మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి తోడల్లుళ్లు:
మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒకే వేదికపైకి రాబోతున్నారు. వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ అనే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా చంద్రబాబు రానున్నారు. గురువారం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. పుస్తక ఆవిష్కరణ కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అర్ధరాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ కార్యక్రమంకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరుకానున్నారు.
వాడివేడిగా కొనసాగుతున్న శాసనమండలి సమావేశాలు:
నేడు 6వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ.. 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ఆరంభమవుతాయి. ప్రతీరోజూ టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దాంతో శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఏపీఎస్పీడీసీఎల్ 24వ వార్షిక నివేదిక ప్రతిని, 2013 కంపెనీల చట్టంలోని 395వ సెక్షను క్రింద ఆవశ్యకమైన విధంగా సభా సమక్షంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉంచనున్నారు. 2020-2021 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వాణిజ్య ప్రోత్సాహక సంస్థ లిమిటెడ్ యొక్క 52వ వార్షిక నివేదిక ప్రతిని, 2013 కంపెనీల చట్టంలోని సెక్షను 394 (1) క్రింద ఆవశ్యకమైన విధంగా సభా సమక్షంలో మంత్రి టీజీ భరత్ ఉంచనున్నారు. సాధారణ బడ్జెట్‌పై కూడా చర్చ జరగనుంది.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా:
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే చోదిమెళ్ల వద్ద సిమెంటు లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న రమణ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతి వేగం, నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
హైదరాబాద్లో దారుణం:
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాగేష్ ను కర్రతో కొట్టి చంపేశాడు అతడి స్నేహితుడు నర్సింగ్.. నిన్న (మార్చ్ 5) రాత్రి మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన గొడవతో.. ఆవేశంలో నాగేష్ పై కర్రతో దాడికి దిగాడు నర్సింగ్.. దీంతో నగేష్ కింద పడిపోవడంతో అక్కడి నుంచి నర్సింగ్ పరిపోయాడు. నాగేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం:
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ రోజు (మార్చ్ 6) మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలోప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఆమోదించనున్నారు. బీసీ గణనకు మరోసారి ఛాన్స్ ఇచ్చిన నేపథ్యంలో నమోదు చేసుకున్న వారి వివరాలతో తుది గణననకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచే బిల్లుకు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటితో పాటుగా బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా మంత్రి మండలి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అన్‌లైన్ రమ్మీ ఆటకు కుటుంబం బలి:
తమిళనాడులో దారుణం జరిగింది. అన్‌లైన్ రమ్మీ ఆటకు ఓ కుటుంబం బలి అయింది. భార్య మోహన ప్రియా, ఇద్దరు చిన్నారులు ప్రణీత, రాజీ ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా.. కరూర్ సమీపంలోని పశుపతిపాళయం దగ్గర రైలు కిందపడి ప్రేమ్‌రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్గానికి తరలించారు. భార్య, ఇద్దరి పిల్లలను చంపిన తర్వాత ప్రేమ్‌రాజ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్‌లైన్ రమ్మీలో అప్పులు చేసి… ఆట ఆడినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో ప్రేమ్‌రాజ్ పేర్కొ్న్నాడు. ప్రేమ్‌రాజ్.. స్థానికంగా ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు:
రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రెండు సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారన్నారు. అలాంటి వ్యక్తి దేశానికి ప్రధాన మంత్రి ఎలా అయ్యారో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై దుమారం రేగుతోంది.
అమెరికా బందీల విడుదల కోసం హమాస్‌తో వైట్‌హౌస్ రహస్య చర్చలు:
గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న అమెరికా పౌరుల కోసం వైట్‌హౌస్ రహస్యంగా చర్యలు జరిపినట్లు తెలుస్తోంది. అమెరికన్ బందీలను విడుదల చేయాలని హమాస్‌ను అమెరికా అధికారులు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు సమాచారం ఇవ్వకుండానే.. ఈ చర్చలు జరిపినట్లుగా సమాచారం. 1997లో హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. అప్పటి నుంచి హమాస్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. అయితే 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి హమాస్ చెరలోనే బందీలు మగ్గుతున్నారు. ఇటీవల ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో కొందరు బందీలను హమాస్ విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే ఇంకా ఇజ్రాయెల్, విదేశీ బందీలు హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే వారిని విడిపించేందుకు నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతినిధి ఆడమ్ బోహ్లర్ రంగంలోకి దిగారు. హమాస్‌తో చర్చలు జరిపి.. బందీలను విడుదల చేయాలని కోరారు. గత వారం దోహాలో ఈ చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.
