NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పక్కింటావిడపై హత్యాయత్నం:
వివాహేతర సంబంధం బయటపడుతుందన్న అనుమానంతో పక్కింట్లో నివాసం ఉంటున్న మహిళపై ప్రియుడు, ప్రియురాలు కలిసి హత్యాయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో ఈ ఘటన చోటుచేసుకుంది. గణపర్తికి చెందిన పొలిమేర దీపిక పిల్లలతో కలిసి మునగపాక ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటి పక్కన రాజ్‌కుమార్, సరిత దంపతులు ఉంటున్నారు. అచ్చుతాపురంలో ఓ కంపెనీలో రాజ్‌కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. భర్త రాజ్‌కుమార్ డ్యూటీకి వెళ్లిన తర్వాత తన ప్రియుడిని సరిత ఇంటికి రప్పించుకుంటోంది. సరిత వ్యవహారాన్ని దీపిక గమనించింది. దీపికకు విషయం తెలిసిందని సరిత పసిగట్టింది. దీపిక ఎక్కడ తన భర్త రాజ్‌కుమార్‌కు చెబుతుందో అని సరిత బయపడింది. ఈ క్రమంలో రాత్రి 10:30 గంటల సమయంలో సరిత, ఆమె ప్రియుడు కలిసి దీపిక ఇంట్లో చొరబడ్డారు. నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి ఇనుపరాడ్డులతో దాడి చేశారు. అదే సమయంలో డ్యూటీ నుండి రాజ్‌కుమార్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో సరిత లేకపోవడం, పక్క ఇంట్లో శబ్దాలు రావడంతో దీపిక ఇంట్లోకి రాజ్‌కుమార్‌ వెళ్ళాడు. అప్పటికే దీపిక రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉంది. రాజ్‌కుమార్‌ వెంటనే దీపికను ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సరిత, ఆమె ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

జ్యోతిష్యుడి మృతి కేసు ఛేదించిన పోలీసులు:
విశాఖలో జ్యోతిష్యుడు మృతి కేసును ఛేదించారు పోలీసులు.. బీమిలి బీచ్‌ రోడ్డు కాపులుప్పాడలో అస్థిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అస్థిపంజరం కనిపించిన చోటే రుద్రాక్షలు, ఎరుపు, పసుపు పూసల దండలు, సగం కాలిన కనకదుర్గ ఫోటో, ఆకుపచ్చ పంచె అవశేషం కనిపించాయి. అస్థిపంజరం వద్ద లభించిన ఆనవాళ్లు ఆధారంగా చనిపోయింది పెందుర్తికి చెందిన జ్యోతిష్కుడు, 50 ఏళ్ల మోతి అప్పన్నదిగా గుర్తించారు కుటుంబ సభ్యులు. గుర్తు తెలియని వ్యక్తి మోతి అప్పన్నను ఇక్కడకు తీసుకొచ్చి చంపేసిన తర్వాత మృతదేహాన్ని కాల్చి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే, జ్యోతిష్యుడిది హత్యగా తేల్చారు పోలీసులు.. హత్యకు ఓ మహిళా తో జ్యోతిష్యుడు అసభ్య ప్రవర్తనే కారణంగా చెబుతున్నారు.

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్:
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కేటీఆర్ దీనిపై స్పందించి కేసీఆర్ బదులు వేరే వాళ్ళను అక్కడ పోటీ చేయించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేయాలని కానీ అసెంబ్లీకే రాకుంటే అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్‌లో తెలిపారు. “2023 డిసెంబరు 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్, స్పీకర్‌ కార్యాలయం తగిన ప్రొసీడింగ్స్‌ చేపట్టలేదు. ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలకు వేతనాలను కూడా పెంచారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ విధులు నిర్వహించలేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పించాలి. కొత్త వారిని ఎంపిక చేసేలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చర్యలు తీసుకోవాలి. కోర్టు ముందుకు మొదటిసారి ఇలాంటి పిటిషన్‌ వచ్చింది. శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే విస్తృతాధికారం న్యాయ వ్యవస్థకు ఉంది.” అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఇందులో ప్రతివాదులుగా స్పీకర్, స్పీకర్‌ కార్యాలయంతోపాటు కేసీఆర్, కేటీఆర్‌లను చేర్చారు.

తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్:
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 1లోని స్టార్‌ హోటల్‌ అయిన తాజ్‌ బంజారా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. ఈ హోటల్‌ నిర్వాహకులు గడిచిన రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాత్సారం చేయడంతో పాటు పలు మార్లు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదని ఆఖరికి రెడ్‌ నోటీసులు సైతం జారీ చేశామని ఏఎంసీ ఉప్పలయ్య తెలిపారు. రెండు సంవత్సరాలుగా సదరు సంస్థ ’ రూ. 1 కోటి 40 లక్షల పన్ను బకాయి ఉన్నారని ఎంతకు స్పందించకపోవడంతో హోటల్‌ను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీ:
రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. పొత్తికడుపు సంబంధిత సమస్యతో ఆమె గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల బృందం పర్యవేక్షణలో సోనియా గాంధీ ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆసుపత్రి బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఛైర్మన్‌ అజయ్‌ స్వరూప్‌ తెలిపారు. గతేడాది డిసెంబరు నెలలో సోనియా 78వ పడిలో ప్రవేశించారు.

సంభాల్ హింసపై సిట్ నివేదిక:
సంభాల్ హింసపై సిట్ దర్యాప్తు పూర్తి చేసింది. ఆ బృందం వెయ్యి పేజీలకు పైగా చార్జిషీట్ దాఖలు చేసింది. ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్, సదర్ ఎమ్మెల్యే కుమారుడు సుహైల్ ఇక్బాల్ సహా 37 మంది నిందితులు నిందితుల్లో ఉన్నారు. చార్జిషీట్‌లో హింసలో పాల్గొన్న వారి పేర్లు, వారి పాత్ర, సీసీటీవీ ఫుటేజ్ వివరాలు, వీడియో క్లిప్‌లు, ఇతర ఆధారాలు ఉన్నాయి. 2500 మందికి పైగా గుర్తు తెలియని నిందితులను చేర్చారు. గోడలపై 74 మంది ఫోటోలు అతికించారు. నవంబర్ 24న జామా మసీదు లోపల సర్వే సందర్భంగా మసీదు చుట్టుపక్కల ప్రాంతంలో.. నఖాసా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూపూర్ ఖేడాలో హింస చెలరేగింది. ఈ హింసలో నలుగురు మరణించారు. దుండగులు 8 వాహనాలను తగలబెట్టారు. దుండగులు రాళ్లు రువ్వడంతో 4 మంది అధికారులు, 20 మంది పోలీసులు గాయపడ్డారు. ఇంతలో అంతర్రాష్ట్ర వాహన దొంగతన ముఠా నాయకుడు షరీఖ్ సాతా ప్రధాన కుట్రదారులలో చేర్చబడ్డాడు.

ట్రంప్ మరో సంచలన నిర్ణయం:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కాష్ పటేల్‌ నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. ఎఫ్‌బీఐ తొమ్మిదవ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను నియమిస్తూ ట్రంప్ అధికారికంగా సంతకం చేశారని అధ్యక్షుడి సహాయకుడు, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొత్త ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకాన్ని వైట్ హౌస్ స్వాగతించినట్లు తెలిపారు. ట్రంప్ ఎజెండాను అమలు చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించింది.

బస్సుల్లో వరుస పేలుళ్లు:
ఆగి ఉన్న మూడు బస్సులలో వరుస పేలుళ్లు సంభవించడంతో సెంట్రల్ ఇజ్రాయెల్ దద్దరిల్లింది. ఇది ఉగ్రవాద దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరూ గాయపడినట్లు, మరణించినట్లుగాను నివేదిక లేదు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ గాజా నుండి నలుగురు బందీల మృతదేహాలను తిరిగి ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఇవే కాకుండా మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలు దొరికాయని, కానీ.. అవి పేలలేదని పోలీసు ప్రతినిధి ASI అహరోని తెలిపారు. ఐదు బాంబులు ఒకేలా ఉన్నాయని, వాటికి టైమర్లు అమర్చారని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. పేలని బాంబులను బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసారని అధికారులు తెలిపారు.

ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన డాకు మహారాజ్:
నందమూరి బాల‌కృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మాసివ్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘డాకు మ‌హారాజ్’. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ క‌లెక్ష‌న్స్‌తో అద‌ర‌గొడుతోంది. ప‌ది రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా వ‌ర‌కు గ్రాస్, రూ.85 కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్‌ రాబట్టింది. లాంగ్ రన్‌లో వంద కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్‌ను డాకు మ‌హారాజ్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాతో బాలయ్య వరుసగా వంద కోట్లు కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. అయితే థియేటర్లో దుమ్ముదులిపిన డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అవుతుందోనని ఓటిటి డేట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. డాకు మహారాజ్ ను ఫిబ్ర‌వ‌రి 21 నుంచి అనగా ఈ రోజు నుండి తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా 40 రోజుల థియేటర్ రన్ తర్వాత ఓటీటీ రిలీజ్ కు వచ్చింది. సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించగా ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ఇటీవల కాలంలో బెస్ట్ మ్యూజిక్ అనే చెప్పాలి.

