NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేటి నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం:
నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం ఆరంభం కాబోతోంది. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్‌ఎస్‌) ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. విజయవాడ బుక్ ఎక్జిబిషన్‌కు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు. మంత్రి పయ్యావుల కేశవ్, సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తదితర ప్రముఖులు తొలిరోజు ఎక్జిబిషన్‌కు హాజరుకానున్నారు.

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ:
ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం అనంతరం గడిచిన ఆరు నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులపై మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. కేబినెట్‌ భేటీలో చర్చించే అంశాలు ఏంటో చూద్దాం. ఎస్‌ఐపీబీ అమోదించిన లక్ష 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ అమోదం తెల‌ప‌నుంది. ఈ పెట్టుబడుల ద్వారా 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు కేబినెట్‌ అమోదం తెల‌ప‌నుంది.

రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ సమావేశం:
గురువారం (జనవరి 2) సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలకమైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రధానంగా రైతు భరోసా విధివిధానాలపై చర్చించేందుకు ఏర్పాటు చేయబడింది. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. స‌మావేశంలో రైతుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు విధానాలు చేయనున్నారు. రైతులకు ఆర్థిక సహాయం, పంట నష్టాలకు పరిహారం, ఇంకా వ్యవసాయ రంగానికి మద్దతు అంశాలపై వివరంగా చర్చలు జరపనున్నారు.

యాజమాన్యం ముందు స్టూడెంట్స్ డిమాండ్లు:
మేడ్చల్‌లోని CMR ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో ఏర్పడిన వివాదం చివరకు పోలీసుల జోక్యంతో సర్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో విద్యార్థినుల భద్రత పై ప్రశ్నలు తలెత్తాయి. హాస్టల్ నిర్వహణలో పారదర్శకత మరియు భద్రతకు ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగినప్పటికీ, విద్యార్థినుల డిమాండ్లపై కాలేజ్ యాజమాన్యం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రార్థనా స్థలాలపై పిటిషన్.. నేడే విచారణ:
భారతదేశ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991ను అమలు చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (జనవరి2) విచారణ జరపనుంది. కాగా, ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఒవైసీ తన పిటిషన్‌లో తెలిపారు. ఇప్పటికే, హిందూ పక్షం వ్యాజ్యాలపై పలు మసీదుల సర్వేకు న్యాయస్థానాలు ఆదేశించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక, ఈ అంశంలో విచారణ పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో అసదుద్దీన్ వ్యాజ్యాన్ని కలిపే ఛాన్స్ ఉంది. అయితే, 1947 ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా స్థలాల మత స్వభావాన్ని మార్చడానికి వీల్లేకుండా 1991లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

అణు స్థావరాల వివరాలు మార్పిడి:
ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం భారత్‌, పాకిస్థాన్ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అణు కేంద్రాలపై పరస్పర దాడులను నిషేధించేందుకు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా పాటించాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది.

తాత్కాలిక సభ్యదేశంగా పాక్:
ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన పాకిస్తాన్‌ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరింది. రొటేషన్‌ పద్ధతిలో పాక్ కు ఈ ఛాన్స్ వచ్చింది. రెండేళ్ల పాటు మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగనుందని ఐరాస భద్రతామండలి బుధవారం నాడు వెల్లడించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాక్ తన వంతుగా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఐరాసలో దాయాదిదేశం దౌత్యవేత్త మునీర్‌ అక్రమ్‌ పేర్కొన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన భద్రతామండలిలో పాక్‌కు స్థానం లభించడం ఇది 8వ సారి. 193 దేశాలకు సభ్యత్వం ఉన్న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో జూన్‌లో ఓటింగ్‌ చేపట్టగా 182 దేశాలు పాక్‌కు అనుకూలంగా ఓటు వేశాయి. మూడింట రెండొంతుల మెజారిటీ (124 ఓట్లు) అవసరం కాగా అంతకుమించిన మెజార్టీ వచ్చింది.

గేమ్ ఛేంజర్’కు పోటీగా అరడజన్ సినిమాలు:
శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో జనవరి 10న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. అజిత్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో ‘గేమ్ ఛేంజర్’కు పోటీ లేదని అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు ‘గేమ్ ఛేంజర్’కు పోటీగా రానున్నాయి. అజిత్ సినిమా వాయిదా పడడంతో ఒక్కసారిగా చిన్న సినిమాలు పొంగల్ రేస్‌లో రిలీజ్‌కు వస్తున్నాయి. వనంగన్, కాదలిక్కు నేరమిల్లై, టెన్ అవర్స్, పదవి తలైవన్, మద్రాస్ కారన్, తరుణం, సుమో వంటి సినిమాలు సంక్రాంతి రేసులో విడుదలకు రాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ‘గేమ్ ఛేంజర్’కు తమిళ్‌లో మళ్లీ కష్టాలు మొదలయ్యాయంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తమిళ్‌లో కూడా మంచి సక్సెస్ అందుకోవాలని వారు కోరుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం:
ఒకప్పుడు చాలా మందికి దానం చేసిన ఫిష్ వెంకట్ ఇప్పుడు చాలా దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్ ని ఇంటర్వ్యూ చేసింది. ఫిష్ వెంకట్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అతని కుడి కాలు పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం రాంనగర్ లోని తన ఇంట్లో ఫిష్ వెంకట్ దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. ఫిష్ వెంకట్ తన బాధలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. గత కొన్నాళ్ల నుంచి ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. తన భార్య మాట విని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే మొత్తం ఆయనే చూసుకుంటా అన్నారు అని అలాగే ఆర్ధిక సాయంగా రూ.2 లక్షలు ఇచ్చారని తెలిపారు. తనను ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ఫిష్ వెంకట్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చరిత్ర సృష్టించిన బుమ్రా:
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన టీమిండియా బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 907 రేటింగ్ పాయింట్స్‌ ఉన్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సంచలన ప్రదర్శనకు గాను ఈ రికార్డు బుమ్రా ఖాతాలో చేరింది. ఈ ట్రోఫీలో ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 30 వికెట్స్ పడగొట్టాడు. తాజా ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డ్‌ను జస్ప్రీత్ బుమ్రా అధిగమించాడు. 2016లో యాష్ అత్యధికంగా 904 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. తాజాగా బుమ్రా 907 రేటింగ్ పాయింట్స్‌తో అశ్విన్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్ల జాబితాలో ఒక శతాబ్దం క్రితం ఆడిన ఇంగ్లండ్ సీమర్లు సిడ్నీ బర్న్స్ (932), జార్జ్ లోమాన్ (931) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (922), శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (920) మూడు, నాల్గవ స్థానాల్లో ఉన్నారు.

 

Show comments