NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌:
ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్‌ వేయనున్నారు. కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్‌ దాఖలుకు అవసరమైన పత్రాలను పార్టీ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. కొణిదెల నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రమే సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్వయంగా ఈ బాధ్యతను తీసుకొన్నారు. ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, లోకం నాగ మాధవి, పంచకర్ల రమేష్‌ బాబు, పత్సమట్ల ధర్మరాజు, సుందరపు విజయ్‌ కుమార్, అరవ శ్రీధర్, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణలు సంతకాలు చేశారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్‌ కూడా సంతకం చేశారు.

మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభ, వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మార్కాపురానికి సీఎం వెళ్లనున్నారు. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం సభాప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ సందర్శన, లబ్ధిదారులకు పథకాల పంపిణీని సీఎం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి భేటీ కానున్నారు. కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలతో సమావేశం కానున్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మహిళా దినోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం కార్యకర్తలతో భేటి అవుతారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇక సాయంత్రం 4.30 గంటలకి మార్కాపురం నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు తిరిగి వెళ్లనున్నారు.

టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వారు ఈరోజు (శుక్రవారం) నుంచి వెబ్‌ సైట్‌లో తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇవాళ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు పెట్టనున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 10వ తరతగతి పరీక్షలు జరగనున్నాయి. అలాగే, పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఈ https://bse.telangana.gov.in/ లింక్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ:
నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు గులాబీ బాస్. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉండటంతో కేసీఆర్ ఇవాళ శాసనసభా సభ్యులు మీటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కు ఒక్క ఎమ్మెల్సీ వస్తుంది. పాత వారికి రెన్యూవల్ చేస్తారా.. లేక కొత్త వారికి ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ రోజు కేసీఆర్ తో పార్టీ నేతల భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడు:
కర్ణాటకలోని హోసూర్‌లో దారుణం జరిగింది. ఓ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బంజరు పొలాల్లో బాలిక ఏడుస్తూ, కేకలు వేస్తూ కనిపించింది. ఒక స్త్రీ, పురుషుడు ఉన్న కూడా ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో వీడియో తెగవైరల్ కావడంతో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. బాలిక (14) తమిళనాడులోని తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మత్తూర్ గ్రామానికి చెందింది. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదవింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. అయితే బాలిక కుటుంబ సభ్యులు.. మార్చి 3న కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన మాదేష్(29) అనే వ్యక్తితో పెళ్లి చేశారు. ఈ వివాహం బెంగళూరులో జరిగింది. అయితే ఈ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. అయినా ఆమె బాధను ఎవరూ పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత బాలిక తిమ్మత్తూరుకు వచ్చింది. అయితే తిరిగి అత్తమామల ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. అయితే బాలిక భర్త మాదేష్, మాదేష్ అన్నయ్య మల్లేష్ (38) బలవంతంగా బాలికను కాలికుట్టై గ్రామానికి తీసుకెళ్లారు. అయితే ఈ దృశ్యాలను పలువురు మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. డెంకనికోట్టై పోలీస్ స్టేషన్ దర్యాప్తు చేపట్టింది. బాలిక అమ్మమ్మ కూడా అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం మాదేష్, అతని సోదరుడు మల్లేష్, అమ్మాయి తల్లి నాగమ్మను అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున మరో ఇద్దరని అరెస్ట్ చేశారు, అమ్మాయి తండ్రి, మల్లేష్ భార్యను అదుపులోకి తీసుకున్నారు.

కేంద్ర పాలిత ప్రాంతాల్లో మోడీ పర్యటన:
ప్రధాని మోడీ ఈరోజు, రేపు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో, గుజరాత్‌లో పర్యటించనున్నారు. దాద్రా, నాగర్ హవేలి, డామన్, డయ్యు, గుజరాత్‌లో మోడీ పర్యటించనున్నారు. సిల్వాసాలో రూ.2,580 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కొత్త ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సిల్వాసాలో నమో ఆస్పత్రి ఫేజ్-1ను మోడీ ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవ్‌సరిలో లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు. నవ్‌సారీ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకకు పూర్తిగా మహిళా పోలీసులతోనే భద్రత ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తిగా మహిళా పోలీసులతో పహారా చేపట్టనున్నారు.

ముంబై దాడుల కీలక సూత్రధారికి షాక్:
26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి తహవూర్‌ రాణాకు అమెరికా న్యాయస్థానం షాకిచ్చింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఇటీవల యూఎస్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. తాను ముస్లిం కాబట్టి.. భారత్‌లో తనను హింసిస్తారని రాణా పిటిషన్‌లో పేర్కొన్నాడు. ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న తనను భారత్‌కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమేనని పేర్కొన్నాడు. తన అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనే అని తెలిపాడు. ఈ నేపథ్యంలో అప్పగింతపై స్టే విధించాలని తహవూర్‌ పిటిషన్‌ పేర్కొన్నాడు. అయినా కూడా అమెరికా కోర్టు స్టే ఇచ్చేందుకు అంగీకరించలేదు.

సింగర్ కల్పన సెల్ఫీ వీడియో:
ప్రముఖ సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగి అపస్మారకస్థితిలో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. నిద్ర పట్టడం కోసం తీసుకున్న మెడిసిన్ ఓవర్ డోస్ కారణంగా అపస్మారక స్థితికి వెళ్ళింది అని వైద్యులు తెలిపారు. గత ఏది ఎళ్లుగా ఆమె భర్తతో కలిసి హైదరాబాద్ లోని నిజాంపేట్ లో ఓ విల్లాలో నివాసం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఎర్నాకుళం నుంచి హైదరాబాద్ ఇంటికి వచ్చిన కల్పన నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకుంది. అయినా నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. తర్వాత తనకి ఏం జరిగిందో తెలియదని స్టేట్మెంట్లో చెప్పింది.

తండేల్ ఓటీటీ స్ట్రీమింగ్:
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా నాగ చైతన్య నటనకు అటు క్రిటిక్స్ నుండి ఇటు సినిమా ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభిచింది. ఈ సినిమాతో అక్కినేని అభిమానులకు అందని ద్రాక్షలా మిగిలిన వంద కోట్ల గ్రాస్ ఆశను నెరవేర్చాడు నాగ చైతన్య. రిలీజ్ అయిన మొదటి వారానికి ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్క్ ను దాటింది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. నాగ చైతన్య కెరీర్ లోనే భారీ ధరకు తండేల్ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్టు సమాచారం. థియేటర్స్ లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేశారట తండేల్ మేకర్స్. అందుకే తగ్గట్టుగా మర్చి 7 అనగా నేటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది తండేల్. థియేటర్స్ లో మెప్పించిన తండేల్ ఓటీటీ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

బంతితో స్టేడియం నుంచి ఇద్దరు వ్యక్తులు జంప్:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండవ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఎప్పుడూ జరగని ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ డీప్ కవర్ వైపు భారీ సిక్స్ బాదాడు. ఆ బంతిని ఇద్దరు వ్యక్తులకు దొరికింది. ఆ బంతిని తీసుకున్న ఆ వ్యక్తులు లాహోర్ స్టేడియం నుంచి బయటకు జంప్ అయ్యారు. ఇది చాలా అరుదైన ఘటన! ఐసీసీ ఈవెంట్ లో ఇలా జరగడం ఇదే తొలి సారి అని చెబుతున్నారు. దీంతో ఆ ఇద్దరి వ్యక్తులు స్టేడియం నుంచి బంతిని తీసుకుని వెళ్లిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి ఘటన మొదటి సారి చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.