NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థుల మృతి:
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం కర్ణాటకలోని సింధునూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్‌ అక్కడిక్కడే చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని.. కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు (14 మంది) కర్ణాటకలోని హంపి క్షేత్రానికి సమీపంలోని శ్రీ నరహరి తీర్థుల బృందావనంలో పూజలకు బయల్దేరారు. సిందనూరు వద్ద చక్రాల బోల్టులు ఊడిపోవడంతో కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర.. డ్రైవర్‌ శివ అక్కడికక్కడే మృతి చెందారు.

శ్యామ్ బిషన్‌తో మంత్రి లోకేష్ భేటీ:
వరల్డ్ ఎకనమిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌తో ఏపీ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతతో అనుసంధానించి గ్లోబల్ స్టాండర్ట్స్ తో అందరికీ ఆరోగ్యం అందించడంపై సహకారం కావాలన్నారు లోకేష్. పోషకాహారం, సంరక్షణ కల్పించాలన్నది తమ లక్ష్యం అని.. హెల్త్ కేర్ డెలివరీలో ప్రపంచ ప్రమాణాలను సాధించడం, అన్ని ఎఐ ఎనేబుల్ మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెడతామన్నారు.

ఆయిల్ కంపెనీలో భారీ పేలుడు:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పెలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. బాయిలర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన రాత్రి 11 గంటలకు జరిగింది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో భారీ శబ్దాలు వినిపించాయి. పెద్దెతున్న మంటలు ఆకాశాన్నంటాయి. అగ్ని ప్రమాదం తర్వాత నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పక్కనే ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్ పేలే ప్రమాదం ఉండడంతో కార్మికులు, కంపెనీ నిర్వాహకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు:
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి వంటి పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారికి ఇప్పుడు వెసులుబాటు కల్పిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో ఈ పథకాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణా రావు, మంత్రి దనసరి అనసూయ, ఇతర ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లతో సచివాలయం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక విషయాలు చర్చించారు.

15 వేల కోట్ల ఆస్తిపై ప్రభుత్వం నియంత్రణ:
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు మరోసారి షాక్ తగిలేలా కనిపిస్తుంది. అతడి కుటుంబానికి సంబంధించిన దాదాపు 15 వేల కోట్ల రూపాయల ఆస్తులు మధ్యప్రదేశ్ సర్కార్ తీసుకుందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే, సైఫ్ అలీ ఖాన్ పటౌడి రాజవంశీయుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. పటౌడి రాజ వంశీయుల ముత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ 1947 భారతదేశం విభజన జరిగిన సమయంలో తన ఆస్తులు ఇక్కడే వదిలి పెట్టి పాకిస్తాన్ కి వెళ్ళగా.. అప్పుడు ఎవరైతే దేశాన్ని వదిలి వెళ్లారో.. ఆ ఆస్తి ఎనిమి చట్టం కిందికి వస్తుందని అప్పటి భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. అప్పుడు అభిదా సుల్తాన్ వదిలి వెళ్లిన రూ. 15 వేల కోట్ల ఆస్తి ఎనిమి చట్టం ప్రకారం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లుతుంది. కానీ, సైఫ్ అలీ ఖాన్ మాత్రం దానికి అడ్డుకట్ట వేసి అది మా వారసత్వపు ఆస్తి అని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వానికి ఎలా దక్కుతుంది దానిపై సర్వహక్కులు నాకు ఉన్నాయని న్యాయస్థానంలో పేర్కొన్నారు.

సంజయ్‌ రాయ్‌కు జీవిత ఖైదు:
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌కి శిక్ష ఖరారైంది. కోల్‌కతాలోని సీల్దా కోర్టు అతడికి జీవిత ఖైదును విధించింది. అయితే, ఈ కేసును ఈరోజు (జనవరి 22) మరోసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. కాగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయనుంది. అయితే, మరోవైపు కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ జీవిత ఖైదు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతా హైకోర్టుకు వెళ్లింది. నిందితుడికి మరణశిక్ష విధించాలన్న అప్పీలుపై విచారణకు ఉన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది.

మేం అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదు:
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. వచ్చీరావడంతోనే ఏడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేస్తున్నాడు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అక్రమ వలసల బహిష్కరణ, బర్త్ రైట్ పౌరసత్వం వంటి కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత, పనామా కాలువుతో పాటు గ్రీన్‌ల్యాండ్ తమ దేశంలో భాగం కావాలని కోరుకున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ని అమెరికా నియంత్రణలోకి తీసుకురావడానికి సైనిక జోక్యాన్ని తోసిపుచ్చడానికి నిరాకరించడం ద్వారా ఒక హెచ్చరిక చేశారు.

