నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలు:
సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క్వశ్చన్ అవర్‌తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. నిరుద్యోగ భృతి, పారిశ్రామిక వాడల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర నిధులకు సంబంధించి సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. నెల్లూరులో పశు వైద్య కళాశాల, ఎన్ఆర్ఈజీఎస్‌లో అవినీతికి సంబంధించి సభ్యుల ప్రశ్నించనున్నారు. క్వశ్చన్ అవర్ తర్వాత మాజీ సభ్యుడు మృతికి సంతాప తీర్మానం చేయనున్నారు. సభలో ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టిషనర్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరోవైపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2023-24 ఏపీ మెట్రో రైలు సంస్థ లిమిటెడ్ యొక్క 9వ వార్షిక నివేదికను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 2025 ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల, పట్టాదారు పాసు పుస్తకముల సవరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించవలసినదిగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రతిపాదించనున్నారు. ఉద్యోగుల సమస్యలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు:
ఏపీలో నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మార్చి 31న రంజాన్ పండగలో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటే.. సోషల్ పరీక్షలో మార్పు చేయనున్నారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకూ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశ్నపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. విద్యార్థులకు చివరి నిముషం వరకూ పరీక్షా కేంద్రాలలోకి అనుమతి ఉంటుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యంను ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్ధులు పరీక్షలకు హజరుకానున్నారు. పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. పరీకా కేంద్రాల పరిధిలో జిరాక్సు, నెట్ సెంటర్లను మూసి ఉంటాయి. ఫేక్ న్యూస్, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులకు ఎలాంటి అవసరం ఉన్నా.. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబరు 08662974540కి కాల్ చేయొచ్చు. ఇక చీఫ్ సూపరింటిండెంట్ తప్ప ఎవరి మొబైల్ ఫోన్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే.. సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అంబర్ పేటలో దారుణం:
అంబర్ పేటలో ఓ భర్త తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఆ భర్త. తీవ్రగాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఈ దారుణ ఘటనలో భార్య వాంగ్మూలంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నవీన్ మద్యానికి బానిసై భార్య రేఖను నిత్యం వేధిస్తుండేవాడు. చంపుతానని బెదిరింపులకు పాల్పడేవాడు. భర్త ఆగడాలతో విసుగుచెందిన భార్య రేఖ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టింది. అయినప్పటికీ నవీన్ లో మార్పు రాలేదు. ఈ క్రమంలో నవీన్ తన భార్యతో మరోసారి గొడవపడ్డాడు. భార్యను అంతమొందించాలని ముందుగానే ప్లాన్ చేసిన నవీన్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ భార్యపై పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత తనతో గొడవ పడి ఆత్మహత్యా యత్నం చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. నిజామాబాద్ లో ఉండే అత్త, మామలకు ఫోన్ చేసి.. మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని నవీన్ చెప్పాడు. అల్లుడిపై అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేఖ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నవీన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
నేడు శాసన సభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు:
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ రెండు చారిత్రాత్మక బిల్లులను నేడు శాసన సభలో ప్రవేశపెట్టనున్నది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులతో పాటు మొత్తం ఐదు బిల్లులను సభలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్నది. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్లు ( రాష్ట్రంలో విద్య..ఉద్యోగ రంగాల్లో అమలు ), బీసీలకు అర్బన్ అండ్ లోకల్ బాడి లో రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుల ద్వారా బీసీలకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతోపాటు, సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనున్నది.
డీఎంకే టార్గెట్‌గా బీజేపీ ఆందోళనలు:
తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంకోవైపు అధికార డీఎంకే కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా పోరాటం చేస్తోంది. తమపై హిందీ భాష బలవంతంగా రుద్దుతోందని నిరసన గళాన్ని రేపుతోంది. ఇలా అధికార-విపక్షాల మధ్య రాజకీయ వార్ మొదలైంది. ఇదిలా ఉంటే సోమవారం డీఎంకే టార్గెట్‌గా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మద్యం దుకాణాల ముట్టడికి కాషాయ పార్టీ పిలుపునిచ్చింది. లిక్కర్ స్కామ్‌లో వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు పోరాటం చేయాలని కమలనాథులు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ శ్రేణులు, ప్రజలు పోరాటంలో పాల్గొనాలని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోరారు.
సుప్రీంకోర్టులో నేడు ఆర్జీ కర్ కేసుపై విచారణ:
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రిలో మహిళా జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 17న ఈ కేసును సుమోటోగా విచారిస్తుంది. గత సంవత్సరం కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రిలో ఒక ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, వైద్య కళాశాలలు దారుణమైన అత్యాచారం, హత్య కేసుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్నాయి. సుప్రీంకోర్టులో అప్పీల్ తర్వాత తిరిగి విధుల్లోకి చేరిన వైద్యులు, వైద్య నిపుణులను శిక్షించవద్దని గత విచారణలో ప్రధాన న్యాయమూర్తి ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. కేసులో ఏకైక నిందితుడు సంజయ్ రాయ్ కు కోల్‌కతా ప్రత్యేక కోర్టు జనవరి 20న శిక్ష విధించింది. ఆర్జీ కర్ అత్యాచారం-హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు పశ్చిమ బెంగాల్ లోని సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. 50,000 జరిమానా కూడా కోర్టు విధించింది.
