NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

చంద్రగిరిలో ఉప ఎన్నికలు:
రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ , రెండు వైస్ సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి రూరల్ (మం) ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. చంద్రగిరి (మం) రామిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్ ఉమ, యర్రావారిపాళెం, చింతకుంట ఉప సర్పంచ్ రమేష్ నాయుడు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారం క్రితం తిరుపతి రూరల్‌లోని 27 మంది ఎంపీటీసీలను మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముంబై తరలించారు. శనివారం ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రక్షణ కోసం ముగ్గురు ఎంపీటీసీల ఇళ్లు వద్ద ఒక్కో కానిస్టేబుల్‌ను అధికారులు నియమించారు. మరోవైపు.. రామిరెడ్డిపల్లి వైసీపీ మద్దతుదారులైన ముగ్గురు వార్డు మెంబర్లను టీడీపీ నేతలు శ్రీశైలం తరలించారు. పోటీ జరిగే ప్రాంతాల్లో డీఎస్పీ ప్రసాద్ పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.

పేదలకు ఇళ్ళ స్థలాలపై చర్చ:
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్లు వివరించనున్నారు. ప్రతి కలెక్టర్ కు 10 నిమిషాల సమయం కేటాయిస్తారు.. రెవెన్యూ సమస్యలు.. ల్యాండ్ సర్వే.. మద్యం షాపులు.. జిల్లాలో పథకాల అమలుపై చర్చ జరగనుంది. వాట్సప్ గవర్నెన్స్, పీ4, జిల్లాలో పేదలకు ఇళ్ళ స్థలాలు, సోలార్‌రూఫ్ టాఫ్‌ లపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్య సాధన కలెక్టర్ల సామర్థ్యం, నెట్‌వర్కింగ్, సకాలంలో పనులు జరిగేలా చూసి ఫలితాలు రాబట్టడంపైనే ఆధారపడి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో నిన్న నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ లో ఆయన ప్రసంగించారు. ‘డబ్బులుంటేనే అన్ని పనులూ అవుతాయనుకోవడం సరికాదు. మీరు చేసే నెట్‌వర్కింగ్, పనుల వల్ల పెట్టుబడులు వస్తాయి. కొత్తగా రూ.2 వేల కోట్లతో వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) కూడా ఏర్పాటు చేశాం. అవసరమైతే దాన్ని మరో రూ.3-4 వేల కోట్లు పెంచుతాం. కలెక్టర్లు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పెట్టుబడిదారులను తీసుకొస్తే వీజీఎఫ్‌ కింద నిధులిస్తాం. జిల్లా స్థాయి ప్రాజెక్టులైనా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సులో స్వర్ణాంధ్ర విజన్‌ లక్ష్య సాధనపై సీఎం సమీక్షించారు.

తెలంగాణ అసెంబ్లీలో వివిధ శాఖల పద్దులపై చర్చ:
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు (మార్చ్ 26) శాసన సభలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ కొనసాగనుంది. అసెంబ్లీలో వివిధ శాఖల పద్ధులపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి- గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, హోమ్ అడ్మినిస్ట్రేషన్ శాఖల పద్దులపై చర్చతో సభ మొదలు కానుంది. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క- ఫిసికల్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్, సర్వే అండ్ స్టాటస్టిక్స్, ఎనర్జీ శాఖ, పద్దుపై చర్చ జరగనుంది.

చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం:
యాదగిరిగుట్ట జిల్లాలోని చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు (మార్చ్ 26) తెల్లవారు జామున విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ను వెనుక నుంచి రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ కొన్నాయి. కాగా, ఈ ప్రమాదంలో సుమారు 13 మందికి పైగా గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఆరెంజ్ ట్రావెల్ బస్సు డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇక, ఈ రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అలాగే, ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల ఆధారాలను సేకరిస్తున్నారు.

