Site icon NTV Telugu

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

13 మంది భక్తులకు గాయాలు:
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఆటో వాలాల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. టైం స్లాట్ టోకెన్ తీయిస్తామంటూ రైల్వే స్టేషన్ వద్ద భక్తులకు ఎక్కించుకుని వేగంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమయం ముగిస్తే భక్తుల వద్ద తీసుకున్న డబ్బులు రిటన్ ఇవ్వాల్సి వస్తుందనే అలోచనతో ఓ ఆటో డ్రైవర్ ఒవర్ టేక్ చేసే సమయంలో ముందున్న జీపును డీకోట్టాడు. దీంతో ఆటోలొ ప్రయాణిస్తున్న 13 మంది భక్తులు గాయాలు అయ్యాయి‌‌‌‌‌. బెంగుళూరు చెందిన భక్తుడి తలకు తీవ్రమైన గాయం కావడంతో స్దానిక ఆసుపత్రికి తరలించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఆటోవాలాల దందాను ఆరికట్టాలని భక్తులు‌‌ కోరుతున్నారు. టైం స్లాట్ టోకెన్ పెంచితే.. ఈ దందాకు అడ్డుకట్ట పడుతుందంటున్నారు.

బర్త్‌డే విషెస్‌పై స్పందించిన చంద్రబాబు:
నేడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం. పల్లె నుంచి పట్నం వరకు, దేశధినేతల నుంచి విదేశీయుల వరకు అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌డే బర్త్ డే విషెస్‌పై సీఎం స్పందించారు. “నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.” అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో రాసుకొచ్చారు. చాలా విషయాలను ఆయన పంచుకున్నారు.

నేటి నుంచి రైతు మహోత్సవం:
నేటి నుంచి ‘రైతు మహోత్సవం’ వేడుకలు ఆరంభం కానున్నాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో ఏప్రిల్ 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. రైతు మహోత్సవం నేపథ్యంలో నేడు జిల్లాలో ముగ్గురు మంత్రులు, పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు. రాష్ట్ర రైతు మహోత్సవం మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరంబించనున్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ చేసేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహిస్తోంది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అభ్యుదయ రైతులు హాజరుకానున్నారు. రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలు పంచుకుకొనున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా మార్కెట్లోకి వచ్చే యంత్రాలు, పరికరాలు, నూతన వంగడాలు, మేలు రకం విత్తనాలను వ్యవసాయ అనుబంధ విభాగాలు, విశ్వవిద్యాలయాలు ప్రదర్శించనున్నాయి.

రెండు కార్లు ఢీ.. ముగ్గురు అక్కడికక్కడే మృతి:
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షగాత్రులను చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 9 మంది ప్రయాణిస్తున్నారు. మృతులు అలీ (45), అజీం బేగం (40), ఎండీ గౌస్‌ (1)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రామకుప్పం మండలం జల్ది గాని పల్లె సమీపంలో చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురుకి గాయాలు అయ్యాయి. గాయపడిన వారికి స్దానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణం‌‌ అని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ డీజీపీ హత్య వెనుక మిస్టరీ ఇదే:
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం పోలీసులు సంఘటనాస్థలికి చేరుకోగానే ఓం ప్రకాష్ రక్తపుమడుగులో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్య పల్లవి.. కుమార్తె చంపినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మధ్య కాలంలో ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు కనుగొన్నారు. అయితే చావుబతుకుల మధ్య రక్తపుమడుగులో ఉన్నప్పుడు తనను కాపాడాలంటూ 15 నిమిషాలు ఓం ప్రకాష్ వేడుకున్నారు. కానీ భార్య, కుమార్తె ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయలేదని పోలీసులు తెలిపారు. ఇక ఘటనాస్థలిలో రెండు కత్తులు, ఒక బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. హత్య చేశాక.. ఘటనాస్థలిలో కారం పొడి చల్లేశారు. ఆయుధాలపై కూడా కారం చల్లారు. ఇక ఓం ప్రకాష్‌ను చంపేశాక.. ఆ రాక్షసుడిని చంపేశానంటూ భార్య పల్లవి విల్లా బయటకు వచ్చి పెద్ద పెద్దగా కేకలు వేసింది. దీంతో అక్కడ వారంతా షాక్‌కు గురయ్యారు. గత వారం రోజులుగా ఆస్తి గొడవలు ఎక్కువైనట్లుగా తెలుస్తోంది.