శంకర్‌కు షాక్ ఇచ్చిన ఈడీ:
ప్రముఖ డైరెక్టర్ శంకర్‌ కు ఈడీ షాక్ ఇచ్చింది. దాదాపు రూ.10 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం ఈడీ చర్యలు తీసుకుంది. ఈ నెల 17న ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ తాజాగా తెలిపింది. రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘రోబో’. శంకర్‌ టేకింగ్‌, రోబోగా రజనీ నటన, ఐశ్వర్యరాయ్‌ అందం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక చిట్టిగా రోబో పాత్రలో రజనీ నటన అందరినీ అలరించింది. ఇక క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ ఒళ్లుగగురుపొడిచేలా చేశాయి. 2010లో విడుదలైన ఈ సినిమా 15సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది తన కథ అని.. ‘జిగుబా’ను కాపీ కొట్టి శంకర్‌ ‘రోబో’ సినిమా తీశారని.. అరూర్‌ తమిళనాథన్‌ అనే వ్యక్తి 2011లో పిటిషన్‌ దాఖలు చేశారు. శంకర్‌ కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక కూడా దీన్ని ఒప్పుకుంది. జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య చాలా పోలికలున్నాయని వెల్లడించింది. కాపీరైట్‌ చట్టంలోని సెక్షన్‌ 63ని శంకర్ ఉల్లంఘించినట్టు ఆ వివరాల ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో తాజాగా ఈడీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తోంది.

అక్షర్​కు ఆఫర్ ఇచ్చిన రోహిత్:
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా విజయంతో శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, ఈ విజయంతో అందరూ సంతోషంగా ఉన్న.. అక్షర్ పటేల్‌కు మాత్రం కొంత అసంతృప్తి మిగిలింది. హ్యాట్రిక్‌కు ఒక్క వికెట్ దూరంలో ఉన్న అతడు, కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ వదిలేయడం కారణంగా గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో అక్షర్ 9వ ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు. తంజీద్ హసన్ (25), ముష్ఫికర్ రహీమ్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. హ్యాట్రిక్ బంతికి, కొత్తగా వచ్చిన జేకర్ అలీ ఔటవ్వాల్సిన అవకాశం వచ్చింది. అతడు ఔట్‌సైడ్ ఎడ్జ్‌తో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతిలోకి లడ్డూ లాంటి క్యాచ్ ఇచ్చాడు. కానీ రోహిత్ ఆ క్యాచ్‌ను పట్టలేకపోయాడు. దీంతో అక్షర్ హ్యాట్రిక్ వికెట్స్ అందుకోలేకపోయారు. తన తప్పిదాన్ని అర్థం చేసుకున్న రోహిత్ వెంటనే అక్షర్‌కు క్షమాపణ చెప్పాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “ఆ క్యాచ్‌ను నేను పట్టాల్సింది. కానీ, స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తుంటే ఒక్కోసారి ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి. క్యాచ్ మిస్ అయినందుకు రేపు అక్షర్‌ను డిన్నర్‌కి తీసుకెళ్తాను” అని సరదాగా అన్నాడు. రోహిత్ ఆ క్యాచ్‌ను అందుకుని ఉంటే బంగ్లాదేశ్ 200 పరుగుల దాటే పరిస్థితి ఉండేది కాదు.

నమోదైన రికార్డ్స్ ఇవే:
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో 11,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 270 మ్యాచ్‌లు, 261 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్న రోహిత్.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్) మాత్రమే ఉన్నాడు. రోహిత్ ప్రస్తుతం వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గంగూలీకి సమీపంలో ఉన్నాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన భారత ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 338 సిక్సులు ఉండగా.. అగ్రస్థానంలో షాహిద్ అఫ్రిది 351 సిక్సులతో కొనసాగుతున్నాడు. ఇక బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీ, వేగంగా 200 వన్డే వికెట్లు పూర్తి చేసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతను కేవలం 104 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ (133 మ్యాచ్‌లు) రికార్డ్ ను అధిగమించాడు. ప్రపంచ క్రికెట్‌లో మాత్రం మిచెల్ స్టార్క్ (102 మ్యాచ్‌లు) అతనికి ముందున్నాడు. అంతేకాదు, షమీ ఇప్పుడు ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీల్లో కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అతడి ఖాతాలో 60 వికెట్లు ఉండగా, జహీర్ ఖాన్ (59), జవగల్ శ్రీనాథ్ (47) తరువాతి స్థానాల్లో ఉన్నారు.