2 రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాల్లో కుప్పంలో పర్యటన కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:50 గంటలకు శాంతిపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ దగ్గరకు రోడ్డు మార్గాన చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
నేడు జైలు నుంచి వల్లభనేని విడుదలయ్యే ఛాన్స్:
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. వివిధ కేసుల్లో ఆయన 138 రోజులుగా విజయవాడ సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అన్ని కేసుల్లో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. చివరిగా మంగళవారం నకిలీ పట్టాల కేసులో కూడా నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు అయింది.
రెండు రోజుల పాటు వర్షాలు:
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం సైతం పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. విత్తనాలు వేసి వర్షం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.
అతి తక్కువ సుంకాలతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం:
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు దగ్గరపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భారత్-యూఎస్ త్వరలో ‘‘చాలా తక్కువ సుంకాలతో’’ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అన్నారు. దీని వల్ల రెండు దేశాలు పోటీ పడుతాయని చెప్పారు. ‘‘భారతదేశంతో మనం ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని నేను అనుకుంటున్నాను. అది వేరే రకమైన ఒప్పందం అవుతుంది. మనం భారత్ లోపలికి వెళ్లి పోటీ పడగలిగే ఒప్పందం ఇది అవుతుంది. ప్రస్తుతం, భారతదేశం ఎవరినీ అంగీకరించదు. భారతదేశం అలా చేయబోతోందని నేను భావిస్తున్నాను, వారు అలా చేస్తే, చాలా తక్కువ సుంకాలకు ఒప్పందం కుదుర్చుకోబోతున్నాము’’ అని ట్రంప్ చెప్పారు.
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ నేతలు:
భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం దక్కింది. క్వాడ్ గ్రూప్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్వాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రులు కోరారు. ఉగ్రదాడి నేరస్తులు, నిర్వాహకులు, ఫైనాన్షియర్లపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లో జరిగిన సంయుక్త ప్రకటనలో.. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
8 రోజులు 5 దేశాల్లో మోడీ పర్యటన:
ప్రధాని మోడీ ఒకేసారి ఐదు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. మంగళవారం నుంచి 8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ప్రధాని పర్యటించనున్నారు. జూలై 2-9 తేదీల్లో ఈ పర్యటన కొనసాగనుంది. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే రక్షణ, అరుదైన భూమి ఖనిజాలు, ఉగ్రవాద నిరోధక సహకారంపై చర్చలు ఉండనున్నాయి. ఇక బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు.
త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్న జర్మన్ యువరాజు భార్య:
జర్మన్ యువరాజు హెరాల్డ్ వాన్ హోహెన్‌జోలెర్న్(63) గుండెపోటుతో మరణించారు. వజ్రాల వ్యాపారంలో భాగంగా ఆయన నమీబియా దేశ పర్యటనకు వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన భార్య జోసెఫా వాన్ హోహెన్‌జోలెర్న్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నమీబియా దేశ పర్యటనలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి హెరాల్డ్ ప్రాణాలు వదిలినట్లు పేర్కొంది. ‘‘ప్రియమైన లియోన్‌బర్గ్ పౌరులారా.. ఈరోజు బరువెక్కిన హృదయంతో రాస్తున్నాను. నా ప్రియమైన భర్త హెరాల్డ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తనను ఎంతగానో బాధించింది.’’ అంటూ భార్య జోసెఫా జర్మనీలో రాసింది. త్వరలో ఆయన భార్య జోసెఫా బిడ్డకు జన్మనివ్వనుంది. ఇంతలోనే భర్త చనిపోవడంతో బరువెక్కిన హృదయంతో విషాద వార్తను పంచుకుంది.
60 రోజుల గాజా కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది:
హమాస్ ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు. దీని కోసం ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించారని చెప్పుకొచ్చారు. తన ప్రతినిధులు గాజా గురించి ఇజ్రాయిల్ అధికారులతో సుదీర్ఘమైన, ఫలవంతమైన సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు.
నేటి నుంచే రెండో టెస్టు:
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఆధిపత్యాన్ని ప్రదర్శించినా.. చివరికి ఓటమి చవిచూసిన టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు మొదటి టెస్టులో భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం అందుకున్న ఇంగ్లండ్.. జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ టెస్ట్ కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలా అనే సందిగ్ధంలో భారత్ ఉంది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడే అవకాశముంది.
టాలీవుడ్ నటుడి ఆరోగ్యం విషమం:
తెలుగు సినిమా ప్రేక్షకులను, తన ప్రత్యేకమైన తెలంగాణ పంచ్‌లతో అలరించిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కమెడియన్‌గాను, విలన్‌గాను పలు చిత్రాల్లో మెప్పించిన వెంకట్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో డయాలసిస్ తీసుకున్న ఆయన ఆరోగ్యం కొంత మెరుగు పడినప్పటికీ, ఇటీవల మళ్లీ క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరోసారి రిలీజ్ వాయిదా పడిన భారీ బడ్జెట్ సినిమా:
గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో మరోసారి నటిస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. కానీ షూట్ డిలే కారణంగా వాయిదా పడింది. అదే టైమ్ లో జులై 11న రిలీజ్ చేస్తామని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. అందుకు తగ్గట్టే షూటింగ్ కూడా ఫినిష్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కు వస్తామని తెలిపారు మేకర్స్. కానీ యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సిజి పనులు పూర్తి కాలేదని ఇంకా పెండింగ్ ఉన్నాయని రిలీజ్ లోపు ఫినిష్ అవడం కుదరదని తెలిసింది. రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని అందుకు సంబంధించి అధికారక ప్రకటన త్వరలోనే వస్తుందని తెలిపాయి. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఘాటీ నెక్ట్స్ రిలీజ్ ఎప్పుడో ఉంటుందో.
