శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం:
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ మండలంలోని జాతీయ రహదారిలో నీలం జూట్ మిల్ దగ్గర ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసమయ్యారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బరంపురం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ట్రావెల్ బస్సును ఓ గ్రానైట్ లారీ ఢీట్టింది. దాంతో వెనకాలే ఉన్న మరో గ్రానైట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. సడన్ బ్రేక్ కారణంగా వెనుకనున్న లారీ క్యాబిన్‌పై ఓ గ్రానైట్ బ్లాక్ పడింది. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘ్టనలో మొత్తంగా బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసం అయ్యాయి.
నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు:
ఏపీలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముంది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. విజయనగరం, మన్యం, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. తూర్పుగోదావరి, ప్రకాశం, వైఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మన్యం-5, అల్లూరి-2, విజయనగరం-2, తూర్పుగోదావరి-1 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. పలు ప్రాంతాల్లో పిడుగులు, గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెట్ల క్రింద, శిథిల గోడలు, భవనాల వద్ద ఉండొద్దని అధికారులు సూచించారు. ఏపీలో మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నేటి నుంచి అమల్లోకి పెరిగిన మెట్రో రైలు ఛార్జీలు:
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల భారం తప్పడం లేదు. ఇటీవల మెట్రో ఛార్జీల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెంచిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. నేటి నుంచి పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. 2017లో హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. మెట్రో ప్రయాణానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్నారు. కాగా మెట్రో ప్రారంభం అయినప్పటి నుంచి ఛార్జీల పెంపు ఇదే తొలిసారి. గత రేట్లతో పోల్చితే 20 శాతం పెరిగిన టికెట్ ధరలు.. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సులతో ఛార్జీలు పెంచిన L&T సంస్థ.. ఇప్పటివరకూ కనీస ఛార్జీ 10 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 12 రూపాయలకు పెరిగింది.. అలాగే గరిష్ట ఛార్జీ 60 రూపాయల నుంచి రూ. 75 రూపాయలకు పెరిగింది. ఒకేసారి 20 శాతం రేట్లు పెంచడంతో మెట్రో రైలు ప్రయాణికులు మండిపడుతున్నారు.
చాదర్ ఘాట్ లో రెచ్చిపోయిన దొంగలు:
చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఫహిముద్దీన్ ఇంట్లో 75 తులాల బంగారు నగలు .రూ.2.50 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. ఫహిముద్దీన్ భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఫహిముద్దీన్ శుక్రవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులను ఉంచి ఆసుపత్రికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆగంతకులు ఇంటి వెనక నుంచి లోనికి ప్రవేశించారు. ఫహిముద్దీన్ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొళ్లెంపెట్టారు నిందితులు. దర్జాగా ఇంట్లోకి ప్రవేశించి రాత్రి చాలా సేపు తిష్ట వేశారు. ఫ్రిడ్జ్ లో పండ్లు తిని బీరువాలో ఉన్న బంగారం, నగదు ఇతర వస్తువులు చోరీ చేశారు. చోరీ అనంతరం నగలు నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు. తెల్లవారు జామున ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఫహిముద్దీన్ కు షాక్ తగిలినట్లైంది. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చాదర్ ఘాట్ పోలీసులు, క్లూస్ టీమ్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం ఘటన స్థలానికి చేరుకున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కళ్ల ముందే పంట నాశనమవడం చూసిన రైతు ఏం చేశాడో చూడండి:
ఆరుగాలం కష్టపడి పండిస్తున్న రైతన్నకు నష్టాలే మిగులుతున్నా యి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో కన్నీళ్లే మిగులుతున్నాయి. దేశాన్ని ఎప్పుడూ ఆకలితో పడుకోనివ్వని రైతు ప్రకృతి ముందు కూడా నిస్సహాయుడవుతున్నాడు. చలి, వేడి, ఎండ, వానలను భరించి తాను పండించిన పంటను మార్కెట్‌కు తరలిస్తే అక్కడ కూడా పంటకు రక్షణ లేకుండా పోతోంది. అకాల వర్షాల వల్ల వారి పంటలు కొట్టుకుపోతే.. ఆ అన్నదాత ఎంత ఆవేదనకు గురవుతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో వాషిమ్ అనే జిల్లాలో రైతులు తమ వేరుశనగ పంటను అమ్ముతుంటారు. అలాగే ఓ రైతు కూడా తన పంటను విక్రయించడానికి మార్కెట్‌కి వచ్చాడు. కానీ అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. నేలపై పారబోసిన పంట ఒక్కసారిగా వరద నీటికి కొట్టుకుపోతోంది. తన కళ్ల ముందే పంట నాశనమవడం చూసిన ఆ రైతు తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు. జోరుగా కురుస్తున్న వర్షంలో తడుస్తూ.. వర్షపు నీటికి కష్టపడి పండించిన పంటల కొట్టుకుపోతుంటే.. దాన్ని కాపాడుకునేందు ప్రయత్నిస్తున్నాడు. తన పంట కొట్టుకుపోతుండటం చూసి రైతు నిస్సహాయంగా వర్షంలో నేలపై కూర్చుని ఒక సంచితో ఆపడానికి ప్రయత్నిస్తాడు.
