కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ:
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగిసింది. సీఎం చంద్రబాబు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు జ్యూరిచ్ నుంచి బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీలోని అధికారిక నివాసానికి సీఎం చేరుకున్నారు. ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్‌తో సమావేశం అవుతారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను చంద్రబాబు కలనునారు. అలానే శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిలతో భేటీ కాకానున్నారు.
అటవీశాఖలో దశల వారీగా మార్పులు:
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖలో సమగ్ర మార్పుల మీద దృష్టి సారించారు. రాష్ట్ర అటవీశాఖకు ఎదురవుతున్న సవాళ్లను, శాఖాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రాధాన్య క్రమంలో మార్పులు తీసుకురానున్నారు. దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం మార్గాలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని శాఖ పి.సి.సి.ఎఫ్, హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.ను ఆదేశించారు. గత కొన్నేళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతిని సాధించలేకపోయిందని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. సమర్ధత కలిగిన నాయకత్వం అటవీ శాఖకు ఉన్నప్పటికీ సరైన ఫలితాలు సాధించలేకపోయిందని, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శాఖలో పూర్తిస్థాయి మార్పుచేర్పులతో మళ్లీ అటవీశాఖ రాష్ట్ర అవసరాల్లో, అభివృద్ధిలో ప్రాధాన్య స్థానంలో నిలిపేందుకు డిప్యూటీ సీఎం ప్రయత్నం మొదలుపెట్టారు. నూతనోత్తేజంతో, అద్భుత ప్రగతిలో అటవీ శాఖ పచ్చగా కళకళలాడాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు.
టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం:
హైదరాబాద్ లోని నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టూడియో సమీపంలోని టిఫిన్స్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేశారు. అయితే, మంటలు పక్కనే ఉన్న మరో మూడు షాపులకు వ్యాపించాయి. అవి పూర్తిగా దగ్ధమయ్యాయి.
నాల్గవరోజు కొనసాగుతున్న గ్రామ సభలు:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాల్గవరోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఇప్ప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,861 గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది మొత్తం లక్ష్యంలోని 85.96 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఒక్క రోజే రాష్ట్రంలో 3,130 గ్రామ సభలు, 856 వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమాలు గ్రామస్థుల సమస్యలపై చర్చించేందుకు, స్థానిక అవసరాలు గుర్తించేందుకు దోహదపడనున్నాయి.
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి లక్నోలోని దేవా రోడ్డులో కిరణ్, కుందన్ యాదవ్, బంటీ యాదద్, శోబిత్ యాదవ్‌లు ఆస్పత్రి నుంచి ఇంటికి వ్యాన్‌లో బయలు దేరారు. దేవా రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఇన్నోవా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో.. ఎదురుగా ఉన్న భారీ ట్రక్కును వ్యాన్ ఢీకొట్టడంతో అందులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నిప్పంటించుకుని మృతి చెందిన భర్త:
కర్ణాటక రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుణిగల్ పట్టణానికి చెందిన మంజునాథ్ బెంగళూరులోని నాగర్‌భావి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.. ఆ దంపతులకు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అయితే, గత కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండటంతో.. ఈ విభేదాలతో మంజునాథ్ రెండేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నాడు.. ఇక, విడాకుల కోసం ఇరువురు కోర్టును ఆశ్రయించారు.
డోనాల్డ్ ట్రంప్కి షాక్:
జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టు కేస్ లా.. ఈ జన్మ హక్కు పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని ఇల్లినాయీ, ఓరేగాన్, వాషింగ్టన్, ఆరిజోనా రాష్ట్రాలు వినిపించిన తమ వాదనల ఆధారంగా అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాఫ్నర్ ఈ ఆదేశాలు ఇచ్చింది. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా యూఎస్ లో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం ఉండేది.
ఆస్కార్ నామినేషన్స్ 2025 ప్రకటన:
చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు ఈ ఏడాది నామినేషన్లను ప్రకటించారు. గురువారం లాస్ ఏంజిల్స్‌లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ 2025కి నామినేట్ చేయబడిన పేర్లను వెల్లడించారు. ఈ నామినేషన్‌లో ఇండియన్-అమెరికన్ చిత్రం ‘అనుజ’ (హిందీ భాషా చిత్రం) కూడా బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చేరింది. మొదటి నామినేషన్లను జనవరి 17న ప్రకటించాల్సి ఉండగా, లాస్ ఏంజిల్స్‌లో అగ్నిప్రమాదం కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు జనవరి 23న నామినేషన్లను ప్రకటించారు. నామినేట్ చేయబడిన వారికి మార్చి నెలలో అవార్డులు ఇవ్వనున్నారు. భారత కాలమానం ప్రకారం.. విజేత పేరు మార్చి 3 ఉదయం 5:30 గంటలకు ప్రకటిస్తారు.
ఎంబీ ఫౌండేషన్ స్పెషల్ డ్రైవ్:
నమ్రతా శిరోద్కర్ జయంతి సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో ఎంబి ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో కీలకమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్‌ను అందించడం ద్వారా యువతుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు అద్భుత స్పందన లభించింది. బుర్రిపాలెం గ్రామంలోని దాదాపు 70 మంది బాలికలకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ మొదటి డోసును ఇచ్చారు. దీని కారణంగా గర్భాశయ క్యాన్సర్ నుంచి ఆ బాలికలు రక్షించబడతారని నమ్రత తెలిపారు.
సినీ ప్రముఖులపై ముగిసిన ఐటీ సోదాలు:
హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలోను ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారట ఐటీ అధికారులు. పుష్ప దర్శకులు సుకుమార్ ఇంట్లో రెండు రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నరు అధికారులు. అలాగే ఇద్దరు నిర్మాతల బ్యాంకు లావాదేవిలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
విడాకుల తీసుకోబోతున్న వీరేంద్ర సెహ్వాగ్:
టీమిండియా అభిమానులకు భారీ షాక్. భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భార్య ఆర్తి అహ్లావత్‌తో 20 ఏళ్ల వైవాహిక బంధానికి వీరూ స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 2004 డిసెంబరులో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్‌లు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఆర్యవీర్ (2007), వేదాంత్ (2010) ఉన్నారు. 20 ఏళ్ల పాటు సజావుగా సాగిన సెహ్వాగ్, ఆర్తిల వైవాహిక జీవితంలో కొన్ని నెలల కిందట మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం.