ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం:
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఏపీలో మూడు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఆరంభం అయింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి.. తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
సత్యవర్ధన్ కిడ్నాప్ వివాదం కేసు:
సత్యవర్ధన్ కిడ్నాప్ వివాదం కేసులో కీలక ఆధారాలతో వైసీపీ ఓ వీడియో విడుదల చేసింది. వైసీపీ అధికారిక x ఖాతాలో పోస్ట్ చేసింది. ట్రూత్ బాంబ్ పేరిట ఎక్స్‌లో వైసీపీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం అంటూ ఆ వీడియోను జత చేసింది. ఆ వీడియోలో బ్లూషర్ట్ వేసుకుని నింపాదిగా షాపింగ్ చేస్తున్న సత్యవర్థన్‌ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారంటూ పోలీసులు ఆరోపిస్తున్నారంది. వీడియోను చూస్తే సత్యవర్థన్ కిడ్నాప్‌నకు గురైనట్టుగా ఉందా అంటూ ప్రశ్నించింది. కిడ్నాప్ చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు.. ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఎక్స్ వేదికగా ఆరోపణలు సంధించింది వైసీపీ.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడంలో కొన్ని ముఖ్యమైన నియమాలను అనుసరించాలి. ముఖ్యంగా విద్యావంతులైన ఓటర్లే అధికంగా పాల్గొనే ఈ ఎన్నికల్లో గతంలో పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఇది ఓటింగ్ విధానంపై అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తోంది. అందుకే ఈసారి ఓటర్లు తమ ఓటు విలువైనదిగా మార్చుకోవడానికి కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉంది. మరి ఓటు వేయడంలో పాటించాల్సిన నియమాలు చూద్దాం. * బ్యాలెట్ పేపర్, పెన్ను ఉపయోగం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాలి. అయితే, ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా పోలింగ్ అధికారులిచ్చే ఊదా (వాయిలెట్) రంగు స్కెచ్ పెన్నుతోనే ఓటు వేయాలి. ఇతర పెన్నులు, పెన్సిళ్లు ఉపయోగిస్తే ఆ ఓటు చెల్లదు.* టిక్ మార్క్, ఇతర గుర్తులు వద్ద:
ఓటు వేస్తున్నప్పుడు టిక్ మార్క్ (✔), ఓకే (OK) అనే పదాలు, ఇతర గుర్తులు చేయకూడదు. కేవలం అంకెలను మాత్రమే ఉపయోగించాలి. * ప్రాధాన్యతా ఓటు విధానం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు ఒకరికి కాకుండా అనేక అభ్యర్థులకు ప్రాధాన్యతా ఓటు వేయవచ్చు. అయితే, తప్పనిసరిగా ఓటరు ఎవరికైనా 1 (మొదటి ప్రాధాన్యత) అంకె వేయాలి. మొదటి ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకెను వేయాలి. 1 అంకె వేయకుండా 2, 3, 4 అంకెలను నేరుగా వేయకూడదు. కచ్చితంగా 1 అంకెను ఎవరికైనా ఇవ్వాలి. మిగతా అభ్యర్థులకు 2, 3, 4 ఇలా వరుస సంఖ్యలుగా ప్రాధాన్యత ఇవ్వొచ్చు.
కేఆర్‌ఎంబీ భేటీకి ఏపీ గైర్హాజరు అవ్వడంపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం:
కృష్ణా నదీ నిర్వహణ మండలి (KRMB) భేటీకి ఆంధ్రప్రదేశ్ హాజరుకాకపోవడం తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. తెలంగాణ అధికారులు ఈ చర్యను KRMB authority పట్ల కనీస గౌరవం లేకపోవడంగా అభివర్ణించారు. గత సమావేశంలో ఆంధ్రప్రదేశ్ 23 టీఎంసీ నీటి పంపిణీకి అంగీకరించినప్పటికీ, తాజా భేటీకి హాజరుకాకపోవడంలో ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు KRMBపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏపీ ప్రభుత్వం తన హాజరును నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. గత భేటీలో నిర్ణయించుకున్న నీటి పంపిణీ విషయమై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా, 23 టీఎంసీ నీటి పంపిణీకి గతంలో ఆంధ్రప్రదేశ్ అంగీకరించినప్పటికీ, ఇప్పుడు సమావేశానికి రాకపోవడం అనుమానాస్పదమని తెలంగాణ పేర్కొంది.