మాకు టర్కీతో సంబంధాలు లేవు:
Celebi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత్‌కి వ్యతిరేకంగా టర్కీ, పాకిస్తాన్‌కి సహకరించింది. టర్కీష్ డ్రోన్లను పాక్‌కి అందించింది. వీటిని దాయాది దేశం భారత్‌పైకి దాడిలో ఉపయోగించింది. ఇదే కాకుండా ఈ డ్రోన్లు ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా పాకిస్తాన్ పంపించినట్లు వార్తలు వస్తున్నా్యి. అయితే, ఈ నిర్ణయంపై భారత్ టర్కీపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బాయ్‌కాట్ టర్కీ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఆపిల్స్‌ని వ్యాపారులు బ్యాన్ చేశారు. టర్కీకి వెళ్లే టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉంటే, భారతదేశంలోని 9 ఎయిర్ పోర్టు్ల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీస్ ప్రొవైడర్‌గా సేవలు అందిస్తున్న టర్కీ విమానయాన సంస్థ అయిన సెలెబి కి భారత్ అనుమతుల్ని రద్దు చేసింది. “జాతీయ భద్రత దృష్ట్యా” భద్రతా అనుమతిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
విదేశాలకు పంపే డబ్బుపై పన్ను:
విదేశాలకు పంపే డబ్బుపై (రెమిటెన్స్) ఐదు శాతం పన్ను విధించాలని అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది జరిగితే అమెరికా నుంచి తమ ఇళ్లకు డబ్బు పంపే ఎన్నారైలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెమిటెన్స్‌లపై ఐదు శాతం ఎక్సైజ్ సుంకం విధించాలనుకుంటున్నారు. గ్రీన్ కార్డ్ హోల్డర్ లేదా H1B వీసాపై పని చేయడానికి అక్కడికి వెళ్లిన ప్రతి వలసదారునికి ఈ రుసుము వర్తిస్తుంది. దీని వల్ల దాదాపు 4 కోట్ల మంది వలసదారులు ప్రభావితమవుతారని భావిస్తున్నారు. ప్రతిపాదిత రుసుము US పౌరులకు వర్తించదు. RBI మార్చి బులెటిన్ ప్రకారం.. భారత్ కు చెల్లింపులు 2010-11లో $55.6 బిలియన్ల నుంచి 2023-24 నాటికి $118.7 బిలియన్లకు రెట్టింపు అవుతాయి.
నేటి నుంచే ఐపీఎల్ పునః ప్రారంభం:
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 నేడు పునః ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య ఆరంభం కానుంది. సొంతగడ్డపై జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు దూసుకెళుతుంది. ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న కోల్‌కతాకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఇరు జట్లకు విజయం తప్పనిసరి కాబట్టి.. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
ప్రముఖ సింగర్ కన్నుమూత:
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుసగా ఒక్కోక్కరు ఏదో ఓ కారణం చేత, అనారోగ్యంతో కన్నుముస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా (44) ఇక లేరు. ఇది నిజంగా ఓ చేదు వార్త. గత ఏడాది కాలంగా కొలన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె అకాల మరణం పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు.. ‘ఆమె మరణం అస్సామీ సంగీతానికి తీరని లోటు’ అని ఆయన తెలిపారు. అలాగే పలువురు సినీ, సాంస్కృతిక ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
అజిత్ కుమార్ నెక్ట్స్.. షూటింగ్.. రిలీజ్ ఎప్పుడంటే:
వరుస ప్లాప్స్ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఈ సినిమాతో తమిళనాడులో సంచాలనాలు నమోదు చేసాడు. ఆధిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. కాగా ఇప్పుడు నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై రోజుకొక వార్త వెలువడుతున్నాయి. హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం అజిత్‌కు బాగా అలవాటు. శివ, హెచ్ వినోద్‌లకు గ్యాప్ లేకుండా బ్యాక్ తూ బ్యాక్ ఛాన్సులిచ్చాడు తలా. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు చేశాడు హెచ్ వినోద్. ఇక రీసెంట్ సూపర్ హిట్ గుడ్ బాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ తో మరో సినిమా చేసేందుకు అజిత్ రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. అధిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ కుమార్ ను డైరెక్ట్ చేయబోతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కథ చర్చలు కూడా ముగిశాయని టాక్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ లో షూటింగ్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు అజిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంచే ఛాన్స్ ఉంది. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా ఆధిక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఏకే 64 గురించి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసే అవకాశాలున్నాయి. AK 64లో అజిత్ కుమార్ డ్యూల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని సమాచారం.
