో పెరిగిపోయాయని, యువత ఆందోళన వదలండి, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ అరుదైన రికార్డ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్‌కి సౌత్ ఇండియాలో అవధులు లేవు. ‘పుష్ప’ లాంటి బ్లాక్ బస్టర్ తో తన పాపులారిటీని ఉత్తరభారతంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేశాడు అల్లు అర్జున్. అభిమానులు అతన్ని ‘కింగ్ ఆఫ్ సోషల్ మీడియా’ అని పిలుచుకుంటారు. ఆయన సినిమాల కంటెంట్ ఏదైనా ఆన్‌లైన్‌లో విడుదలైతే చాలు అగ్రస్థానంలో ఉంటుంది. అంతేకాదు, పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో కూడా భారీగా వైరల్ అవుతుంటుంది. ఇదిలా ఉంటే… సోషల్ మీడియాలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు అల్లు అర్జున్. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉండటం ద్వారా 20 మిలియన్స్ మైలురాయిని సాధించిన తొలి దక్షిణ భారత నటుడు గా రికార్డ్ సాధించాడు.
డాక్టర్‌పై నర్స్ అత్యాచారం.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్..
కేరళలో దారుణం జరిగింది. ఉద్యోగం పేరుతో నమ్మించి మేల్ నర్స్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి మహిళా డాక్టర్ పై అత్యాచారం చేశాడు. ఇంతటితో ఆగకుండా మహిళా డాక్టర్ న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ, చివరకు వాటిని ఆన్ లైన్ లో షేర్ చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన మహిళా వైద్యురాలిపై త్రిసూర్ కు చెందిన మేల్ నర్స్ గా పనిచేస్తున్న నిషామ్ బాబు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతేడాది ఈ ఇద్దరు కర్ణాటకలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. మహిళా డాక్టర్ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు 24 ఏళ్ల నిషామ్ బాబును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కోయంబత్తూర్ లోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఓ హోటల్ కు తీసుకెళ్లి డాక్టర్ పై అత్యాచారం చేశాడు. ఆమె నగ్న చిత్రాలను తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
ఆ తరువాత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి పదేపదే లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నేపధ్యంలో అతడి నుంచి తప్పించుకోవడానికి బాధిత మహిళా డాక్టర్, అతడి నెంబర్ ను బ్లాక్ చేసింది. దీంతో ఆమె న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది గమనించిన బాధిత మహిళా పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో నిషామ్ బాబుపై అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
మూడో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో భారత్.. 163 పరుగులకే ఆలౌట్
ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఆటతీరును కనబరిచింది. 163 పరుగులకే భారత జట్టు ఆలౌట్ అయింది. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కష్టకాలంలో హాఫ్ సెంచరీ సాధించాడు.తన బ్యాటింగ్ సామర్థ్యంతో చాలాసేపు నిలబడి 59 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో పుజారా అర్థశతకంతో మెరిశాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒక ఎండ్‌లో నిలబడి టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 45.1 ఓవర్లో 108 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు. అనంతరం 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.
బిగ్ బ్రేకింగ్.. సుస్మితా సేన్ కు గుండెపోటు
బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గుండెపోటుకు గురయ్యింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంది. “నేను రెండు రోజుల క్రితం గుండెపోటుకి గురయ్యాను. వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. అలాగే గుండె లోపల స్టెంట్ అమర్చారు. నాకు వైద్యం అందించిన కార్డియాలజిస్ట్ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని వెల్లడించారు. ఈ ప్రమాదం నుండి నన్ను బయటపడేలా చేసిన చాలామందికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే.. నేను బాగానే ఉన్నాను అన్న గుడ్ న్యూస్ ను నా అభిమానులతో అనుచరులతో పంచుకోవాలనుకున్నాను. అందుకే ఈ విషయం మీకు చెప్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
టీడీపీ రాజకీయం కోసం చేస్తే.. వైసీపీ ప్రజల కోసం చేస్తోంది..
టీడీపీ రాజకీయం కోసం పరిశ్రమల సదస్సులు నిర్వహించిందని.. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం సమ్మిట్ నిర్వహిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి తమ టార్గెట్ ప్రారంభం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు ఈ రెండు రోజుల్లోనే కాకుండా తర్వాత కూడా కొనసాగుతాయన్నారు. వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాన్నారు. ఆంధ్ర భోజనం రుచులు చూపించనున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. రాయలసీమ రాగి సంకటి, నాటుకోడి, గుంటూరు గోంగూర పచ్చడి వంటి ఆంధ్రా వంటకాలు మెనూలో ఉండనున్నాయన్నారు. భోజన ఏర్పాట్ల పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అమర్నాథ్ వెల్లడించారు.చంద్రబాబు చేస్తున్న విమర్శలకు హెరిటేజ్ పరిశ్రమ రాష్ట్రంలో లాభదాయకంగా కొనసాగుతూ ఉండటమే సమాధానమని ఆయన అన్నారు. రాష్ట్రౌలో వివిధ రంగాల్లో పారిశ్రామిక, పెట్టుబడి పెట్టే అవకాశాలు వివరించటానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
జగన్ అంటేనే విద్యాలయాలు గుర్తుకు వస్తున్నాయి
మాటల కంటే చేతలు ముఖ్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జగన్ అంటేనే విద్యాలయాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. నాడు నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మంచి విద్య అందేలా స్కూళ్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు. అమ్మఒడితో పిల్లల తల్లులకు ధైర్యం నింపారన్నారు.పేదరికంతో విద్యకు దూరం అవ్వకూడదు అని భావించే ముఖ్యమంత్రి.. జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రస్తావించారు. మనం బాగుండటం కాదు ,మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని కోరుకోవాలన్నారు. మంచి పని ఒక యజ్ఞంలా చేయాలన్న ఆయన.. అప్పుడే వ్యవస్థలు బాగుపడతాయన్నారు. పేద పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న స్కూల్స్‌లో జరుగుతున్న అభివృద్ధి స్ఫూర్తిదాయకమన్నారు. సమాజం కోసం మన వంతు ఏం చేస్తున్నాం అని ప్రశ్నించుకోవాలన్నారు. రాజకీయాల్లో, అధికారంలో ఎవరు ఉన్నా విద్యా, వైద్యంకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.