ఆస్పత్రిలో అమానుషం:
మధ్యప్రదేశ్‌‌లోని ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధుడిని వైద్య సిబ్బంది కనికరం లేకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు వైద్యులపై సస్పెండ్ వేటు వేసింది. ఏప్రిల్ 17న నౌగావ్ పట్టణానికి చెందిన ఉద్ధవ్ సింగ్ జోషి (77).. భార్య వైద్య పరీక్షల కోసం ఛతర్‌పూర్‌లోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరు వ్యక్తులు.. జోషిని లాక్కెళ్లారు. టైమ్ స్లాట్ స్లిప్ తీసుకుని చాలా సేపు క్యూలో ఉన్నానని.. తన వంతు వచ్చినప్పుడు డాక్టర్ రాజేష్ మిశ్రా అభ్యంతరం చెప్పి చెంపదెబ్బ కొట్టాడని జోషి ఆరోపించాడు. అప్పటికే ఆ స్థలం రద్దీగా ఉందని.. క్యూలో నిలబడే విషయంలో డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశాడని సివిల్ సర్జన్ జీఎల్ అహిర్వర్ పేర్కొన్నారు.

నేటి నుంచి 4 రోజులు భారత్‌లో జేడీ వాన్స్ ఫ్యామిలీ పర్యటన:
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలు పెంచేసిన తరుణంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఢిల్లీలో ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీకానున్నారు. ఈ సందర్భంగా సుంకాలపై ఇరువురు చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా జేడీ వాన్స్‌ దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. జేడీ వాన్స్‌ వెంట అమెరికా రక్షణ, విదేశాంగ శాఖలకు చెందిన ఐదుగురు అధికారులు ఉండనున్నారు.

15 మంది వైద్యుల హత్య:
గాజా-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిశాక పరిస్థితులు అదుపు తప్పాయి. హమాస్ అంతమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే సారి బందీలను విడుదల చేసేంత వరకు యుద్ధం కొనసాగుతుందని ఐడీఎఫ్ పేర్కొంది. ఇదిలా ఉంటే మార్చి 23న ఉగ్రవాదులు అంబులెన్స్‌లో వెళ్తున్నారన్న అనుమానంతో ఐడీఎఫ్ దళాలు దాడి చేయడంతో 15 మంది అత్యవసర వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ అంశంపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అత్యవసర వైద్య సిబ్బందిపై విచక్షణారహిత దాడులు ఏంటి? అని ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇజ్రాయెల్ దర్యాప్తు చేపట్టింది.