కేసీఆరే కాదు, ఎవరు సలహాలిచ్చిన స్వీకరిస్తాం:
అసెంబ్లీలో రోడ్లు భవనాల శాఖ పద్దులను ప్రవేశ పెట్టిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 2025-26 సంవత్సరానికి గాను రోడ్లు, భవనాల శాఖకు రూ.5903.95 కోట్ల ప్రతిపాదించాం. రాష్ట్ర బడ్జెట్ ద్వారా 1,790 కి.మీ + 98.26 కి.మీ రోడ్లు మెరుగుపరచడానికి, 52 వంతెనల నిర్మాణానికి రూ. 6,547.48 కోట్ల విలువగల పనులకు అనుమతి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం 747.8 కి.మీ పొడవున రూ. 2,120.81 కోట్ల విలువగల 89 పనులు ప్రగతిలో ఉన్నాయి.. MoRTH నుంచి CRIF క్రింద 435.29 కి.మీ రోడ్ల అభివృద్ధికి రూ. 850 కోట్ల అనుమతులు వచ్చాయి.. CRIF కింద 394.29 కి.మీ పొడవున రూ. 785 కోట్ల విలువగల 29 పనులు ప్రగతిలో ఉన్నాయి..మీరు ఆర్డీసీ ద్వారా చేసిన రూ. 4,167.05 కోట్ల లోన్ తీసుకోవడం జరిగింది.. హాస్పిటల్స్ నిర్మాణం చేయడం మంచి విషయం.. ఎల్బీనగర్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాన్ని 24 ఫ్లోర్లుగా నిర్మిస్తే.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుగుణంగా సరిదిద్దాం.. అల్వాల్ టిమ్స్ ను ఆగష్టు, 2025 నాడు ప్రారంభించేలా ప్రయత్నిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో కునాల్ కమ్రా పోస్టర్లు కలకలం:
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యవహారం ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు పాకింది. కునాల్ కమ్రాకు సంబంధించిన పోస్టర్లు పబ్లిక్ టాయిలెట్ వెలుపల ప్రత్యక్షమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తే.. ముఖానికి నలుపు రంగు పూసి వీధుల్లో ఊరేగిస్తామంటూ యువసేన అధ్యక్షుడు అనురాగ్ సోనార్‌ హెచ్చరించారు. శివసేన యువజన విభాగం కార్యకర్తలు.. కునాల్ కమ్రాను హెచ్చరిస్తూ నగరంలో పోస్టర్లు వేశారు. కామెడీ పేరుతో కునాల్ కమ్రా ప్రజలకు చెడును అందిస్తున్నాడని శివసేన యువజన విభాగం కార్యకర్తలు ధ్వజమెత్తారు. అతడి చెడు మనస్తత్వానికి నిరసనగా.. అతడి చిత్రాన్ని పబ్లిక్ టాయిలెట్‌ వెలుపల ఉంచినట్లు అనురాగ్ సోనార్ పేర్కొన్నారు. కునాల్ కమ్రా మధ్యప్రదేశ్‌కు వస్తే శివసేన కార్యకర్తలు.. అతడి ముఖానికి నలుపు రంగు పూసి వీధుల్లో ఊరేగిస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.

తండ్రి, కూతురిని చంపి.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు:
బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ముగ్గురు మృతి చెందారు. 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. దీని తర్వాత నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అరా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 2, ప్లాట్‌ఫామ్ నంబర్ 3 లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని అమన్ కుమార్‌గా గుర్తించినట్లు భోజ్‌పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రాజ్ తెలిపారు. ఈ సంఘటన తర్వాత, రైల్వే స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. మృతులందరూ ఉద్వంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారేనని చెబుతున్నారు. “ఆ వ్యక్తి అతను మొదట అమ్మాయిని, తరువాత ఆమె తండ్రిని కాల్చాడు, ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఆ ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.’ అని ఎస్పీ వెల్లడించారు. హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియలేదని ఎస్పీ తెలిపారు. అయితే, ఇది ప్రేమ వ్యవహారం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన తండ్రి అనీల్ సింగ్, మైనర్ కూతురు జియా కుమారి అని ఎస్పీ వివరించారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించామని, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరించారని ఎస్పీ తెలిపారు. ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కడానికి స్టేషన్‌కు వచ్చిందని తెలిసింది.