అమెరికా యుద్ధమే కోరుకుంటే తాము పోరాటానికి సిద్ధం:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఇటీవల చైనా దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడంతో చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా యుద్ధమే కోరుకుంటే తాము చివరి వరకూ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చైనా హెచ్చరించింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించారు. కానీ, ఇప్పుడు ఆ సుంకాలను 20 శాతం చేసిన తర్వాత చైనా ప్రతిస్పందించింది. ఇందులో భాగంగా అమెరికా ఉత్పత్తులపై కూడా సుంకాలు విధించిన చైనా, ఫెంటానిల్ సమస్యను చిన్న సాకు అని వ్యాఖ్యానించింది. అమెరికా బెదిరింపులు తమను భయపెట్టలేవని, తమ హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఫెంటానిల్ ఒక ప్రమాదకరమైన మాదక ద్రవ్యం. అది అక్రమంగా అమెరికాకు వస్తోంది. దీని వల్ల ప్రతీ సంవత్సరం లక్షల మంది మరణిస్తున్నారు. వలసదారుల ద్వారా ఈ మాదక ద్రవ్యాలు కెనడా, మెక్సికో దేశాల నుంచి అమెరికాకు వస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది. దింతో చైనా, అమెరికా సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది.
నిజంగా జైలులో ఉన్నట్లు అనిపించింది:
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. అందరి హీరోల గా కాకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయనకు జాతీయ అవార్డు కూడా వరించింది. ఇక ప్రస్తుతం సూర్య వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య మాట్లాడుతూ.. ‘ చెన్నైలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ‘రెట్రో’ మూవీ కోసం పెద్ద జైలు సెట్ ఏర్పాటు చేశారు. లైబ్రరీ, వంటగది అన్నిటినీ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు అద్భుతంగా తీర్చిదిద్దారు. అందులో ఐదు రోజులు ఓ పాట చిత్రీకరించారు. ఆ ఐదు రోజులు నిజంగా జైలులో ఉన్నట్లు అనిపించింది. ఆ పాటలో డాన్స్ మూమెంట్స్ కూడా బాగుంటాయి, టోటల్ గా మూవీలో అన్ని భావోద్వేగాల ఉంటాయి’ అని తెలిపారు.
ఓటీటీలోకి 2025 బిగ్గెస్ట్ డిజాస్టర్:
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా తోలి తోలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఎంతలా అంటే 2025 లో విడుదలైన బిగ్గెస్ట్ డిజస్టర్ సినిమాలలో లైలా మొదటి స్థానాన్ని దక్కించుకున్నంత. కథ, కథనాలు సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని ప్రేక్షకులు పెదవి విరిచారు. సినిమా అంటే భూతు కాదు, నాలుగు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటే ప్రేక్షకులు చూసేస్తారు అనుకోకూడదు అని క్రిటిక్స్ సైతం చీల్చి చెండాడారు. సినిమా ప్లాప్ అయింది ఇక నుండి తన సినిమాలో బూతులు ఉండవ్ అని చిత్ర హీరో విశ్వక్ సైతం ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. థియేటర్స్ లో దారుణమైన డిజాస్టర్ గా మిగిలిన లైలా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. అయితే ఈ కళాకండాన్ని ఇప్పుడు రెండు ఓటీటీలు స్ట్రీమింగ్ కు తీసుకువస్తున్నాయి. ఈ నెల 7 నుండి లైలాను అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అసభ్యకరమైన సీన్స్ లేకుండా ఈ స్ట్రీమింగ్ చేస్తారా లేదా థియేటర్ వర్షన్ స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి.
ఫైనల్‌లో భారత్‌తో న్యూజిలాండ్ ఢీ:
చాంపియన్ ట్రోఫీ 2025 లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మొదటి సెమిస్ మ్యాచ్లో టీం ఇండియా ఆస్ట్రేలియా పైన విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు రెండో సెమీ ఫైనల్ లాహోర్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య జరగగా సౌతాఫ్రికా పై న్యూజిలాండ్ 50 పరుగుల ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 362 పరుగులు భారీ స్కోరును సాధించింది. ఇప్పటివరకు ఇదే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోర్.