కోహ్లీతో అట్లుంటది మరి:
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో తన అద్భుత బ్యాటింగ్‌తో అలరించే విరాట్.. సంబరాలు చేసుకోవడంలోనూ ముందుంటాడు. అది మనోడైనా, పగోడైనా.. కోహ్లీ ప్రతీకార సెలెబ్రేషన్స్ మరో లెవల్లో ఉంటాయి. ఇది మరోసారి రుజువైంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌పై కింగ్ తన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇటీవల బెంగళూరును దాని సొంతగడ్డ చిన్నస్వామిలో పంజాబ్‌ కింగ్స్‌ ఓడించింది. ఆర్సీబీ ఓడాక శ్రేయస్‌ అయ్యర్ గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. అప్పుడు శ్రేయస్‌ను చూసిన విరాట్ ఏమీ అనకుండా ఉండిపోయాడు. ఆదివారం పంజాబ్‌ను దాని సొంతగడ్డపై బెంగళూరు చిత్తుగా ఓడించడంతో విరాట్‌ రెచ్చిపోయాడు. జితేష్ శర్మ విన్నింగ్స్ షాట్ ఆడగానే.. శ్రేయస్‌ వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. ఇది చూసిన శ్రేయస్‌ తలాడిస్తూ ముందుకు రాగా.. విరాట్ నవ్వుతూ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కోహ్లీతో అట్లుంటది మరి’, ‘మనోడైనా, పగోడైనా ఒక్కడే’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ నిర్మాత కారణంగా అద్దం చూసుకోవడం మానేశా:
తాజా ఓ ఇంటర్వ్యూలో విద్య బాలన్ మాట్లాడుతూ ఓ నిర్మాత కారణంగా తాను ఎదురుకున్న సమస్య గురించి చెప్పుకుంది. విద్య మాట్లాడుతూ.. ‘ఒక నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు.. అసభ్యంగా పిలిచాడు. అతను నన్ను అలా అవమానించిన తర్వాత నేను అద్దంలో ఆరు నెలలు నా ముఖం కూడా చూసుకోలేదు. ఎదుటి వ్యక్తులు మాట్లాడే మాటలు నాపై నాకున్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశాయి. అలాగే ఒక సినిమా కోసం నేను బరువు పెరుగుతున్న సమయంలో బాడీ షేమింగ్ చేసేవారు. ఒక సారి మలయాళం‌లో కూడా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో నను దురదృష్టవంతురాలు అభివర్ణించారు. మూవీ టీం ఆపేసిన అక్కడ నను బ్లెమ్ చేశారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి చాలా ఉంటాయి’ అని తెలిపింది విద్య.

ధనుష్ – దేవిశ్రీ.. వనవాసం ముగిసింది:
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఓ హిట్ ఆల్బమ్ ఇస్తే అతడ్నే రిపీట్ చేస్తుంటారు హీరో అండ్ ఫిల్మ్ మేకర్స్. కానీ ధనుష్ మాత్రం 14 ఏళ్లుగా పక్కన పెట్టేశాడు. ఫస్ట్ టైం ఆర్య రీమేక్ కుట్టీ కోసం వర్క్ చేశారు ఈ ఇద్దరు. 2010లో వచ్చిన ఈ రీమేక్‌కు ఇంచుమించు ఆర్య సాంగ్స్, బీజీఎం ఇచ్చేయడంతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు దేవీకి. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుని ధనుష్ ఖాతాలో మంచి ఆల్బమ్‌గా మిగిలింది. ఇక ఇదే ఉత్సాహంతో నెక్ట్స్ వెంఘైకి ఛాన్స్ ఇచ్చాడు ధనుష్. సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. కానీ ఈ సినిమా పాటల పరంగా ఓకే కానీ సినిమా మాత్రం ఊహించనంత టాక్ తెచ్చుకోలేకపోయింది. ఆ టైమ్ లో ధనుష్ కు దేవి శ్రీ మధ్య ఎదో జరిగినట్టు గాసిప్స్ కూడా వినిపించాయి. కారణాలు ఏవైనా సరే అప్పటి నుండి ఇప్పటి వరకు ధనుష్ అండ్ రాక్ స్టార్ కలిసి వర్క్ చేయలేదు. 14 ఏళ్ళు అంటే రాముడు వనవాసం చేసినంత కాలం అయింది వీరి కాంబోలో సినిమా వచ్చి. కాగా మళ్ళి ఇన్నాళ్లకు ఈ ఇద్దరినీ కలిపాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ధనుష్- శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరకి దేవీ శ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. జూన్ 20న థియేటర్లలోకి రాబోతుంది కుబేర. 14 ఏళ్లు తర్వాత కొలబరేట్ అయిన ఈ కాంబో ఇప్పుడు ఎటువంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

 

Exit mobile version