NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తెలుగు రాష్ట్రాల్లో వానలు:
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా కొన్నిచోట్ల పడ్డాయి. శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహా సముద్రం మీదుగా ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రోజు ముగిసేనాటికి అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కొనసాగుతూ.. డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతం సమీపానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. అల్పపీడన ప్రభావంతో డిసెంబర్‌ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయని చెప్పారు.

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం:
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాహ్మణపల్లిలోని తుమ్మల చెరువు సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై గీతిక స్కూల్ వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పిడుగురాళ్ల పోలీసులు పరిశీలించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకొని కావలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు ఆంజనేయ స్వామి మాలధారణలో ఉన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన:
నేడు మహబూబాబాద్ జిల్లాలో రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పంచాయితీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పాల్గొంటారు. మంత్రుల రాకతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందో బస్తు ఏర్పాటు చేశారు.

గజ్వేల్‌లో హిట్ అండ్ రన్:
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులిద్దరు పోలీసులుగా గుర్తించారు. మృతులు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు, గాడిచర్లపల్లి గ్రామంగా తెలిపారు. దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో వెంకటేష్, పరంధాములు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

నాపై కుట్ర జరుగుతోంది:
తనపై కుట్ర జరుగుతోందని పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అన్నారు. ఇందులో పోలీసులు కూడా భాగస్వాములయ్యారని ఆరోపించారు. తనతో పాటు తన సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను ఇరికిస్తున్నారన్నారు. తాను జైలులో ఉన్నానని, ఇక్కడి నుంచి ఒక వ్యక్తిని ఎలా బెదిరిస్తాను? అని ప్రశ్నించారు. జైలు నుంచి హత్య ఎలా చేస్తాం? అని పేర్కొన్నారు. శనివారం జోధ్‌పూర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో లారెన్స్ బిష్ణోయ్ తన వివరణ ఇచ్చారు. జోధ్‌పూర్‌లోని జైన్ ట్రావెల్స్ యజమానిని బెదిరించి చంపడానికి ప్రయత్నించిన కేసులో గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ న్యాయమూర్తి ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

మహారాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా లేరు:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలవడంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి గెలవడంపై మహారాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం లేదని, ఆనందం కనిపించడం లేదని ఆయన అన్నారు. కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. లడ్కీ బహిన్ పథకం కింద మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 1500 నుంచి రూ. 2100కి పెంచడంతో పాటు ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం నిలబెట్టుకునేలా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కృషి చేస్తుందని చెప్పారు.

మాస్ బ్యాటింగ్ చేస్తున్న బన్నీ:
పుష్ప కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల కంటే కూడా హిందీలో ఎక్కువ రాబడుతుంది. తెలుగు స్టేట్స్ లో టికెట్ ధరలు ఎక్కువ కదా అనుకుంటే నార్త్ బెల్ట్ లో కూడా మొదటి రోజు రూ. 3000 టికెట్ ధర ఉన్న దాఖలాలు ఉన్నాయి. అయినప్పుటికీ నార్త్ లో పుష్ప-2 భీబత్సవం సృష్టిస్తోంది. మొదటి రోజు బాలీవుడ్ లో రూ. 72 కోట్లు రాబట్టగా, రెండవ రోజు రూ. 59కోట్లు వసూలు చేసి సెన్సషన్ క్రియేట్ చేసింది. ముంబై వంటి మహా నగరంలో ఆల్ ఏరియాస్ హౌస్ ఫుల్స్ అంటే నార్త్ లో బన్నీ మాస్ బ్యాటింగ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక మొదటి రోజు ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ బాలీవుడ్ ఖాన్స్ ను సైతం వెనక్కి నెట్టింది పుష్ప. పుష్ప మొదటి భాగానికి కూడా తెలుగు స్టేట్స్ కంటే కూడా హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. నిన్న, నేడు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.

ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న కంగువా:
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించాడు .ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి ఆట నుండే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సూర్య కెరీర్ లో మరొక దారుణ పరాజయంగా మిగిలింది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా మిగిలింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. థియేటర్స్ లో ప్లాప్ కావండంతో అనుకున్న టైమ్ కంటే ముందుకు ఓటీటీ రిలీజ్ చేస్తుంది అమెజాన్. కంగువ ను డిసెంబరు 8 న అనగా ఈ ఆదివారం నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తోంది.

Show comments