ఈ వారంలో ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు జరిగే ఛాన్స్:
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగింపునకు గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా అధికారులు-రష్యాతో చర్చలు జరుపుతున్నారు. మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని రష్యాను అమెరికా కోరింది. దీనికి ఉక్రెయిన్ సానుకూల సంకేతాలు ఇవ్వగా.. రష్యా నుంచి మాత్రం స్పష్టమైన సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ వారం కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు ఉంటాయని అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు. ఇరువురి మధ్య చర్చల తర్వాత పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రయాణికుల జేబులకు చిల్లు:
విమాన ప్రయాణం కేవలం సౌకర్యంగా మాత్రమే కాకుండా ఖరీదైన అవసరంగా మారింది. విమానయాన సంస్థలు ఇప్పుడు సీట్ల ఎంపిక, లగేజ్ చెక్-ఇన్, భోజనం వంటి సేవలకు అదనంగా వసూలు చేస్తున్నాయి. గత దశాబ్దంలో విమానయాన పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. గతంలో విమాన ప్రయాణం ఒక విలాసవంతమైనదిగా భావించేవారు. కానీ, ఇప్పుడు అది ఒక అవసరంగా మారింది. పేద, ధనిక తేడా లేకుండా అందరు ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు. ప్రయాణీకుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కానీ విమానయాన సంస్థల లాభాలు తగ్గుతున్నాయి.పెరుగుతున్న ఖర్చుల కారణంగా విమానయాన సంస్థలు వివిధ సేవలకు ప్రయాణీకుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు.
అదే హీరోతో జత కడుతున్న అనుపమ:
రీసెంట్‌గా ‘రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్’లో అద్భుతమైన పాత్రలో కనిపించి యూత్‌ని ఓరేంజ్‌లో ఆకట్టుకున్న అనుపమ తాజాగా ఓ తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ – అనుపమ కాంబోలో ప్రాజెక్ట్ ఓకే అయిందట. ఈ ఏప్రిల్ నుంచి సినిమా మొదలుకాబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో రానున్నాయి. ‘శతమానం భవతి’ మూవీ కోసం తొలిసారి జోడీ కట్టిన శర్వానంద్ – అనుపమ పరమేశ్వరన్ ఇన్నాళ్లకు మళ్లీ వీరిద్దరూ కలసి నటించబోతున్నారు. అయితే ప్రస్తుతం శర్వానంద్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ‘నారీ నారీ నడుమ మురారి’ తో పాటు, అభిలాష్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల షూటింగులూ సమాంతరంగా జరుగుతున్నాయి. ‘నారీ.. నారీ’ దాదాపుగా పూర్తి కావొచ్చిందట, అందుకే సంపత్ నంది సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శర్వా. అలాగే దర్శకుడు సంపత్ నంది తన ‘ఓదెల 2’ చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. ఇక శర్వానంద్ – అనుపమ మూవీ గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
రామ్-చందు మొండేటి.. మ్యాటర్ ఏంటంటే:
ఉస్తాద్ రామ్ పోతినేని చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్నాడు. 2019 లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో భారీ మాస్ హిట్ అందుకున్న రామ్ మరల ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు వేటికవే భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం మహేష్ బాబు. పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆంధ్రాలో షూటింగ్ జరుగుతుంది. కాగా ఈ సినిమా తర్వాత రామ్ నెక్ట్స్ సినిమా పై రోజుకొక న్యూస్ తెరపైకి వస్తున్నాయి. తాజాగా రామ్ పోతినేని హీరోగా తండేల్ దర్శకుడు చందు మొండేటి హీరోగా ఓ సినిమా రాబోతుంది అని టాలీవుడ్ సిర్కిల్స్ లో టాక్ వినిపించింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని టాక్ నడిచింది. ఈ విషయమై రెండు టీమ్స్ ను ఆరా తీయగా అదేం లేదని ఫేక్ న్యూస్ అని వివరణ ఇచ్చారు. రామ్ ప్రస్తుతం కథలు వింటున్నాడు తప్ప ఏది ఫైనల్ చేయలేదని తెలిసింది. ఆ మధ్య మరో దర్శకుడు హరీష్ శంకర్ కూడా కథ వినిపించాడు కానీ ఫైనల్ కాలేదని సమాచారం. ఆయన గత చిత్రం ఏంటది దారుణ ఫలితం రాబట్టిందో తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ డిజిస్టర్ తో మేల్కొన్న రామ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. మాస్ ఇమేజ్ వెంట పరిగెత్తకుండా కలిసొచ్చిన లవ్ స్టోరీ జానర్ లో సినిమా చేస్తున్నాడు. ఇకనుండి రామ్ కాంబోలు నమ్ముకుని కాకుండా కథ నమ్ముకుని సినిమాలు చేయడం సంతోషం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ టికెట్ల జారీ ప్రారంభం:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 బజ్ ప్రారంభమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభంకానున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. మార్చి 23వ తేదీన ఉప్పల్ వేదికగా హైదరాబాద్ – రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. కాగా ఈనెల ఉప్పల్ వేదికగా 23, 27 తేదీల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ఫిజికల్ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఐపీఎల్ టికెట్స్ జారీ ప్రారంభమైంది. ఆన్లైన్ లో ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఫిజికల్ టికెట్స్ జారీ చేయనున్నారు. సికింద్రాబాద్ జింఖానా స్టేడియం, ecil స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంతోపాటు.. హిమాయత్ నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అత్తాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని కాలిఫోర్నియా బురిటో రెస్టారెంట్ల లో ఫిజికల్ టికెట్లు అందించనున్నారు. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వారు QR కోడ్, ఆధార్ చూపిస్తే టికెట్స్ అందించనున్నారు నిర్వాహకులు.
కేకేఆర్‌కు భారీ షాక్:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మరో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షాక్ తగిలింది. భారత స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఉమ్రాన్ స్థానంలో భారత ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియాను కేకేఆర్ మేనేజ్మెంట్ జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరుతో కోల్‌కతా తన మొదటి మ్యాచ్ ఆడనుంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.