ఓ వైపు చర్చలు.. ఇంకోవైపు ఐడీఎఫ్ దాడులు:
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఐడీఎఫ్ దాడులు సాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జెనిన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఎనిమిది మంది చనిపోయినట్లుగా పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే వెస్ట్ బ్యాంక్ నగరం జెనిన్‌పై ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతున్న దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని హమాస్ పిలుపునిచ్చింది. పాలస్తీనా సాయుధ గ్రూపులకు కంచుకోటగా పేరొందిన జెనిన్‌లో ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్‌ అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు.

రాజా సాబ్ లేటెస్ట్ అప్డేట్:
ప్రస్తుతం రాజా సాబ్ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ నెలాఖరు వరకు ఫైటింగ్ సీన్లు కొన్ని తెరకెక్కించనున్నాడు మారుతీ. అయితే ఈ షెడ్యూలులో ప్రభాస్ ఉండరని ఆయన లేని సీన్స్ ను తెరకెక్కిస్తున్నారట. ఫిబ్రవరి లో షూట్ చేసే10 రోజుల షెడ్యూల్ లో డార్లింగ్ వచ్చి చేరతాడు. ఆ షెడ్యూల్ లో పాటలు మినహా మిగిలిన వర్క్ అంతా పూర్తవుతుందని యూనిట్ సభ్యుల సమాచారం. కానీ ఈ సినిమాలో విఎఫెక్స్ పోర్షన్ ఎక్కువ ఉంటుందని ఏప్రిల్‌ 10 నాటికి ఆ వర్క్ ఫినిష్ అవుతుందా లేదా అనే డౌట్ యూనిట్ లో ఉందట. వర్క్ ఫినిష్ కాకుంటే రిలీజ్ వాయిదా వేయక తప్పదు.

ఓపెన్ అయిన నటి ఊర్మిళా మతోండ్కర్:
ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , ఊర్మిళా మధ్య గొడవలు జరిగాయని, అందుకే వారు ఎక్కడ కూడా మీట్ అవ్వడం లేదు అని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల వర్మ దర్శకత్వం వహించిన ‘సత్య’ మూవీ రిరీలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ.. 1998 లో వచ్చింది. ఇందులో జేడీ చక్రవర్తి హీరోగా, ఊర్మిళా మతోండ్కర్ హీరోయిన్‌గా చేశారు. కాగా ఈ ‘సత్య’ మూవీ రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఊర్మిళా ఆర్జీవీతో గొడవలపై క్లారిటీ ఇచ్చింది. ఊర్మిళా మాట్లాడుతూ ‘ఆయన డైరెక్ట్ చేసిన ‘అంతం’, ‘గాయం’, ‘రంగీలా’ వంటి హిట్ మూవీస్ లో హీరోయిన్ గా చేశాను. ఆయన మూవీస్‌లో చాన్స్ దొరకడం నా లక్ అని చెప్పాలి. ఇలాంటి లేని పోనీ రూమర్స్ నమ్మోద్దు. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. కలవాలి మీట్ అవ్వాలి అంటే.. కెరీర్ పరంగా ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఇప్పుడు ఒక సందర్భం ఉంది కనుక మీ అందరితో కలిసి మాట్లాడుతున్న. వర్మ గారితో కూడా అలాగే. సినిమాకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే నేరుగా మాట్లడుకుంటాం’ అని కొట్టిపారేసింది ఊర్మిళా. ఈ క్రమంలో నటి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేడే భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20:
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భారత్ పోటీ పడబోతుంది. ఇందులో భాగంగా ఈ రోజు (జనవరి 22) ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో మొదటి మ్యాచ్‌ జరగబోతుంది. అయితే, ఇరు జట్ల బలాబలాలను చూస్తే దాదాపు సమానంగా కనపడుతున్నాయి. ఇక, ఇంగ్లాండ్ జట్టు టీ20 కోచ్‌గానూ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న మెకల్లమ్‌ తనదైన శైలిలో జట్టును రెడీ చేశాడు. అలాగే, మరోవైపు, గాయం నుంచి కోలుకొని దాదాపు 14 నెలల తర్వాత జట్టులోకి వచ్చిన సీనియర్‌ పేసర్‌ మహ్మద్ షమీపై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టుకి కూడా ఎంపికైన అతడు టీ20 ఫార్మాట్‌ ద్వారా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాడు.