గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం:
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఆలయం ముందురున్న చలువ పందిళ్లు అంటుకున్నాయి. మంటలను చూసి భయంతో ఆలయ సమీపంలోని లాడ్జ్ నుండి భక్తులు బయటి వచ్చి పరుగులు తీశారు. స్థానికులు భారీ మంటలను చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని.. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున కావడంతో భక్తులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షాపులో ఉన్న ఇత్తడి సామాన్లులు, బొమ్మలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో మరో షాపు కూడా దగ్దమైంది. ఓ దుకాణంలో విద్యుదాఘాతం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.
నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్:
విద్యార్థులకు అలర్ట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లకు సెలవు. ప్రైవేట్ స్కూళ్ల బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను మూసివేసినట్లు యాజమాన్యాల సంఘాలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తమ ఆవేదనను తెలిపేందుకే తప్ప.. ప్రభుత్వానికి అస్సలు వ్యతిరేకం కాదని వెల్లడించాయి. స్కూళ్ల బంద్‌తో సమిష్టి ఐక్యతను అందరి దృష్టికి తీసుకెళ్లే చిరు ప్రయత్నం మాత్రమే అని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్ తెలిపాయి. బంద్‌కు విద్యార్థులు, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సహకరించాలని కోరాయి. తప్పుడు ఫిర్యాదులపై త్రీ మెన్ కమిటీ దాడులు అపాలని డిమాండ్ చేశాయి. ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కారించాలని డిమాండ్ చేశాయి.
భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం.. నైజీరియన్ అరెస్ట్:
మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా ఆసిఫ్ నగర్ లో భారీగా మత్తు పదార్థాలు బయటపడ్డాయి. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నైజీరియన్ ను వెంబడించి పట్టుకుని అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి పోలీసులు వెంబండించారు. ఆసిఫ్ నగర్ లోనీ ఓ అపార్ట్మెంట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఎస్ఓటీ పోలీసులు ఆసిఫ్ నగర్ లోని ఓ ఫ్లాట్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దొరికిన మత్తు పదార్థాలను టెస్టింగ్ కు తరలించారు. మారేడు పల్లి, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై పలు కేసులు నమోదయ్యాయి. కేటుగాళ్లు కోర్టుకు హాజరవకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఫిల్మ్ నగర్ ఎస్సై మృతి:
సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్ మృతి చెందారు. బల్కంపేటలో బందోబస్తుకు వచ్చిన రాజేష్ గౌడ్.. బందోబస్తు ముగించుకొని కార్ లో తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో లారీని వెనుకాల నుంచి కార్ డీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై రాజేశ్వర్ స్వస్థలం సంగారెడ్డిలోని చాణక్యపురి కాలని. రోడ్డు ప్రమాదంలో ఎస్సై రాజేశ్వర్ గౌడ్ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
లాకప్ డెత్‌ను షూట్ చేసిన వ్యక్తికి బెదిరింపులు:
తమిళనాడులో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఆలయ గార్డును పోలీసులు చితకకొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విపక్ష పార్టీలన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొట్టి చంపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అలాగే ముఖ్యమంత్రి స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. తాజాగా ఆలయ గార్డు అజిత్ కుమార్‌ను పోలీసులు కొడుతున్న దృశ్యాలను రహస్యంగా శక్తిశ్వరన్ అనే వ్యక్తి మొబైల్‌లో చిత్రీకరించాడు. ఈ కేసులో కీలక సాక్షి అతడే. ప్రస్తుతం అతనికి బెదిరింపులు మొదలయ్యాయి. చంపేస్తామంటూ బెదిరిస్తు్న్నారు. దీంతో బాధితుడు.. తనకు రక్షణ కల్పించాలంటూ తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్‌కు రెండు పేజీల లేఖ రాశాడు. నిందితులు చాలా శక్తిమంతులని.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.
గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్.. ప్రయాణికులు హడల్:
ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో విమాన ప్రయాణమంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఆ భయం మరింత ఎక్కువైంది. ప్యాసింజర్స్‌లో ఇలాంటి భయాలు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్స్‌లైన్స్‌లు ఎంత అప్రమత్తంగా ఉండాలి. కానీ తాజాగా ఘటనతో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. గోవా నుంచి పుణెకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం.. గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్ హఠాత్తుగా ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్:
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌నకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు భారతీయ పౌరులు అపహరణకు గురికావడంపై భారతీయ ఎంబసీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కిడ్నాప్‌నకు గురైన భారతీయులను సురక్షితంగా రక్షించి విడుదల చేయాలని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని భారత్ కోరింది.
పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా:
ఇండోనేషియాలోని బాలిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ప్రసిద్ధ రిసార్ట్ ద్వీపం బాలి సమీపంలో పడవ బోల్తా పడటంతో 65 మంది గల్లంతయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. జావాకు చెందిన ఏజెన్సీ ఫెర్రీ మానిఫెస్ట్ డేటా ప్రకారం పడవలో మొత్తం 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావా నుంచి ప్రసిద్ధ గమ్యస్థానానికి వెళుతుండగా బుధవారం రాత్రి 11:20 గంటలకు (1520 GMT) బాలి జలసంధిలో ఫెర్రీ మునిగిపోయిందని సురబయ శోధన, రెస్క్యూ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆల్బమ్స్ తో నెట్టుకొస్తున్న హాట్ బ్యూటీ:
శ్రీలంక నుండి బాలీవుడ్‌లోకి ఇంపోర్టైన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హిట్ సౌండ్ విని ఏడేళ్లవుతుంది. రేస్ 3 తర్వాత హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. ఓవైపు హీరోయిన్ మరో వైపు ఐటమ్ గర్ల్‌గా రెండు చేతుల సంపాదిస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. ఇవి చాలవన్నట్లు ఆ మధ్య సుకేష్ చంద్ర శేఖర్, మనీలాండరింగ్ కేసులు ఆమెకు మరింత తలనొప్పిగా మారాయి. ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే పలకరిస్తున్నాయి. ఇలా కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో ఆమెను ఆదుకుంటున్నాయి ప్రైవేట్ సాంగ్స్. సినిమాల కన్నా మ్యూజిక్ ఆల్బమ్స్‌తో క్రేజ్, ఆఫర్లను తెచ్చిపెట్టడంతో వాటిపై ఫోకస్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ప్రజెంట్ మిస్ శ్రీలంక చేతిలో వెల్కమ్ టు ది జంగిల్ తప్ప మరో మూవీ లేదు. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. ఈ లోగా మరికొన్ని స్పెషల్ సాంగ్స్ రిలీజ్ చేస్తుందేమో చూడాలి.
కెరీర్‌ను నిలబెట్టుకోవడమే అసలైన యుద్ధం:
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా, దేశవ్యాప్తంగా తన అందం, అభినయం, ఎనర్జీతో మెప్పిస్తున్న నటి రష్మిక మందన్న. ప్రజంట్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సినీ ప్రయాణం గురించి ఓ కార్యక్రమంలో స్పందించారు. ఆమె మాటలు యువతికి ప్రేరణగా నిలిచేలా ఉన్నాయి. ‘ఈ కాలంలో అందరూ సినిమాల్లోకి రావాలని ఆశపడతారు. కానీ మేము మొదలెట్టినప్పుడు పరిస్థితి చాలా వేరుగా ఉండేది. దక్షిణాది కుటుంబాల్లో సినీరంగం అంటే నిషేధంగా భావించేవారు. నటిగా మారటం, కెరీర్‌ను నిర్మించటం అనేవి సులభమైన విషయాలు కావు. నటిగా మారాలనే ఆలోచన లేదు. మా నాన్న గారు మమ్మల్ని వ్యాపారంలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ నేనిప్పుడు చూస్తుంటే ఆ రోజు తీసుకున్న ఆత్మవిశ్వాసపూరిత నిర్ణయమే నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది. ప్రతి ఎదురు దెబ్బ అవకాశంగా మలచుకున్నాను. ప్రతి విజయం నాకు కొత్త విద్యను నేర్పింది. ఇప్పుడు నేను హీరోయిన్‌గా కాకుండా, వ్యక్తిగా ఎదిగాను ఎదిగాను. అదే నాకు నిజమైన గర్వకారణం. ఈ రంగాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా ఎదుగుతున్నారు. విజయాన్ని సాదించడమే కాదు, ఆ విజయాన్ని నిలబెట్టుకోవడమే అసలైన సవాల్. నటీమణులు ఈ విషయంలో ఎంతో శ్రమిస్తున్నారు. ఒక నటి పాత్రలతో పాటు సమాజపు అంచనాలను, విమర్శల్ని ఎదుర్కొంటుంది. కానీ అదే ఆమె నిజమైన బలం. ఇవన్నీ ఒక నటిగా కాదు… ఒక మహిళగా, ఒక వ్యక్తిగా మాట్లాడుతున్న మాటలు. ఒక నటి పాత్రలు మాత్రమే కాదు.. సమాజం అంచనాలను, విమర్శల్ని అధిగమించాలి. అదే నిజమైన బలం. ప్రతి మహిళా నటికి అదే అసలైన విజయం’ అని తెలిపింది.