హమాస్‌పై ప్రజలు తిరుగుబాటు:
గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబావుటా ఎగరేశారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు. హమాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘హమాస్ అవుట్’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున పురుషులు పాల్గొన్నారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. తక్షణమే యుద్ధం ముగించాలని.. హమాస్ అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ‘‘యుద్ధాన్ని ఆపండి.. శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాం.’’ అని నినాదాలు చేశారు. బ్యానర్‌లను పట్టుకుని ‘‘హమాస్ అవుట్.. అవుట్.. అవుట్’’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ నిరసనల్లో వందలాది మంది పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆందోళనలను ముసుగులతో వచ్చిన హమాస్ ఉగ్రవాదులు.. నిరసన ర్యాలీని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలను బెదిరించి పంపించినట్లు సమాచారం. మరికొందరు లాఠీలు పట్టుకుని నిరసనకారులను బలవంతంగా చెదరగొట్టినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

హఫీస్ సయీద్ బంధువు హతం:
పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ భయాన్ని రుచి చూపిస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ నుంచి వచ్చి చంపుతారో తెలియక భారత వ్యతిరేక ఉగ్రవాదులు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. బయటకు వెళ్తే, తిరిగి ఇంటికి తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితులు అక్కడి ఉగ్రవాదుల్లో ఉన్నాయి. దీంతో కీలకమైన ఉగ్రవాదులు అండర్ గ్రౌండ్స్ వెళ్లారు. మరికొందరికి పాక్ ఐఎస్ఐ, ఇతర భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే, 26/11 ముంబై దాడులకు కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్ బంధువు, లష్కరే తోయిబా నిధుల సేకరణకు సంబంధించిన ఖారీ షాజాదాను సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీ నగరంలోని ఖైరాబాద్ ప్రాంతంలోని జామియత్ ఉలేమా ఇస్లాం అనే సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఖారీ షాజాద్‌ని స్థానిక మసీదు సమీపంలో కాల్చి చంపారు. ప్రార్థనకు వెళ్తుండగా, దగ్గర నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. ఇటీవల కాలంలో జామియత్ ఉలేమా ఇస్లామ్(JUI-F) వరసగా ఇది ఐదో దాడి. గత నెల కాలంలో ఇలాగే నలుగురు చనిపోయారు. తాజాగా ఖారీ హతమయ్యాడు.

అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ టైమ్ రికార్డ్:
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకేక్కించాడు హీరో కమ్ దర్శకుడు పృథ్వి రాజ్ సుకుమారన్. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఎల్2 ఎంపురాన్’ గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ సేల్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రూ. 46 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియా వైడ్ గా రూ.17 కోట్లు ఓవర్సీస్ లో రూ. 29 కోట్లు వసులు చేసింది. నేడు ఈ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం అంది. ఒక అంచనా ప్రకారం చూసుకున్న కూడా ఎంపురాన్ వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్లకు పైగా ఓపెనింగ్ డే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. రిలీజ్ కు ముందే ఈ స్థాయి ఓపెనింగ్ అనేది మలయాళ సినిమాలలో ఆల్ టైమ్ రికార్డ్. మరోవైపు వరుస ప్లాప్స్ ఇస్తున్న మోహన్ లాల్ సినిమాకు ఈ ఓపెనింగ్ అనేది మరో రికార్డ్. ఇలా విడుదలకు ముందే ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఎంపురాన్ రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో చూడాలి.

