NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్ట్:
విశాఖ నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఐఏఎస్‌లుగా అవతారం ఎత్తిన భార్య, భర్తల మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. భర్త జీవీఎంసీ కమిషనర్‌గా, భార్య హెచ్‌ఆర్‌సీ జాయింట్ కలెక్టర్‌గా మోసాలకు పాల్పడ్డారు. వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్‌లు కలిసి టిడ్కొ ఇల్లులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకీలి ఐఏఎస్ జంట టిడ్కో ఇల్లు ఇప్పిస్తామని పలువురు దగ్గర లక్షలు రూపాయలు కాజేశారు. ఇళ్లులు ఎక్కడ అని అడిగితే తిరిగి కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు.

సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు:
వచ్చే నెల రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సదస్సులు జరిగాయి. మొన్నటి సమావేశాల్లో కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శాఖల వారీగా తమ అభిప్రాయాలను తెలిపారు. తగిన సమయం లేని కారణంగా కలెక్టర్లు తమ అభిప్రాయాలు చెప్పలేకపోయారు. ఈసారి 36 ప్రభుత్వ శాఖల అధికారులు జిల్లాల సమాచారంతో ముందుగానే ప్రజెంటేషన్లు సిద్ధం చేయనున్నారు. సదస్సు నిర్వహణకు కనీసం వారం ముందు జిల్లాల కలెక్టర్లకు కార్యదర్శులు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు:
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. పోలీస్, ఎన్‌సీసీ, స్కౌట్ కవాతు మధ్య ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వారితో పాటు.. మంత్రులు నారా లోకేష్, సవిత, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణ రెడ్డి, సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారక తిరుమల రావు పాల్గొన్నారు. అనంతరం.. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి పద్మ అవార్డులు:
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయా రంగాల్లో వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. వైద్యరంగంలో విశిష్ట సేవలకు గానూ భారతదేశపు రెండో అత్యుత్తమ పౌరపురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వినూత్న పద్ధతులతో వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకున్న వారి సేవలకు కేంద్ర ప్రభుత్వం సరైన గుర్తింపుతో గౌరవించిందన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ వైద్య రంగంలో ఓ హబ్ గా గుర్తింపు తీసుకురావడంలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పోషించిన పాత్రకు, గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చేసిన విశేషకృషికి తగిన గుర్తింపు లభించడం హర్షణీయమన్నారు. 2002లో పద్మశ్రీ అవార్డును, 2016లో పద్మభూషణ్ అవార్డును అందుకుని.. ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికవ్వడం పట్ల కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

తెలంగాణలో నేడే పథకాల ప్రారంభం:
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 606 మండలాల నుంచి ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మధ్యాహ్నం 1 గంటకు ఈ పథకాలను ఒకేసారి ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 మధ్య రాష్ట్రం మొత్తం కవర్ చేయనున్నారు. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. నాలుగు సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో మధ్యాహ్నం 1 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందులో భాగంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ పథకాలను ప్రారంభించనున్నారు.

విమాన ఛార్జీల నియంత్రణపై డీజీసీఏ చర్యలు:
మహా కుంభం నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు విమాన ప్రయాణాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీనితో టిక్కెట్ ధరలు గణనీయంగా పెరగడంతో, విమానయాన సంస్థలకు విమాన ఛార్జీలను హేతుబద్ధం చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచించింది. ప్రయాగ్‌రాజ్‌కు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు ప్రయాగ్‌రాజ్‌కు మరిన్ని విమానాలను నడుపుతున్నాయి. జనవరి నెలలో ప్రయాగ్‌రాజ్‌కి విమాన కనెక్టివిటీని మెరుగుపరచడానికి డీజీసీఏ 81 అదనపు విమానాలను ఆమోదించింది. దీంతో మొత్తం 132 విమానాలు దేశవ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్‌ను కనెక్ట్ చేస్తున్నాయి.

‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్’ డూడుల్‌తో గూగుల్:
భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్‘ డూడిల్‌ను రూపొందించింది. ఈ డూడిల్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రాంతాల భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. ఈ రంగురంగుల కళాఖండాన్ని పుణేకు చెందిన కళాకారుడు రోహన్ దహోత్రే చిత్రీకరించారు. ఈ డూడిల్‌లో లడాఖ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న మంచు చిరుత, ధోతీ-కుర్తా ధరించిన ‘పులి’తో పాటు, పావురం, నీలగిరి తహర్ వంటి పక్షులు, జంతువులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ప్రతినిధితం చేస్తూ కనిపిస్తాయి. గూగుల్ డూడిల్ వివరణ ప్రకారం, ఈ కళాఖండం భారత గణతంత్ర దినోత్సవాన్ని, జాతీయ గర్వాన్ని, ఐక్యతను గౌరవించే గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సందర్భంగా జరుపుకుంటుందని తెలిపింది.

చెన్నై ఎయిర్‌పోర్టులో హై టెన్షన్:
చెన్నై ఎయిర్‌పోర్టులో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ బెదిరించారు. దాంతో విమానంలో ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపొయారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాశ్రయం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేసి బాంబులేదని నిర్ధారించారు. ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని:
భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) జరుపుకుంటోంది. ఇందుకోసం ముమ్మరంగా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే ప్రధాన ఆకర్షణ ఇందులో జరిగే పరేడ్. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పరేడ్ లో దేశంలోని సాంస్కృతిక గొప్పతనాన్ని, సైనిక శక్తిని ప్రదర్శించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ఏడాది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌కు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తారు. సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం, ఏకత్వం, సమానత్వం, అభివృద్ధి, సైనిక పరాక్రమాల సంబంధించిన సమ్మేళనం అక్కడ కనిపిస్తుంది. కవాతు వీక్షించేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు.

VD12 లో బాలీవుడ్ బిగ్ బీ:
‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘VD12’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఘాట్ వచ్చే నెల నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేయనున్నాడట. అయితే ఈ మూవీ 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన విజయ్ లుక్ కూడా కొత్తగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో అతిథి పాత్ర ఉందని, ఆ పాత్రలో ఓ సీనియర్ హీరో నటిస్తున్నాడని ఆ మధ్య టాక్ వినిపించగా.. ఇక ఇప్పుడు తాజా అప్ డేట్ ప్రకారం ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఇదే కనుక నిజం అయితే విజయ్ ఈ మూవీ తో హిట్ కొట్టడం పక్క అని చెప్పవచ్చు. ఈ మూవీ నిజంగ్ విజయ్ కెరీర్‌కి పెద్ద ఛాలెంజ్

బాబాయ్‌కి అబ్బాయ్‌ల విషెష్:
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. అందులో తెలుగు వారికి ఏడు అవార్డులు దక్కాయి. తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుండి ఐదుగురు ఉన్నారు. కళా రంగంలో గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ కు పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. సినీ రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కు అభినందనలు తెలుపుతూ అబ్బాయిలు జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ లు విషెస్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ” భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన నా బాల బాబాయ్​కి నా హృదయపూర్వక అభినందనలు. మీరు సినిమా రంగానికి చేస్తున్నవిశేష కృషి, అవిశ్రాంత ప్రజా సేవకు ఈ గుర్తింపు ఓ నిదర్శనంబాబాయ్’ అని పోస్ట్ చేసాడు

తెలుగోడి దెబ్బ.. రికార్డులు అబ్బా:
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ యువ ఆటగాడు తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త రికార్డు సృష్టించాడు. తిలక్ ఇటీవల తన ఆటతీరుతో భారత అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో తిలక్ ఒక్కసారైనా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు. ఇది ఒక బాట్స్మెన్ రెండు ఔట్స్ మధ్యలో చేసిన అత్యధిక పరుగులుగా ప్రపంచ రికార్డుగా నిలిచింది. దక్షిణాఫ్రికా పర్యటనలో తిలక్ చివరిసారిగా ఔటవగా.. ఆ తర్వాత రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో తన అద్భుత బ్యాటింగ్ ఫామ్‌ను కొనసాగించాడు. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 166 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తిలక్ 72* పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకోగా, తిలక్ వర్మ ఆదిన ఇన్నింగ్స్ విజయానికి ప్రధాన కారణమైంది. ఈ మ్యాచ్ లో సరికొత్త షాట్లతో తిలక్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో భారత జట్టు టీ20 సిరీస్‌లో 2-0 తో ముందంజలో ఉంది.