NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సామాన్యులకు అధిక ప్రాధాన్యం:
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఉన్నాయని.. మొత్తంగా 91 కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తామని బుధవారం ఓ ప్రకనలో చెప్పారు. జనవరి 10, 11, 12వ తేదీలకు గాను 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. మిగిలిన తేదీలకు ఒకరోజు ముందుగా జారీ చేస్తామని పేర్కొన్నారు. భక్తులు ఆధార్‌ కార్డు చూపించి టోకెన్లు పొందాలని సూచించారు. టోకెన్లు లేని భక్తులకు పది రోజుల పాటు శ్రీవారి దర్శనం ఉండదని టీటీడీ ఈవో స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల సమావేశం:
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు నేడు సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. తెలంగాణలో ఇండస్ట్రీ అభివృద్ధితో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎంతో చర్చించనున్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలన.. చిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు లాంటి విషయాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

రష్మికకు ఫీలింగ్స్ పాట చేయడం ఇష్టంలేదు:
పుష్ప-2 ఈనెల 5న విడుదలై సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఫీలింగ్ సాంగ్ దుమారం రేపుతుంది. దీనిపై హీరోయిన్ రష్మిక ఫీలింగ్ పాటకు డాన్స్ చేయడం తనకు ఇష్టం లేకపోయిన డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. దీనిపై సీపీఐ నారాయణ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ రష్మికకు ఫీలింగ్స్ పాటకు డాన్స్ చేయడం ఇష్టం లేదు.. కానీ డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాభిమానం చంపుకుని పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సినిమా హీరోలు రోడ్ షోలు ఎందుకు చేయడం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో షో చేస్తున్నప్పుడు… జనం వెంట పడటం సహజం అన్నారు. ప్రభుత్వాలు కూడా 100 రూపాయల టికెట్ వెయ్యి రూపాయలు చేయడం ఎందుకు ? అని నారాయణ ప్రశ్నించారు. పుష్ప సినిమాలో ఏముంది? ఒక ఎర్రచందనం దొంగ నీ హీరోగా చూపించారు. దాన్ని యువత మీద రుద్దుతున్నారని నారాయణ మండిపడ్డారు.

మిస్టరీగా మారిన భిక్కనూరు ఎస్సై మిస్సింగ్:
భిక్కనూరులో పనిచేస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సాయికుమార్‌, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శృతి, బీబీపేటకు చెందిన నిఖిల్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శృతి, బీబీపేటకు చెందిన నిఖిల్‌ మృతదేహాలు లభ్యం కాగా.. భిక్కునూరు ఎస్సై సాయికుమార్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో పోలీసుల్లో టెన్షన్ పెరుగుతుంది. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుగట్టు వద్ద ఎస్.ఐ. సాయికుమార్ కారు , పాదరక్షల గుర్తించారు పోలీసులు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే చెరువులో బీబీపెట్ కానిస్టేబుల్ శృతి, సహకార సంఘం కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. ముగ్గురు ఒకేసారి చెరువు గట్టుకు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. శృతి దీ ఆత్మహత్య కాదు హత్య అని బంధువులు ఆరోపిస్తున్నారు.

సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు:
ఇవాళ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా చూడాలని అన్నారు. టికెట్ల ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ప్రోత్సహించినట్టు లెక్క అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహించేలా చర్చలు ఉండాలన్నారు. సినిమా వాళ్ళు వేల కోట్లు ఖర్చు పెట్టీ సినిమాలు తీస్తున్నారన్నారు. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి, సినిమా టిక్కెట్లు రేట్లు పెంచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కోట్లు ఖర్చు చేసి…రెండు వేల కోట్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎందుకు టికెట్ల రేట్లు పెంచి ప్రోత్సహించాలి? అని ప్రశ్నించారు. సందేశాత్మక చిత్రాలు ఐతే ప్రోత్సాహకాలు ఇవ్వాలి… కానీ క్రైమ్, అశ్లీలత పెంచే సినిమాలకు బెనిఫిట్ ఎందుకు చేయాలి? అని సీపీఐ నారయణ ప్రశ్నించారు.

ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే కుంభమేళాలో మోడీ:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2025 ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే మహా కుంభమేళాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసినందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. 2025 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ లోపు దాడులు చేస్తామని ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వాంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. ఆ రోజుల్లోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌లో ఉంటారు.. ఈ మహా కుంభమేళానే ఈ ఇద్దరు నాయకులకు చివరిదిగా మారుస్తామని అతడు వార్నింగ్ ఇచ్చాడు.

నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు:
కర్ణాటకలోని బెలగావిలో నేడు, రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణం చేశారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్‌ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు. అయితే, మొత్తంగా 200ల మంది కీలక నేతలు ఈ మీటింగ్ లో పాల్గొంటారని ఏఐసీసీ వెల్లడించింది. ఈరోజు (డిసెంబర్ 26) మహాత్మాగాంధీ నగర్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. ఇక, రేపు (డిసెంబర్ 27) ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్‌ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ రెండు తీర్మానాలను ఆమోదించుకోనుంది. దీంతో పాటే వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై కీలక చర్చ జరపనున్నారు.

జో బైడెన్ కీలక నిర్ణయం:
క్రిస్మస్ పండగ వేళ ఉక్రెయిన్‌లోని పలు విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. ఈ క్రమంలోనే మాస్కో దాడుల నుంచి కీవ్‌ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించడానికి రెడీ అయ్యాడు. దీనిపై ఇప్పటికే రక్షణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు పంపినట్లు ఆయన చెప్పారు. ఉక్రెయిన్ గ్రిడ్ వ్యవస్థను నాశనం చేసి అక్కడి ప్రజలకు విద్యుత్ సరఫరా అందకుండా రష్యా కుట్ర చేస్తుందన్నాడు. మరికొన్ని రోజుల్లో బైడెన్‌ అధ్యక్ష పీఠం నుంచి తప్పుకోనున్నాడు.. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చే నాటికి ఉక్రెయిన్ కి మరింత ఎక్కువ సాయం చేయాలనే ఉద్దేశంతో బైడెన్‌ ప్రభుత్వం వరుస నిర్ణయాలను తీసుకుంటుంది.

జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి:
జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది. పెద్ద సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ విమానాలు ప్రభావితం అయ్యాయి. టిక్కెట్ల విక్రయాలు కూడా నిలిచిపోయాయి. విమానయాన సంస్థల బ్యాగేజీ చెక్-ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్య తలెత్తింది. జపాన్ ఎయిర్‌లైన్స్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సైబర్ దాడి గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ దాడిని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ధృవీకరించారు. అయితే విమానాల ఆలస్యం లేదా రద్దుకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్‌డేట్ లేదని ఆయన అన్నారు. కాగా.. జపాన్ ఎయిర్‌లైన్స్ (JAL) ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ (ANA) తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ.

నాకు కూడా సీఎం ఆఫర్ వచ్చింది:
2020 కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో నటుడు సోనూ సూద్ దేశవ్యాప్తంగా వలస కూలీలు, పేదలకు చేసిన సాయం అందరికీ తెలిసిందే. తన ఆస్తిని తనఖా పెట్టి దేశ, విదేశాలలో చిక్కుకుపోయిన చాలా మందిని సొంత స్థావరాలకు చేర్చాడు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలివుడ్ యాక్టర్ రాజకీయాల్లోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా.. సోనూ తన రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లడాడు. తన కొత్త చిత్రం ‘ఫతే’ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో భాగంగా నటుడు మరోసారి రాజకీయాల్లో చేరడం గురించి సమాధానమిచ్చాడు. సోనూసూద్ మాట్లాడుతూ.. “నాకు కూడా సీఎం ఆఫర్ వచ్చింది. నేను నిరాకరించడంతో డిప్యూటీ సీఎం అవ్వండి అని అడిగారు. జాతీయ నాయకులు నాకు రాజ్యసభ సభ్యునిగా కూడా అవకాశం కల్పిస్తామన్నారు. నువ్వు కచ్చితంగా రాజ్యసభకు రావాలి అని చెప్పారు. కానీ.. నేను దీనికి నిరాకరించాను. మీరు ఒక్కసారి పాపులర్ అయితే.. జీవితంలో పైకి ఎదగడం గురించి ఆలోచిస్తారు. పైకి వెళ్లిన కొద్ది ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.” అని సోనూ సమాధానమిచ్చాడు.

 

Show comments