గంగా నదికి ప్రకృతి వరం:
ప్రపంచంలో స్వచ్చతకు గంగా నది ప్రసిద్ధి చెందింది. తాజాగా ప్రముఖ శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ అజయ్ సోంకర్ చేసిన పరిశోధన ప్రకారం, గంగా నదిలో 1,100 రకాల బ్యాక్టీరియోఫేజ్‌లు సహజసిద్ధంగా ఉన్నాయని.. ఇవి నదిని కాలుష్యం నుండి రక్షిస్తూ నీటిని స్వచ్ఛంగా ఉంచుతున్నాయని వెల్లడించారు. గంగా నదిలోని ఈ సూక్ష్మజీవులు కాలుష్య కారకాలను, హానికరమైన బ్యాక్టీరియాను నిర్ములిస్తున్నాయని ఆయన ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రశంసించిన శాస్త్రవేత్త డాక్టర్ అజయ్ సోంకర్. గంగా నీటిలోని బ్యాక్టీరియోఫేజ్‌లు అత్యంత శక్తివంతమైనవిగా వ్యవహరిస్తాయని, ఇవి హానికరమైన బ్యాక్టీరియాను ఖచ్చితంగా గుర్తించి నాశనం చేసి, అవి మాయమైపోతాయని వెల్లడించారు. ఈ బ్యాక్టీరియో ఫేజ్‌లను గంగా నదికి “సెక్యూరిటీ గార్డ్‌లు” గా పరిగణించవచ్చని ఆయన అన్నారు. క్యాన్సర్, జన్యు సంకేతాలు, సెల్ బయాలజీ, ఆటోఫజీ వంటి పరిశోధనల్లో విశేష అనుభవం కలిగిన డాక్టర్ అజయ్ సోంకర్ వాజనింగెన్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, టోక్యో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి పనిచేశారు.
భారీగా విదేశీ గంజాయి, బంగారం పట్టివేత:
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి పెద్ద ఎత్తున అక్రమ రవాణాను గుర్తించి స్మగ్లర్ల కుట్రను భగ్నం చేశారు. ఈ ఘటనలో మొత్తం 27 కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు విదేశీ గంజాయిని చాకచక్యంగా 54 ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్‌లలో దాచిపెట్టారు. బట్టల తరలింపుగా చూపిస్తూ.. నాలుగు ట్రాలీ బ్యాగ్‌లను పూర్తిగా గంజాయితో నింపి దుబాయ్ నుండి ఢిల్లీకి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్ సమయంలో గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు అయ్యింది.
అస్సాంలో భూ ప్రకంపనలు:
అస్సాంలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం తెల్లవారుజామున (2.25 గంటలకు) అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) పేర్కొంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. దాంతో జనాలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అస్సాం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయని ఎన్‌సీఎస్ తెలిపింది. 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్, భూటాన్, చైనాతో సహా పొరుగు దేశాలలో కూడా భూకంపం సంభవించింది. 5 తీవ్రతతో సంభవించే భూకంపాన్ని మోస్తరుగా పరిగణిస్తారు.
ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ అంగీకారం:
రక్షణ ఖర్చులను 50 శాతం తగ్గించుకోవాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వాగతించారు. రక్షణ ఖర్చల్ని తగ్గించుకోవాలని అమెరికా రష్యా, చైనాలకు ప్రతిపాదన చేసింది. ఒకప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా,రష్యాల మధ్య ట్రంప్ రావడంతో స్నేహం చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆశ్చర్యకరంగా ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ ఆమోదం తెలిపారు. ఇది ‘‘మంచి ప్రతిపాదన’’ అని పుతిన్ పేర్కొన్నారు. ఇటువంటి ఫలితాలను అన్వేషించడానికి మాస్కో చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే, విస్తరణవాదంతో అన్ని సరిహద్దు దేశాలతో గొడవలు పెట్టుకుంటున్న చైనా అధ్యక్షుడు జి జెన్‌పింగ్ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.
ఉప్పాడ బీచ్ లో ప్రశాంత్ నీల్:
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. గత కొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు సంబందించి అల్లర్లు , రాస్తారోకో సీన్స్ షూటింగ్ ఫినిష్ చేసాడు ప్రశాంత్ నీల్. అయితే ఇటీవల కాకినాడ సమీపంలోని ఉప్పాడ బీచ్, పరిసర ప్రాంతాలను దర్శకులను పరిశీలించి వెళ్ళాడు. షిప్పింగ్ కు తదితర సంబంధిత సీన్స్ ను ఈ బీచ్ లో షూట్ చేయనున్నాడట ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ఉప్పాడ బీచ్ లొకేషన్స్ చూసేందుకు వచ్చిన వీడీయోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం వెస్ట్ బెంగాల్ లోని కోల్‌కతా కు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమా 1960లోని వెస్ట్ బెంగాల్ నేపధ్యంలో ఉండనుంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మార్చి 30న డ్రాగన్ షూట్ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.
వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శృతి హాసన్:
ప్రఖ్యాత భారతీయ నటి శ్రుతి హాసన్ డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐ’తో గ్లోబల్ ఆడియెన్స్‌కు పరిచయం కాబోతోన్నారు. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2, 2025 వరకు జరిగే హర్రర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాలను 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్‌గా జరగబోతోంది.ఈ ఈవెంట్ ప్రారంభ ఫీచర్‌గా ‘ది ఐ’ చిత్రం ఇండియా తరుపున ప్రీమియర్ కానుంది. డయానా (శృతి హాసన్) తన భర్త ఫెలిక్స్ (మార్క్ రౌలీ) కోసం చేసే ప్రయాణమే ఈ ‘ది ఐ’. చనిపోయిన తన భర్తను మళ్లీ తిరిగి తీసుకు వచ్చేందుకు వచ్చే ప్రయత్నాలు ఎంతో ఆసక్తిగా ఉండబోతోన్నాయని టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. తన భర్తను వెనక్కి తిరిగి తెచ్చకునేందుకు భార్య చేసి త్యాగాలు ఏంటి? ప్రయత్నాలు ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. గ్రీస్, ఏథెన్స్, కోర్ఫులోని అందమైన లొకేషన్‌లో చిత్రీకరించిన సీన్లు ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నాయి. 2023లో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో‘ది ఐ’ని ప్రదర్శించిన తర్వాత ప్రాజెక్ట్‌పై అందరిలోనూ మరింతగా ఆసక్తి నెలకొంది.
ఉత్కంఠ పోరులో అఫ్ఘానిస్తాన్ విజయం:
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా.. ఇంగ్లండ్- అఫ్ఘానిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ పై ఆఫ్గాన్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చివరి వరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేదు. 49.5 ఓవర్లలో ఇంగ్లండ్‌ను ఆఫ్గాన్ ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జో రూట్ (120) పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ (38), జోస్ బట్లర్ (38), జేమీ ఓవర్టన్ (32) హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (14) పరుగులు చేశారు. అఫ్ఘానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 కీలక వికెట్లు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. మహమ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫజల్ ఫరూకీ, రషీద్ ఖాన్, గులాబద్దీన్ నయిబ్ తలో వికెట్ సంపాదించారు. కాగా.. ఇంగ్లండ్ ఈ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.