నా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది:
‘పెళ్లిసందD’ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుని వరుస ఆఫర్లు కొట్టేసింది. ‘ధమాకా’ తో మొదలు ఆదికేశవ, గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఎక్స్‌టాఆర్టినరీ మ్యాన్ ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేదింది. ఈ క్రమంలోనే రెండు మూడు ప్లాపులు తగిలేసరికి సైలెంట్ అయిపోయింది. తర్వాత ‘పుష్ప2’లో కిస్సిక్ సాంగ్‌తో ఒక్కసారిగా పడిలేచిన ఈ ముద్దుగుమ్మ, ప్రజంట్ నితిన్ సరసన ‘రాబిన్‌హుడ్‌’తో మళ్లీ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ లీల ఓ మీడియాతో ముచ్చటించింది. ‘నితిన్‌తో పనిచేయడం కంఫర్టబుల్‌గా ఉంది, సినిమా విషయంలో టీం అంతా చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం, చక్కని క్వాలిటీతో రిచ్‌గా సినిమా ఉంటుంది. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ల ట్రాక్‌ని షూట్‌ చేస్తున్నప్పుడే పడిపడి నవ్వుకున్నాం, వీరి సీన్స్‌ హిలేరియస్‌గా ఉంటాయి. ఇక నా పాత్ర గురించి చెప్పాలి అంటే ఇందులో నా పాత్ర పేరు నీరా వాసుదేవ్‌. ఫారిన్‌ నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిని. నాకు నేను ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటా. ఈ ప్రపంచమంతా నా చుట్టూనే ఉంటుందని ఫీలవుతుంటా. క్యూట్‌గా బబ్లీగా నా పాత్రను దర్శకుడు వెంకీ కుడుముల భాగా డిజైన్‌ చేశారు. మీకు తప్పకుండా నచ్చుతుంది.’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది.

అందుకే శ్రేయస్‌కు స్ట్రైక్ ఇవ్వలేదు:
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ సెంచరీ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మూడో స్థానంలో దిగిన శ్రేయస్‌.. ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. ఈ క్రమంలో 17 ఓవర్‌ పూర్తయ్యేసరికి 90 పరుగులకు చేరుకున్నాడు. అప్పటికి ఇంకా 3 ఓవర్లు ఉండడంతో.. శ్రేయస్‌ సెంచరీ లాంఛనమే అని అందరూ అనుకున్నారు. అయితే తర్వాతి 2 ఓవర్లలో 3 బంతులే ఆడి 7 పరుగులు మాత్రమే చేశాడు. శశాంక్‌ సింగ్ ఎక్కువగా స్ట్రైకింగ్‌ తీసుకోవడంతో శ్రేయస్‌ సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచాడు. మ్యాచ్‌ అనంతరం శ్రేయస్‌ అయ్యర్ సెంచరీ మిస్‌ కావడంపై శశాంక్‌ సింగ్ స్పందించాడు. శ్రేయస్ సూచన మేరకే తాను ఎక్కువగా స్ట్రైకింగ్‌ తీసుకున్నానని చెప్పాడు. ‘శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. డగౌట్ నుంచి శ్రేయస్ ఆట చూస్తూ ఎంజాయ్ చేశా. నేను క్రీజులోకి రాగానే శ్రేయస్ నాకు ఒక్కటే చెప్పాడు. నా సెంచరీ గురించి ఆలోచించకుండా దూకుడుగా ఆడమని చెప్పాడు. సెంచరీ కంటే జట్టు స్కోర్ ముఖ్యమన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. బౌండరీలు బాదగలనని నాపై నమ్మకం ఉంది. ఈ స్థానంలో ఎవరు బ్యాటింగ్‌ చేసినా హిట్టింగ్ చేయాల్సిందే. ఒక్కోసారి కనెక్ట్‌ కాదు. నా బలం ఏంటో తెలుసు. దానిపై మాత్రమే నేను దృష్టి పెట్టా. స్వేచ్ఛగా ఆడేలా నాకు అండగా నిలిచిన టీమ్‌మేనేజ్‌మెంట్కు దన్యవాదాలు’ అని శశాంక్‌ చెప్పుకొచ్చాడు.

నాకు మంచి ఊపొచ్చింది:
సీజన్ తొలి మ్యాచులోనే 97 పరుగులతో నాటౌట్‌గా నిలవడం తమకు మరింత కలిసొచ్చే అంశం అని పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ తెలిపాడు. శశాంక్ సింగ్ అద్భుతంగా ఆడాడని, 16 బంతుల్లో 44 రన్స్ చేయడం జట్టుకు కీలకంగా మారాయన్నాడు. ఒత్తిడిలో కూడా విజయ్ కుమార్ వైశాక్ ప్రశాంతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. సీజన్ ప్రారంభానికి ముందే అన్ని విధాలుగా సిద్ధమయ్యామని, ఇదే జోరును మిగతా మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నాం అని శ్రేయస్‌ చెప్పాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో 11 పరుగుల తేడాతో గెలిచింది.